
ఆధునిక ప్రపంచానికి దూరంగా నివసించేవారు తప్ప, తక్కిన వారెవరైనా క్రిప్టోకరెన్సీ, బిట్ కాయిన్, ఎస్‌క్యూఎఫ్‌టి, డిజిటల్ కరెన్సీ వంటి పదాలను వినే ఉంటారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా దీనిగురించే చర్చ నడుస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే బిట్ కాయిన్ (క్రిప్టో కరెన్సీ, డిజిటల్ కరెన్సీ) ఆధునిక కాలపు కరెన్సీ. దీనిని అంతర్జాతీయంగా ఎక్కడైనా మార్చుకోవచ్చు. రానున్న రోజుల్లో ప్రపంచం మొత్తంగా ఇదే శాసించే అవకాశమూ లేకపోలేదు. ఊహాజనిత ధనం లేదా కనిపించని ధనం అనేవి సరైన పదాలు. కానీ ఇది అన్ని దేశాల కరెన్సీలతో మారకం అవుతుంది. ఏ దేశంలోనైనా చెల్లుబాటవుతుంది. దీనిని ఇంటర్నెట్, ఫోన్ ద్వారా మార్చుకోవచ్చు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఏదైనా కొనుగోలు చేయొచ్చు. అయితే దీనికి ఎలాంటి రక్షణా లేకపోవడం వల్ల మెజారిటీ దేశాలు దీనిని నిషేధించాయి. అయితే దీని వినియోగంతో లాభాలెన్నో.. అనర్థాలూ అన్నే ఉన్నాయనేది విశ్లేషకుల అభిప్రాయం. కాగా కొన్ని దేశాలు మాత్రం అధికారికంగా చెల్లుబాటులోకి తెచ్చాయి. మనదేశంలోనూ డిజిటల్ మనీ తేనున్నట్లు ఇటీవల పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కేంద్ర ఆర్థికమంత్రి పేర్కొన్నారు. అసలు బిట్ కాయిన్ ఎలా పుట్టింది? ఎలా చెల్లుబాటవుతుంది? దీనివల్ల లాభాలేంటి? అనర్థాలేంటి? వంటి విషయాలపైనే ఈ ప్రత్యేక కథనం..
బిట్ కాయిన్, డిజిటల్ కరెన్సీ.. ఈ మధ్య కాలంలో విపరీతంగా ప్రచారమవుతున్న వాటిలో ఇదొకటి. బిట్ కాయిన్/ డిజిటల్ కరెన్సీకి భౌతికరూపం లేదు. ఇది క్రిప్టో కరెన్సీ. దీని లావాదేవీలన్నీ డిజిటల్ రూపంలోనే జరుగుతాయి. అమెరికా, బ్రిటన్, జపాన్ వంటి కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో దీనికి అనుమతి ఉంది. అయితే, వాస్తవానికి ఒకటి రెండు దేశాలు తప్ప దీనిని ఏ ప్రభుత్వమూ అధికారికంగా తమ లావాదేవీల్లో ఉపయోగించట్లేదు. అయితే కొందరు మాత్రం బిట్ కాయిన్ ఓ గొప్ప ప్రారంభం అని చెబుతున్నారు. కానీ మనలో చాలా మంది దీనిపై ఇంకా అవగాహన పెంచుకునే దశలోనే ఉన్నార. ఒకవేళ మనం ఇప్పటికే ఈ దశలో ఉన్నట్లయితే, క్రిప్టోకరెన్సీల ట్రేడింగ్ మనదేశంలో నిషేధించారని కూడా తెలిసే ఉంటుంది. పేపాల్, వీసా, మాస్టర్ కార్డ్ వంటి ఆర్థిక సంస్థలు అలాగే ఎల్ సాల్వడార్ వంటి దేశాలు ఎంత విస్తృతంగా క్రిప్టో కరెన్సీని అవలంభిస్తున్నాయో చూస్తే, ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోకి ఎలా చొచ్చుకొస్తుందో అర్థం చేసుకోవచ్చు.
కరెన్సీ రూపాంతరాలు ఇలా..
