
ప్రజాశక్తి నర్సీపట్నం టౌన్: బిజేపీని సాగనం పుదాం..దేశాన్ని కాపాడుకుందాం నినాదంతో సిపిఐ, సిపిఎం, డి.హెచ్.పి.ఎస్ ఆధ్వర్యాన ప్రచారం భేరి చేపట్టారు. ముందుగా అంబేద్కర్ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. సిపిఐ, సిపిఎం జిల్లా నాయకులు మాకిరెడ్డి రామునాయుడు, డి.సత్తిబాబు మాట్లాడుతూ, రాజ్యాంగంలోని చట్టాలను కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడిచి పరిపాలన సాగిస్తుందన్నారు.ప్రజావ్యతిరేక, నిరంకుశ, మతోన్మాద బిజెపిని సాగనంపుదాం అని నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు డిసిహెచ్ రాజబాబు, జి.గురు బాబు, శివలంక కొండారావు, ఎ. రాజు, ఎల్, గౌరీ పాల్గొన్నారు.
అనకాపల్లి : ప్రజా వ్యతిరేక నిరంకుశ మతోన్మాద బిజెపిని సాగనంపి దేశాన్ని రక్షించుకుందామని సిపిఎం, సిపిఐ నాయకులు పిలుపునిచ్చారు. ప్రచార భేరి కార్యక్రమాన్ని శుక్రవారం అంబేద్కర్ జయంతి సాక్షిగా ప్రారంభించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు ఎ.బాలకష్ణ, ఆర్ శంకర్ రావు, గంట శ్రీరామ్, సిపిఐ నాయకులు బాలేపల్లి వెంకటరమణ, రాజాన దొరబాబు, వై ఎన్ భద్రం మాట్లాడుతూ బిజెపి హయాంలో దేశంలో ప్రజాస్వామ్యం కనుమరుగవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మోేడీ అమిత్ షా నాయకత్వంలో బిజెపి ఆర్‌ఎస్‌ఎస్ దేశ ప్రజల మధ్య మత విద్వేషాలను రెచ్చగొడుతుందని తెలిపారు. దేశ సంపదను అంబానీ ఆదానీలకు దోచిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే వారిని అణగదొక్కుతూ బ్రిటిష్ పాలనను గుర్తు చేస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు వియ్యపు రాజు, నరాల శెట్టి సత్యనారాయణ, వీరాచారి, సిపిఎం నాయకులు బుగిడి నూక అప్పారావు, విత్తనాల పోతురాజు తదితరులు పాల్గొన్నారు.
గాజువాక : కేంద్రంలోని బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ శుక్రవారం సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో పాదయత్ర, ప్రచార ర్యాలీలు నిర్వహించారు. గాజువాక వంద అడుగుల రోడ్డులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వామపక్షనేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి ప్రచార పాదయాత్ర ప్రారంభించి, మీసేవ రోడ్డు, చిన గంట్యాడ, కణితి రోడ్డు మీదుగా చినగంట్యాడ కూడలి వరకు పాదయాత్ర నిర్వహించి, ఇంటింటా కరపత్రాలు పంపిణ చేశారు. చిన గంట్యాడ కూడలిలో నిర్వహించిన సభలో వామపక్ష పార్టీల నేతలు కసిరెడ్డి సత్యనారాయణ, ఎం రాంబాబు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రామికుల పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వరంగ పరిశ్రమలు, సంస్థలను ప్రయివేటుకు దారాధత్తం చేసే ప్రయత్నాలు ముమ్మర మయ్యాయని ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయిందని వాపోయారు. ప్రజాభిప్రాయాలకు కనీస విలువివ్వని మోడీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వామపక్ష పార్టీల నేతలు ఎల్లేటీ శ్రీనివాసరావు, శ్రీనివాసరాజు, జి.ఆనంద్, కె.అచ్యుతరావు, తాండ్ర కనకరాజు, అప్పారి విష్ణుమూర్తి, కె రాజబాబు, ఎ.లోకేష్, కె.పోతన్న, దాసరి అప్పారావు, వై.లక్ష్మణరావు, మహిళా సమాఖ్య నాయకురాలు పిల్లా సూర్యపద్మ పాల్గొన్నారు
మధురవాడ: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ నిరంకుశ విధానాలు విడనాడాలని డిమాండ్ చేస్తూ సిపిఎం, సిపిఐ మధురవాడ జోన్ కమిటీల ఆధ్వర్యంలో ఏడో వార్డు మల్లయ్యపాలెంలో పాదయాత్ర నిర్వహించారు. ముందుగా మల్లయ్యపాలెంలో అంబేద్కర్ విగ్రహానికి స్థానిక పెద్దలతో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఇంటింటా కరపత్రాలు పంచుతూ ప్రచారభేరి నిర్వహించారు. ప్రత్యేకహోదా, పోలవరం ప్రాజెక్టు, విశాఖ రైల్వేజోన్, ఇతరత్రా విభజన హామీలు అమలు చేయక, రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ విధానాలను ఎండగట్టడమే ఈ ప్రచారభేరి లక్ష్యమన్నారు. కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ మధురవాడ జోన్ కార్యదర్శులు డి.అప్పలరాజు, వి సత్యనారాయణ, సిపిఐ నగర నాయకురాలు మహ్మద్ బేగం, పి వెంకన్న, జి.వేలంగినిరావు, సిపిఎం నేతలు పి.రాజ్‌కుమార్, బి భారతి, డి కొండమ్మ, కెవిపిఎస్ నేతలు కె. నాగరాజు స్థానికులు బి అప్పలరాజు, నారాయణరావు పాల్గొన్నారు.
తగరపువలస : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక, నిరంకుశ విధానాలపై సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో శుక్ర వారం ప్రచార భేరి పాదయాత్ర నిర్వహించారు. చిట్టివలస ఫుట్‌బాల్ గ్రౌండ్ వద్ద ప్రారంభమైన ర్యాలీ జంక్షన్‌కు చేరుకుంది. అక్కడ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మెయిన్ రోడ్డు, గ్రంధాలయం వీధి, గొల్లవీధి, సంతపేట, కొండపేట, బంగ్లా మెట్ట ప్రాంతాల్లో విస్తృతంగా ర్యాలీ నిర్వహించారు. సిపిఎం, సిపిఐ నేతలు ఆర్‌ఎస్‌ఎన్ మూర్తి, రవ్వ నరసింగరావు, కె నాగరాణి, అల్లు బాబూరావు, కె రాంబాబు పాల్గొన్నారు
పెందుర్తి : కులాలు,మతాల మధ్య చిచ్చుపెట్టి, విభజించి, పాలించు ధోరణిలో నిరంకుశ విధానాలను అమలు చేస్తున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపి దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని సిపిఎం జిల్లా కమిటీ నాయకుడు జగన్, న్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్.శ్రీనివాస్ పిలుపునిచ్చారు. శుక్రవారం 96వ వార్డు పెందుర్తిలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ప్రచారభేరి పాదయాత్ర నిర్వహించారు. విభజన హామీలను తుంగలో తొక్కడంతోపాటు అమరావతి రాజధాని, స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణ వంటి అంశాలతో రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించిన మోడీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.దగ్గువానిపాలెం వీధుల్లో ప్రచారభేరి నిర్వహించి, కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు వై.రాంబాబు, వామపక్ష పార్టీల కార్యకర్తలు రామారావు, అప్పల నాయుడు, రామ్, రమణ పాల్గొన్నారు.