Apr 24,2023 00:02

పోస్టర్‌ను విడుదల చేస్తున్న ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, కమిటీల ప్రతినిధులు

ప్రజాశక్తి-పాడేరు:మన్య ప్రజల ఇలవేల్పు మోదకొండమ్మ అమ్మవారి ఉత్సవాలను పాడేరులో వచ్చే నెల 14, 15, 16 తేదీలలో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపడుతున్నట్లు ఆలయ కమిటీ చైర్‌ పర్సన్‌, ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి వెల్లడించారు. అమ్మవారి ఆలయంలో ఆదివారం ఉత్సవాల ప్రచార కరపత్రాలను ఆమె ఉత్సవ కమిటీ, ఆలయ కమిటీ ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అమ్మవారి జాతర నిర్వహణ, విరాళాల సేకరణ కోసం జాతర ఏర్పాట్లపై అహర్నిశలు కృషి చేస్తున్న ఉత్సవ కమిటీ ప్రతినిధులను ఆమె అభినందించారు. జాతరలో భాగంగా పెద్ద ఎత్తున పాడేరు తరలి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అమ్మవారి దర్శనం కల్పించేందుకు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. గతేడాది మోద కిరణ్‌ మణికంఠ అన్నదాన ట్రస్ట్‌ ద్వారా ఉత్సవాల మూడు రోజులు ఆలయం వద్ద భారీ అన్నసంతర్పణ నిర్వహించామని ఈ ఏడాది కూడా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ద్వారా వారికి తోడ్పాటును అందిస్తామని తెలిపారు. అమ్మవారి జాతరపై గ్రామాల్లో కరపత్రాల ద్వారా విస్తత ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. అమ్మవారి జాతరను వైభవోపేతంగా నిర్వహించేందుకు అన్ని వర్గాల వారు సహకరించాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కొట్ట గుల్లి సింహాచలం నాయుడు, ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షులు కొట్టగుల్లి సుబ్బారావు, ఉత్సవ కమిటీ అధ్యక్షులు వర్తన పిన్నయ్యదొర, ప్రధాన కార్యదర్శులు తమర్భ ప్రసాద్‌ నాయుడు, నవర కొండబాబు, యాదగిరి శ్రీను, ఉప సర్పంచ్‌ భూ రెడ్డి రాము, ఉత్సవ కమిటీ ఆలయ కమిటీ ప్రతినిధులు లకే నాని పాత్రుడు, బోనంగి వెంకట రమణ, పూసర్ల గోపి, ఉప్పల వెంకటరత్నం, సత్యమోహన్‌. అన్నదాన ట్రస్ట్‌ నిర్వాహకులు శివరాత్రి శ్రీనివాస్‌ కుమార్‌, ముకుందరావు పాల్గొన్నారు.