ఇప్పుడంటే బ్యాంకులు, ప్రభుత్వాలు ఇన్ని నోట్లు ముద్రించి, వాటికి విలువను నిర్దేశిస్తున్నాయి. కానీ ఒకప్పుడు ఇవేవీ లేవు. వస్తువులకు, సేవలకు విలువ కట్టి, అంతకు సమానమైన విలువ వస్తు మార్పిడి చేసుకునేవారు. ఆ దశ నుంచి.. మానవ పరిణామ క్రమంలో లోహాలు, బంగారం తదితర నాణేలను ముద్రించి, వాటి విలువకు ప్రమాణంగా చేసుకున్నాం. ఆ తర్వాత బ్యాంకు నోట్లు.. క్రెడిట్/ డెబిట్ కార్డుల వరకూ ధనం అనేకవిధాల రూపాంతరం చెందుతూ వచ్చింది. ఈ పరిణామక్రమంలో తాజా మజిలీ క్రిప్టో కరెన్సీ. బిట్‌కాయిన్ అనండి.. ఎరిథ్రియం అనండి.. డిజిటల్ కరెన్సీ లేదా ఇంకోటి పేరేదైనా.. అన్నీ హైటెక్ యుగపు డిజిటల్ టెక్నాలజీ ప్రతిరూపాలే. పలుదేశాల్లో ఇప్పటికే విస్తృత వాడకంలో ఉన్న ఈ క్రిప్టో కరెన్సీ.. దాంతో చేసే వ్యవహారాలపై దేశమంతా చర్చలు జరుగుతున్న తరుణం. ఒక్కసారిగా దీని గతం, వర్తమానం, భవిష్యత్తును సమీక్షించాల్సి ఉంది.
డిజిటల్ ప్రపంచంలో మాత్రమే..
చిన్నప్పుడు ప్రతి ఒక్కరూ కాగితపు నోట్లతో ఆడుకునే ఉంటాం. క్రిప్టో కరెన్సీ దాదాపు అలాంటిదే. కాకపోతే ఇది డిజిటల్ ప్రపంచంలో మాత్రమే ఉంటుంది. పైగా ఈ కరెన్సీని చూడవచ్చు, వాడుకోవచ్చు. కానీ అసలు నోట్లు, నాణేల మాదిరిగా ముట్టుకోలేము, పర్సుల్లో దాచుకోలేము. అన్నీ ఇంటర్నెట్‌లోనే. వంద రూపాయల నోటు విలువ ప్రభుత్వం రద్దు చేయనంత వరకూ అంతే ఉంటుంది. కానీ క్రిప్టో కరెన్సీకి ఉండే విలువ మాత్రం.. చెల్లించే వారిపై ఆధారపడి హెచ్చుతగ్గులకు లోనవుతూ ఉంటుంది. అచ్చం బంగారం ధర మాదిరే అన్నమాట. ఫలానా క్రిప్టోకరెన్సీకి డిమాండ్ బాగా ఉంది. కానీ సరఫరా తక్కువ ఉందీ అంటే విలువ పెరుగుతుంది. అలాగే మైనింగ్ పద్ధతి ద్వారా ఒక క్రిప్టో నాణేన్ని ఉత్పత్తి చేసేందుకు ఎంత ఖర్చవుతుందన్న అంశంపైనా దాని విలువ ఆధారపడి ఉంటుంది. మార్కెట్‌లో ఉన్న ఇతర క్రిప్టో కరెన్సీలు ఒక్కోదాని విలువను ఒక్కోలా నిర్ణయిస్తుంటాయి. డాలర్, యూరో, ఎన్, యాన్, రూపాయిల మాదిరిగానే క్రిప్టో ప్రపంచంలో బిట్ కాయిన్, ఎరిథ్రియం, రిపుల్, లైట్‌కాయిన్, కార్డానో, బిట్‌కాయిన్ క్యాష్ అని బోలెడన్ని పేర్లతో వేర్వేరు కరెన్సీలు ఉన్నాయి.

కాయిన్ బహుమతులు..
రూపాయిలు, డాలర్లంటే ఉద్యోగం, వ్యాపారం ఏదో ఒకటి చేసి సంపాదించుకుంటాం. మరి డిజిటల్ కరెన్సీ క్రిప్టో మాటేమిటి? ఇందుకోసమూ ప్రస్తుతం అనేక మార్గాలున్నాయి. కొన్ని కంపెనీలు ఈ-కామర్స్ వ్యవహారాలకు సాధారణ నగదును స్వీకరించి, అందులో కొంత భాగాన్ని మనకు క్రిప్టో కరెన్సీ రూపంలో ఇస్తున్నాయి. ఇంకో పద్ధతి ఏమిటంటే అత్యంత శక్తిమంతమైన కంప్యూటర్ అల్గారిథమ్ ద్వారా సృష్టించిన ఒక గణితశాస్త్రపు చిక్కుముడిని విప్పడం. దీన్నే మైనింగ్ అంటారు. ఇక మూడో పద్ధతి. ఎవరో మైనింగ్ ద్వారా సంపాదించుకున్న కరెన్సీని ఎక్ఛేంజీల్లో డబ్బులు పెట్టి కొనుక్కోవడం. దాని విలువ పెరిగితే మనకూ లాభాలొస్తాయని వేచిచూడటం. అచ్చం స్టాక్ ఎక్స్చేంజీల మాదిరిగా అన్నమాట. మైనింగ్ వ్యవహారం మొత్తం బిట్‌కాయిన్‌తో మొదలైనప్పటికీ ఇప్పుడు దాదాపు అన్ని క్రిప్టో కరెన్సీలూ ఈ పద్ధతిని ఉపయోగిస్తున్నాయి. క్రిప్టో కరెన్సీలు మొత్తం పనిచేసేది బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ఆధారంగానే. సమాచారం అత్యంత భద్రంగా ఉంచేందుకు ఉపయోగపడే ఈ బ్లాక్‌చెయిన్ టెక్నాలజీని క్రిప్టో కరెన్సీలను తవ్వి తీసుకునేందుకు మాత్రమే కాకుండా, ఇతర అవసరాలకూ వాడుకోవచ్చు.
