ప్రజాశక్తి -పాడేరు: పాడేరులో మే 14, 15, 16 తేదీలలో నిర్వహించ తలపెట్టిన మోదకొండమ్మ అమ్మవారి జాతర మహౌత్సవాలలో భాగంగా శనివారం పాడేరు మెయిన్ రోడ్‌లో ముహూర్తపు రాటను ప్రతిష్టించి అమ్మవారి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. మోదకొండమ్మ ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కె భాగ్యలక్ష్మి, సర్పంచ్ కె ఉషారాణి, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ వర్తన పిన్నయ్య దొర, తదితరులు పూజలు నిర్వహించి ముహూర్తపు రాటను ప్రతిష్టించారు. గ్రామంలోని పెద్దలు, మహిళలు, భక్తులు ముహూర్తపు రాటకు పూజలు జరిపారు. మోదకొండమ్మ ఆలయ ప్రధాన అర్చకులు సుబ్రహ్మణ్యం రాట ప్రతిష్టతను నిర్వహించారు. అమ్మవారి జాతర మహౌత్సవాలలో భాగంగా పాడేరు పట్టణంలోని మెయిన్ రోడ్‌లో మూడు రోజులపాటు కొలువు తీర్చి ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ మేరకు ముహూర్తం రాట అనంతరం అమ్మవారిని కొలువు తీర్చేందుకు మెయిన్ రోడ్ లో శతకంపట్టు ఏర్పాటు పనులతో పాటు ఉత్సవాల ఏర్పాట్లు అన్ని జోరుగా మొదలుపెట్టడానికి ఆలయ కమిటీ ఉత్సవ కమిటీ పనులు చేపట్టనున్నారు.మే 12న అమ్మవారి జయంతి పండుగను మొదలుకొని 14, 15, 16 తేదీల్లో అమ్మవారి జాతర మహౌత్సవాలు జరగనున్నందున ఐదు రోజులపాటు పాడేరు పట్టణంలో ఉత్సవాల సందడి నెలకొననుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ మెంబర్ తమ్మర్బ నర్సింగ్‌రావు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కె.సుబ్బారావు, సర్పంచ్ ఉషారాణి, ఉపసర్పంచ్ భూ రెడ్డి రాము, ఉత్సవ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు వర్తన పిన్నయ్యదొర, తమ్మర్బ ప్రసాద్ నాయుడు, నవర కొండబాబు, ఎంపీపీ కుమారి, వైస్ ఎంపీపీలు గంగ పూజారి, శివ కుమార్, కనకాలమ్మ పాల్గొన్నారు.










