May 14,2023 23:36

డప్పులు వాయిస్తున్న కళాకారులు

ప్రజాశక్తి-పాడేరుటౌన్‌:పాడేరులో మోదకొండమ్మ ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయంలో ఉన్న అమ్మవారి ఉత్సవ విగ్రహం, పాదాలను శతకంపట్టులో కొలువుదీర్చడంతో మూడు రోజుల ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. అమ్మవారిని శతకంపట్టు వద్దకు తీసుకువెళ్లేందుకు వేకువజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలి వచ్చారు. జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి, ఉత్సవ విగ్రహాన్ని శిరస్సుకెత్తుకొని ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. తరువాత ఉత్సవ కమిటీ అధ్యక్షురాలు, ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, ప్రధాన కార్యదర్శి కొట్టగుళ్లి సింహాచలం నాయుడు, జెసి జె.శివ శ్రీనివాసు, ఐటిడిఎ పిఒ వి.అభిషేక్‌, జడ్‌పి చైర్మన్‌ జల్లిపల్లి సుభద్ర, ఎపి మెడికల్‌ కౌన్సిల్‌ మెంబర్‌ డాక్టర్‌ నర్సింగరావు, ఉత్సవ కమిటీ ప్రతినిధులు పిన్నయ్యదొర, కొట్టగుళ్లి సుబ్బారావు, నవర కొండబాబు ఉత్సవ విగ్రహం, పాదాలను తలకెత్తుకున్నారు. ఆలయం నుంచి ఊరేగింపుతో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని, పాదాలను మెయిన్‌ బజార్‌ వద్ద ఏర్పాటు చేసిన సంతకంపట్టుకు తీసుకు వచ్చి కొలువుదీర్చారు. ఊరేగింపులో డప్పు వాయిద్యాలు ఆకర్షణగా నిలిచాయి.ఊరేగింపు ముందు భాగాన నృత్యాలు ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్‌, జెసి, ఐటిడిఎ పిఒ, ఎమ్మెల్యే, జడ్‌ పి చైర్మన్‌, ఎపి మెడికల్‌ కౌన్సిల్‌ మెంబర్‌ తదితరులు గిరిజన సంప్రదాయ నృత్యం దింసా నృత్య ప్రదర్శన చేసి ఉత్సాహపరిచారు. శతకంపట్టు వద్ద అమ్మవారి ఉత్సవ మూర్తి, పాదాలను అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. భక్తుల తాకిడితో శతకంపట్టు వద్ద రద్దీగా మారింది. జిల్లాతో పాటు వేర్వేరు. జిల్లాల నుంచి కళాకారులు తరలివచ్చారు. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా ఎస్‌పి అతుల్‌ సిన్హా, ఎఎస్‌పి ధీరజ్‌ కునుబిల్లి పర్యవేక్షణలో స్థానిక సిఐ బి.సుధాకర్‌, ఎస్‌ఐలు లక్ష్మణరావు, రంజిత్‌, ఉమ్మడి విశాఖ జిల్లాలోని సిఐలు, ఎస్‌ఐలు, పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
శతకంపట్టులో పూజలు
ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు శతకంపట్టులో కొలువు తీరిన మోదకొండమ్మకు అధిక సంఖ్యలో భక్తులు పూజలు చేశారు. మూడు రోజులపాటు ప్రత్యేకంగా ఇక్కడే పూజలు నిర్వహిస్తారు. ఉత్సవాలు ఆఖరి రోజు మంగళవారం శతకంపట్టులో ఉన్న అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని, పాదాలను పట్టణ వీధుల్లో భారీగా ఊరేగించి, తిరిగి ఆలయంలో చేరుస్తారు. వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చిన భక్తులు శతకంపట్టులో, ఆలయంలోని అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఉత్సవాల ప్రారంభ కార్యక్రమంలో మాజీ మంత్రి మణికుమారి, సర్పంచ్‌ ఉషారాణి, మాజీ ఎంపిపి ముత్యాలమ్మ పాల్గొన్నారు.
కార్నివాల్‌ ను ప్రారంభించిన పిఒ.
ఐటిడిఎ కార్యాలయం వద్ద ఆదివారం సాయంత్రం కార్నివాల్‌ ను ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి వి.అభిషేక్‌ జెండా ఊపి ప్రారంభించారు. కార్నివాల్‌ ఐటిడిఎ నుండి ఆర్‌టిసి కాంప్లెక్స్‌, సినిమా హాల్‌ సెంటర్‌, పాత పెట్రోల్‌ బంక్‌, అంబేద్కర్‌ కూడలి మీదుగా అమ్మవారి దేవాలయం వరకు సాగింది. పిఒ వి.అభిషేక్‌, ఎఎస్‌ పి.ధీరజ్‌ కునుబిల్లి, ట్రైనీ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీ వాత్సవ కార్నివాల్‌ ప్రదర్శనలోని డోలు, కొమ్ములున్న కిరీటాలను ధరించి ప్రదర్శన చేసి ఉత్సాహపరిచారు. ఐటిడిఎ ఎపిఒలు విఎస్‌.ప్రభాకర్‌, ఎం.వెంకటేశ్వరరావు, టిడబ్ల్యూ డిడి కొండలరావు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ స్టాళ్లు ప్రదర్శన
మూడు రోజుల మోదకొండమ్మ ఉత్సవాలకు అవసరమైన ఏర్పాట్లతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన కార్యక్రమాలు, పథకాలపై ప్రజల్లో అవగాహనకు అధికారులు ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఈ స్టాళ్లను జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌, పిఒ వి.అభిషేక్‌, ఎఎస్‌పి ధీరజ్‌ కునుబిల్లి తదితరులు ప్రారంభించారు. ఏజెన్సీ ప్రాంతంలో ఐటిడిఎ చేపట్టిన అబివృద్ధిపై సమాచార శాఖ ఆధ్వర్యంలో ఫోటో ప్రదర్శన, జిసిసి, వ్యవసాయ, ఉద్యానవన, కాఫీ, ఐసిడిఎస్‌, వెలుగు, స్పైసెస్‌ బోర్డ్‌, వైద్య ఆరోగ్యశాఖ, పశుసంవర్ధక శాఖ తదితర శాఖలు చేపట్టే కార్యక్రమాలకు సంబంధించిన స్టాళ్లను ఏర్పాటు చేశారు.
ఆకట్టుకున్న సాంస్కతిక ప్రదర్శనలు
మోదకొండమ్మ ఉత్సవాల్లో భాగంగా మూడు రోజులు స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రాంగణంలో సాంస్కతిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన సాంస్కతిక ప్రదర్శనలను జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌, ఐటిడిఎ పిఒ వి.అభిషేక్‌, ట్రైనీ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీ వాత్సవ, ఎమ్మెల్యేలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, చెట్టి పాల్గుణ, జడ్‌పి చైర్‌ పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర, ఎపి ట్రైకార్‌ చైర్మన్‌ బుల్లిబాబు తుడుం కొట్టి సాంస్కతిక ప్రదర్శనలను ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సాంస్కతిక కార్యక్రమాలు అందర్నీ అలరించాయి.