బిట్‌కాయిన్ మైనింగ్ అంటే ?
బిట్‌కాయిన్ మైనింగ్‌లో భాగంగా శక్తివంతమైన సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి, క్లిష్టమైన అల్గారిథమ్‌లను పరిష్కరించి, లావాదేవీలను వెరిఫై చేస్తారు. మైనింగ్ చేసేవాళ్లు ఈ ప్రక్రియలో విజయవంతంగా గెలుపొందితే.. వారికి కొన్ని బిట్‌కాయిన్లను రివార్డుగా అందజేస్తారు. బిట్‌కాయిన్ వ్యవస్థలో దీన్నే కేంద్ర వ్యవస్థగా చెప్పుకోవచ్చు. కొత్త బిట్‌కాయిన్స్ సృష్టి, బిట్‌కాయిన్ లావాదేవీలు, పర్యవేక్షణ వంటివన్నీ మైనింగ్ కిందకు వస్తాయి. బిట్‌కాయిన్ ఒక డీ-సెంట్రలైజ్డ్ కరెన్సీ. ఇది ఏ దేశానికీ చెందినది కాదు. ఆయా దేశాల సెంట్రల్ బ్యాంకులు దీన్ని నియంత్రించలేవు. బిట్‌కాయిన్‌ను కలిగి ఉన్న వ్యక్తుల బృందమే దీన్ని పర్యవేక్షిస్తుంది. పేరులో కాయిన్ అని ఉన్నంత మాత్రాన, ఇది మన నాణేల మాదిరిగా ఉండదు. కంటికి కనిపించని వర్చువల్ కరెన్సీ.. కంప్యూటర్ కోడ్‌ల రూపంలో నిక్షిప్తమై ఉంటుంది. దీన్ని ఎవరికైనా పంపినా, చెల్లింపులకు వాడినా.. కోడ్‌ను సృష్టిస్తుంది. ఈ లావాదేవీలు మొత్తం కంప్యూటర్ కోడ్‌ల ద్వారానే జరుగుతాయి.

ఈ పేరు ఎందుకంటే ?
'బిట్ కాయిన్' అని దీనికి ఎందుకు పేరు పెట్టారంటే, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ ప్రపంచం అంతా బిట్లు, బైట్లతోనే నిర్మించబడి ఉంటుంది. అందుకని ఇంటర్నెట్‌లో మాత్రమే చెల్లుబాటు అయ్యే కరెన్సీ కనుక.. దానికి 'బిట్ కాయిన్' అని పేరు పెట్టుకున్నారు. బిట్ కాయిన్‌కి మూలాధారం ఒక ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్. ఈ సాఫ్ట్‌వేర్‌ను మొదట 2008లో తయారుచేశారు. 2009లో మరో వ్యక్తి దానిని డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా మొదటి బిట్ కాయిన్ సృష్టించారు. బిట్ కాయిన్‌ను పీర్ టు పీర్ కరెన్సీగా వాడుకలోకి తెచ్చారు. అంటే మధ్యలో ఇంకెవరూ మధ్యవర్తులు లేకుండా నేరుగా అమ్మకందారుకు, కొనుగోలుదారుకు మధ్య ట్రాన్సాక్షన్ జరుగుతుంది. బిట్ కాయిన్ మార్పిడీలకు ఏకైక పూచీదారు పబ్లిక్ లెడ్జర్. ప్రతి ఒక్క మార్పిడినీ ఇందులో నమోదు చేస్తారు. బిట్ కాయిన్ మార్పిడీలకు ఉద్దేశించిన సర్వర్లలో ఈ పబ్లిక్ లెడ్జర్‌ను ఉంచుతారు. ప్రతి మార్పిడినీ అతి తక్కువ సమయంలో పబ్లిక్ లెడ్జర్‌లో నమోదయ్యేలా చూస్తారు. తద్వారా అక్రమాలు జరగకుండా నివారిస్తారు. చెల్లింపులను బిట్ కాయిన్ యూనిట్లలో ఈ పబ్లిక్ లెడ్జర్‌లో రికార్డు చేస్తారు. బిట్ కాయిన్ నిర్వహణ ఏ ఒక్క కేంద్రీకృత అథారిటీ కిందా ఉండదు. మార్పిడిలో పాల్గొనేవారే బిట్ కాయిన్ నిర్వాహకులు. చెల్లింపుల