Aug 08,2023 21:24

ప్రజాశక్తి - ఏలూరు అర్బన్‌
            విఆర్‌ఎల న్యాయమైన సమస్యలు పరిష్కరించకపోతే జగన్‌ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్‌విడి.ప్రసాద్‌ హెచ్చరించారు. విఆర్‌ఎల సంఘం ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్‌ ముందు జిల్లా అధ్యక్షులు కె.బ్రహ్మాజీ అధ్యక్షతన చేపట్టిన సామూహిక నిరాహార దీక్షల శిబిరాన్ని రెండో రోజు ప్రసాద్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా విఆర్‌ఎలు మోకాళ్లపై నిలబడి, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ప్రసాద్‌ మాట్లాడుతూ 26 జిల్లాల్లో విఆర్‌ఎలు శాంతియుతంగా నిరాహార దీక్షలు చేస్తున్నా జగన్‌ ప్రభుత్వం పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ఇచ్చిన వాగ్దానాన్ని నాలుగున్నర సంవత్సరాలైనా నేటికీ అమలు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. నాలుగేళ్లుగా సిఎం జగన్‌ విఆర్‌ఎలకు ఒక్క రూపాయి కూడా వేతనం పెంచలేదని విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ పెరుగుతున్న కాలంలో విఆర్‌ఎల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. గతంలో విఆర్‌ఎలు పోరాడి సాధించుకున్న డిఎను ఈ ప్రభుత్వం నిలిపివేసి కార్మికుల పొట్టగొట్టడం హేయమైన చర్య అని ఆయన విమర్శించారు. తెలంగాణలో విఆర్‌ఎలను ప్రభుత్వ విభాగాల్లోకి తీసుకుని పే స్కేలు అమలు చేశారని, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. సంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌, కోశాధికారి గంగాధర్‌రావు మాట్లాడుతూ నామిని విఆర్‌ఎలను విఆర్‌ఎలుగా గుర్తించాలని డిమాండ్‌ చేశారు. నాలుగో తరగతి ఉద్యోగులుగా అర్హత ఉన్న వారికి ఇవ్వాలన్నారు. 60 సంవత్సరాలు దాటిన విఆర్‌ఎలకు వారి కుటుంబ సభ్యులకు విఆర్‌ఎ పోస్టులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ దీక్షలో విఆర్‌ఎల సంఘం జిల్లా నాయకులు ఆంజనేయులు, రవికుమార్‌, కాలేషా, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.