ప్రాసెసింగ్ పనికి బహుమతిగా కొత్త బిట్ కాయిన్స్‌ను సృష్టిస్తారు. వినియోగదారులు తమ కంప్యూటింగ్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి, చెల్లింపుల స్వభావాన్ని నిర్ధారించుకుని పబ్లిక్ లెడ్జర్‌లో నమోదు చేస్తారు. ఇలా చేయడాన్నే మైనింగ్ అంటారు. మైనింగ్ చేసేవారిని మైనర్లు అంటారు. మైనర్లు తమకంటూ సొంత సర్వర్లు నెలకొల్పుకుని, బిట్ కాయిన్ సాఫ్ట్‌వేర్ ద్వారా నిర్వహణ పనిలో ఉంటారు. వీళ్లు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నారు. తమ తమ సర్వర్లను ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ చేయడం ద్వారా బిట్ కాయిన్ నెట్‌వర్క్‌ను నిర్మించారు. ఈ నెట్‌వర్క్‌లో తగిన సామర్ధ్యం, సాఫ్ట్‌వేర్ పరిజ్ఞానం, సమయం, ఆసక్తి ఉన్నవారు ఎవరైనా చేరవచ్చు. ఇద్దరు వ్యక్తులు/ సంస్థల మధ్య బిట్ కాయిన్స్‌లో ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు సంబంధిత అప్లికేషన్ ద్వారా దానిని నెట్‌వర్క్‌లో ప్రసారం చేస్తారు. బిట్ కాయిన్ సర్వర్లు దీనిని వ్యాలిడేట్ చేసి, పబ్లిక్ లెడ్జర్‌లోకి కాపీ చేస్తాయి. లెడ్జర్‌లో పోస్ట్ చేసిన వెంటనే ఇతర సర్వర్లలోకి కూడా కాపీ అవుతుంది. అంటే సర్వర్లలో ఉండే పబ్లిక్ లెడ్జర్లు ఎప్పటికప్పుడు సింక్ అవుతుంటాయన్న మాట.

వద్దు.. వద్దంటూనే..!
కంటికి కనిపించని ఈ ఊహాజనిత కరెన్సీ. ఎవరి నియంత్రణ పరిధిలోకీ రాదు. అందువల్ల విలువ పరంగా ఎప్పుడు, ఏం జరుగుతుందో చెప్పలేం. అయినా బిట్‌కాయిన్‌లలోకి పెట్టుబడులు వెల్లువెత్తడానికి కారణమేంటి? ఇప్పుడు ఈటీఎఫ్ రూపంలోనూ అందుబాటులోకి రావడంతో, ఇందులో పెట్టుబడులు పెట్టడం మరింత సులభమైనట్లే అనే అభిప్రాయం వినిపిస్తోంది. వాస్తవానికి బిట్‌కాయిన్ ఈటీఎఫ్‌లు తీసుకురావడానికి అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజీ (ఎస్‌ఈసీ) తొలుత అనుమతులు ఇవ్వడానికి నిరాకరించింది. తీవ్రమైన ఒడిదుడుకులకు లోనయ్యే స్వభావం ఉండటం, క్రిప్టోకరెన్సీకి నియంత్రణాధికార సంస్థలు లేనందునే ఆ నిర్ణయం తీసుకుంది. గతేడాది ఏప్రిల్‌లో గ్యారీ జెన్‌స్లర్ ఎస్‌ఈసీ బాధ్యతలు చేపట్టిన తర్వాత బిట్‌కాయిన్ ఈటీఎఫ్‌లకు అనుమతులిచ్చే దిశగా అడుగులుపడ్డాయి. ఫ్యూచర్ ఆధారిత ఈటీఎఫ్‌ల వల్ల ఎలాంటి ఇబ్బందులూ ఉండవని, నియంత్రిత మార్కెట్‌లో అవి ట్రేడవుతుండటమే ఇందుకు కారణమని ఆయన తన నిర్ణయాన్ని సమర్ధించుకుంటూ వచ్చారు. అలా అక్టోబరు 19న న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజీలో ప్రోషేర్స్ బిట్‌కాయిన్ స్ట్రాటజీ ఈటీఎఫ్ (సంక్షిప్తంగా బిటో) నకు అంకురార్పణ జరిగింది.
మస్క్ మాట తెచ్చిన తంటా..
సున్నాగా 2010లో ఉన్న బిట్‌కాయిన్ విలువ గత నెల్లో 63 వేల డాలర్లకు చేరింది. అంతలోనే మస్క్ మాటమార్చి బిట్ కాయిన్ల సృష్టి వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. ఆయన ప్రతికూల వ్యాఖ్యలతో క్రిప్టో కరెన్సీల విలువ భారీగా పడిపోయింది. మరోవైపు చైనా తమ దేశంలో క్రిప్టోలను నిషేధించి, వాటితో లావాదేవీలు జరపకూడదని ఆజ్ఞాపించడంతో క్రిప్టోల విలువ అమాంతం కోసుకుపోయింది. ఇండియన్ క్రిప్టో ఏక్చ్సేంజ్, వాజిర్ ఎక్స్‌లో క్రిప్టోలను వదిలించుకునేవారు ఎక్కువ కావడంతో ఇక్కడా బిట్ కాయిన్, ఎథీరియం ధర పతనమైంది. చైనాలానే భారత ప్రభుత్వమూ క్రిప్టో కరెన్సీని నిషేధించి, రిజర్వు బ్యాంకు ద్వారా డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) జారీకి ఒక బిల్లును ప్రతిపాదిస్తుందనే వార్త క్రిప్టోలకు పిడుగుపాటైంది. కానీ, భారత్‌లో దాదాపు కోటిన్నర మంది క్రిప్టో వినియోగదారులు ఉన్నందున, వారి ప్రయోజనాలను కాపాడాలనే వాదం బలం పుంజుకొంది.

నిషేధమా ? నియంత్రణా ?
క్రిప్టోకు ప్రాతిపదిక అయిన బ్లాక్ చెయిన్ సాంకేతికత వల్ల దేశ ఆర్థికానికి కలిగే ప్రయోజనాలను విస్మరించకూడదని సలహాలు వస్తున్నాయి. అందుకే భారత్‌లో క్రిప్టోలను నిషేధించే బదులు నియంత్రించే అంశాన్ని పరిశీలించడానికి కేంద్రం నిపుణుల సంఘాన్ని నియమించనున్నట్లు వార్తలు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీ మార్కెట్ మూలధన విలువ లక్ష కోట్ల డాలర్లకు చేరడంతో వాటిని తేలిగ్గా తీసివేయలేం. భారత ప్రభుత్వానికి మొదటి నుంచీ క్రిప్టో కరెన్సీ పట్ల సానుకూలత లేకపోయినా క్రిప్టో మదుపరులు, ట్రేడర్ల లావాదేవీలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. దీన్ని నియంత్రించడానికి రిజర్వు బ్యాంకు 2018లో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు క్రిప్టో ట్రేడింగ్, ఎక్స్చేంజ్‌లను ప్రోత్సహించకూడదని సర్క్యులర్ జారీ చేసింది. 2020లో సుప్రీం దాన్ని కొట్టివేయడంతో సమస్యను సమీక్షించడానికి కేంద్రం ఓ నిపుణుల సంఘాన్ని నియమించింది. దేశ ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవలే ఒక ప్రకటన చేస్తూ క్రిప్టో కరెన్సీని చట్టబద్ధమైన కరెన్సీగా గుర్తించే అవకాశం లేదని చెప్పడం గమనార్హం.
తొలి బిట్‌కాయిన్ వ్యవహారం..
రెండు పిజ్జాల కొనుగోలు కోసం 2010లో ఓ కంప్యూటర్ ప్రోగ్రామర్ పది వేల బిట్‌కాయిన్లతో రెండు పిజ్జాలు కొనుగోలు చేయడం ప్రపంచంలో తొలి క్రిప్టో వ్యవహారంగా నమోదైంది. ఈ రోజుల్లో పది వేల బిట్‌కాయిన్ల విలువ కొంచెం అటూ ఇటూగా 40 లక్షల రూపాయలు. అప్పట్లో బిట్‌కాయిన్ విలువ లక్షల్లోకి చేరుతుందని ఎవరూ ఊహించలేదు. ఈ చిత్రమైన ఘటనను గుర్తుంచుకునేందుకు ఇప్పటికీ ఏటా మే 22వ తేదీని 'బిట్‌కాయిన్ పిజ్జా డే' గా జరుపుకుంటూంటారు.

హెచ్చుతగ్గులు..
బిట్‌కాయిన్ కానివ్వండి, ఇంకో క్రిప్టో కరెన్సీ ఏదైనా కానివ్వండి.. ప్రతిరోజూ విపరీతమైన హెచ్చుతగ్గులకు లోనవుతూంటుంది. ఒకరోజు లక్షల్లో పలికిన క్రిప్టో విలువ మరుసటి రోజే రూపాయిల్లోకి పడిపోవచ్చు. కాబట్టి క్రిప్టోలో పెట్టుబడులతో లక్షలు, కోట్లు ఆర్జించేయవచ్చు అనుకునేవారు కొంచెం జాగ్రత్త వహించడం మేలు. ఈ స్థాయిలో లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ అందరికీ మాత్రం కాదు. వందలో 90 శాతం మంది నష్టపోయేందుకే అవకాశాలు ఎక్కువని కొంతమంది నిపుణులు హెచ్చరిస్తున్న అంశం.
అక్రమ కార్యకలాపాల్లో..
బోలెడన్ని కట్టుబాట్లు, నిబంధనలు ఉన్న స్టాక్‌మార్కెట్‌లోనూ స్కామ్‌లు జరుగుతున్నట్లే క్రిప్టో వాణిజ్య ప్రపంచంలోనూ మోసగాళ్లు తమ స్వార్థ ప్రయోజనాలను నెరవేర్చుకునే అవకాశాలు ఉన్నాయి. 2019లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం బిట్‌కాయిన్ వ్యవహారాలు నడిపేవారిలో 25 శాతం మంది అక్రమ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. అలాగే 46 శాతం వ్యవహారాలు అక్రమాలకు సంబంధించినవే. మత్తు పదార్థాలు, ఆయుధాల విక్రయం వంటివన్నమాట. ఉదాహరణకు హవాలా రూపంలో నగదు తరలించినట్లు అన్నమాట. అదే హవాలాలో అయితే సెక్యూరిటీ కోసం ఏదైనా కరెన్సీ నోటుపై ఉన్న సీరియల్ నెంబర్ ఆధారంగా గానీ, నోటు సగానికి చించిగానీ లావాదేవీలు జరుపుతారు. మనం ఈ సన్నివేశం.. ఇటీవల విడుదలైన 'పుష్ప' చిత్రంలోనూ చూశాం. ఈ నగదు మొత్తం అక్రమ కార్యకలాపాలకు వినియోగిస్తున్నారనేది అనేక సర్వేల్లో వెల్లడైన వాస్తవం.

సాఫ్ట్‌వేర్ సంస్థల పోటీ..
మైక్రోసాఫ్ట్, హోండిపో, నేమ్‌చీప్, హోల్‌ఫుడ్స్, న్యూఎగ్స్, స్టార్‌బక్స్ వంటి కంపెనీలు, కొన్ని దేశాల బ్యాంకులు కూడా క్రిప్టో కరెన్సీని వస్తు/సేవల కొనుగోళ్లకు అంగీకరిస్తున్నాయి.
బిట్‌కాయిన్‌కు చట్టబద్ధత కల్పించిన తొలి దేశం ఎల్ సాల్వడార్. గతేడాది జూన్ తొమ్మిదిన బిట్‌కాయిన్‌ను దేశంలో అన్ని రకాల వ్యవహారాలకూ వాడవచ్చునని ఆ దేశం ప్రకటించింది. అయితే ప్రధాన కరెన్సీ ఇప్పటికీ అమెరికన్ డాలరే !
- బిట్‌కాయిన్లను వాడుకునేందుకు, నిల్వ చేసుకునేందుకు 'వ్యాలెట్లు' ఉపయోగపడతాయి. యూపీఐ ఆధారిత డిజిటల్ వాలెట్లు గూగుల్‌పే, ఫోన్ పే, పేటీఎం మాదిరిగా అన్నమాట.
- నవంబరు 2021 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రిప్టో కరెన్సీలు - 7557
- 2021 జనవరి నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిట్‌కాయిన్ ఏటీఎంల సంఖ్య - 20,000 +
- భారత్‌లో క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడులు పెట్టిన వారి సంఖ్య -10.7 కోట్లు.
- భారతీయుల క్రిప్టో పెట్టుబడుల మొత్తం - రూ.75,000 కోట్లు.
- నవంబరు 24 నాటికి ప్రపంచ క్రిప్టోకరెన్సీ మార్కెట్ విలువ - 2.4 లక్షల కోట్ల డాలర్లు.
మరిన్ని వస్తాయా..?
బిట్‌కాయిన్ రూపంలో ఈటీఎఫ్‌లను తీసుకొచ్చేందుకు చాలా సంస్థలు ప్రయత్నించాయి. కారణాలేమైనా కావచ్చు.. కానీ ఆ ప్రయత్నాలేవీ సఫలం కాలేదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ ఈటీఎఫ్ విజయవంతం కావడంతో.. ఇతర సంస్థలు మళ్లీ ఆ ప్రయత్నాలను మొదలుపెట్టే అవకాశాలు లేకపోలేవు. మున్ముందు మరిన్ని ఈ తరహా ఈటీఎఫ్‌లు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదనే అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. అయితే బిట్‌కాయిన్‌లో పెట్టుబడులంటే ఇప్పటికీ చాలా మందిలో భయాందోళనలు ఉన్నమాట వాస్తవం. నేరగాళ్ల కార్యకలాపాలకు బిట్‌కాయిన్‌తో సంబంధాలున్నట్లు వార్తలు వినిపిస్తుండటమే ఇందుకు కారణం. అయితే నియంత్రణ పరిధిలోనే ఈటీఎఫ్‌లు ట్రేడవుతున్నందున ఆ భయాలు కొంతమేర తగ్గొచ్చనే మాట వినిపిస్తోంది. అయితే ఇది ఎంతవరకూ అమలవుతుందో సందేహమే! అమెరికాలో ఇప్పటికే కొంతమంది ట్రేడర్లు బిట్‌కాయిన్ ఫ్యూచర్స్‌లో ప్రత్యక్షంగా, పరోక్షంగా పెట్టుబడులు పెడుతున్నారు. ఇప్పుడు ఈటీఎఫ్ రూపంలో అందుబాటులోకి రావడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పింఛను ఫండ్స్ లాంటి సంస్థలు కూడా వీటిల్లో ఉండొచ్చు. ఇదే జరిగితే ఫైనాన్షియల్ మార్కెట్లలో బిట్‌కాయిన్‌కు ఆదరణ పెరుగుతోందని అనుకోవచ్చు. ఈ పరిణామం ఇతర క్రిప్టోకరెన్సీల పట్ల మదుపర్ల వైఖరిలోనూ సానుకూలతను తీసుకురావచ్చు. ఏదేమైనా మున్ముందు క్రిప్టోకరెన్సీల్లో పెట్టుబడులు పెట్టడం సులభమవ్వడమే కాదు. సర్వసాధారణమయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మనదేశంలోనూ క్రిప్టోకరెన్సీపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆందోళనలు వ్యక్తం చేస్తూ, తాము సొంతగా డిజిటల్ కరెన్సీని రూపొందిస్తామని చెబుతోంది.

ఈ దేశాల్లో చెలామణి..
థామ్సన్ రాయిటర్స్ ఇన్‌స్టిట్యూట్ వెల్లడించిన నివేదిక ప్రకారం.. క్రిప్టోను అంగీకరించిన తొలి దేశాల జాబితాలో కెనడా కూడా ఉంది. ఆదాయ పన్ను చట్టం ప్రయోజనాల కోసం, క్రిప్టోకరెన్సీని కెనడా రెవెన్యూ అథారిటీ (సిఆర్‌ఎ) ఒక కమోడిటీగా పరిగణిస్తుంది. అయితే క్రిప్టోకరెన్సీ అనేది దేశ భద్రతకు సంబంధించిన విషయమని ఇజ్రాయెల్ సెక్యూరిటీ రెగ్యులేటరీ భావిస్తున్నప్పటికీ.. ఇజ్రాయెల్ టాక్స్ అథారిటీ మాత్రం క్రిప్టోని ఒక ఆస్తిగా నిర్వచిస్తుంది. మూలధన లాభాలపై 25 శాతం ట్యాక్స్ డిమాండ్ చేస్తుంది. జర్మనీకి సంబంధించిన ఫైనాన్షియల్ సూపర్‌వైజర్ అథారిటీ, వర్చువల్ కరెన్సీలను ఆర్థిక సాధనాలుగా గుర్తించింది. ఇక బ్రిటన్, అమెరికా దేశాలు క్రిప్టోను లీగల్ టెండర్‌గా గుర్తించినప్పటికీ, రాష్ట్రాలు జారీ చేసిన నిర్వచనాలు వర్చువల్ కరెన్సీల వికేంద్రీకరణ స్వభావాన్ని గుర్తిస్తున్నాయి. చట్ట విరుద్ధమైన ప్రయోజనాలకు వినియోగించని క్రిప్టోలకు థారులాండ్‌లో అనుమతి ఉంటుంది.
డిజిటల్ కరెన్సీవైపు భారత్ ..
డిజిటల్ ఎకానమీకి ఊతమిచ్చేందుకు సమర్థమంతమైన కరెన్సీ నిర్వహణకు తోడ్పడేలా రిజర్వ్ బ్యాంక్ తాజాగా దేశీ డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టబోతోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌లో దీన్ని అందుబాటులోకి తేనుంది. తాజా బడ్జెట్ ప్రసంగం సందర్భంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయం వెల్లడించారు. కరెన్సీ మేనేజ్‌మెంట్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా, తక్కువ వ్యయాలతో నిర్వహించేందుకు డిజిటల్ కరెన్సీ ఉపయోగపడుతుందన్నారు. ఈ నేపథ్యంలో 2022-23 నుంచి బ్లాక్ చెయిన్, ఇతర టెక్నాలజీల ఆధారంగా డిజిటల్ రూపీని ఆర్‌బీఐ ప్రవేశపెట్టనుందని ఆమె పేర్కొన్నారు. సాధారణ లావాదేవీల వ్యయాలతో పోలిస్తే ఈ తరహా కరెన్సీలతో జరిపే లావాదేవీల వ్యయాలు తక్కువగా ఉండటంతో వీటివైపు మొగ్గు చూపే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే అనధికారిక డిజిటల్ కరెన్సీ విలువ తీవ్ర హెచ్చుతగ్గులకు గురవుతుండటంతో నష్టపోతున్న వారి సంఖ్య కూడా గణనీయంగా ఉంటోంది. పైగా వీటికి చట్టబద్ధత లేకపోవడం మరో ప్రతికూలాంశం. దేశ భద్రత, ఆర్థిక స్థిరత్వంపైనా ప్రభావం చూపుతాయన్న కారణంతో ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలను సెంట్రల్ బ్యాంకులు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశాల ప్రభుత్వాలు అధికారికంగా డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టడంపై దృష్టి పెడుతున్నాయి. ఇందులో భాగంగానే భారత్ కూడా డిజిటల్ రూపీకి రూపమిస్తోంది. దీన్ని సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) గా వ్యవహరిస్తారు. రిజర్వ్ బ్యాంకు దీన్ని జారీ చేస్తుంది.

క్రిప్టో కరెన్సీతో ఉపయోగాలు ?
మోసాలకు తావే లేదు. ఎందుకంటే క్రిప్టో కరెన్సీ మొత్తం డిజిటల్ వ్యవహారం. పైగా బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ సాయంతో నడుస్తుంది. కాబట్టి ఇందులో మోసాలకు అసలు తావుండదు. చెల్లింపులైనా, ఒప్పందాలైనా డిజిటల్ ప్రపంచపు నెట్‌వర్క్‌లో అందరికీ అందుబాటులోనే ఉంటాయి. కానీ ఏ ఒక్కరూ అందులో మార్పులు చేసేందుకు అవకాశం ఉండదు. ఒకవేళ చేస్తే ఆ మార్పుకు నెట్‌వర్క్‌లోని మిగిలిన వారందరూ ఓకే అనాలి. కాబట్టి మోసం చేయాలని ఎవరైనా అనుకున్నా సాధ్యం కాదు. పైగా మార్పులు చేసేందుకు చేసిన ప్రయత్నమూ డిజిటల్ రూపంలో భద్రంగా నిక్షిప్తమవుతుంది. కాబట్టి దొంగ ఇట్టే దొరికిపోతాడు.

వ్యక్తిగత వివరాలు భద్రం
క్రెడిట్ / డెబిట్ కార్డుతో ఏంచేసినా మన కొనుగోళ్ల వ్యవహారాలు మొత్తం అవతలివైపు వారికి అందుబాటులోకి వచ్చేస్తాయి. క్రిప్టో కరెన్సీతో ఈ సమస్య ఉండదు. కార్డు ద్వారా డబ్బు తీసుకునేందుకు బ్యాంకులు, ఇతర సంస్థలు 'పుల్' అంటే డబ్బు కావాలని అడగడం. అకౌంట్ నుంచి లాక్కోవడం జరగుతుంది. క్రిప్టో వ్యవహారం దీనికి భిన్నం. డబ్బు కావల్సిన వ్యక్తి / సంస్థకు 'పుష్' పద్ధతిలో మన అకౌంట్ నుంచి తగిన విలువ మాత్రమే అందుతుంది. మిగిలిన వివరాలేవీ ఉండవు.
ఉదయ్ శంకర్ ఆకుల
7989726815