ప్రజాశక్తి-విశాఖ కలెక్టరేట్, గాజువాక
క్విట్ ఇండియా స్ఫూర్తితో 'మోడీని ఓడిద్దాం- దేశాన్ని, ప్రభుత్వ రంగాన్ని రక్షించుకుందాం' అని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. అఖిలపక్ష కార్మిక సంఘాల పిలుపు మేరకు జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద బుధవారం చేపట్టిన ''క్విట్ మోడీ - సేవ్ ఇండియా'' దీక్షలను సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్.నరసింగరావు ప్రారంభించారు. ముందుగా గాంధీ విగ్రహానికి పూల మాల వేసి దీక్ష చేపట్టారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణ విధాలను ఆపాలని, లేబర్‌కోడ్స్ రద్దు చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, స్కీమ్ వర్కర్స్‌ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని, కనీస పెన్షన్ రూ.9 వేలు చెల్లించాలని, అసంఘటిత రంగ కార్మికులకు పిఎఫ్, ఇఎస్‌ఐ, ఇన్స్యూరెన్స్‌తో కూడిన సమగ్ర చట్టం చేయాలని, ఉద్యోగభద్రత కల్పించాలని, ఎంవి.యాక్ట్ 2019, జీవో 21ను, ఈ చలానాను రద్దుచేయాలని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, వ్యవసాయ కార్మికులకు గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని సంవత్సరానికి 200రోజులకు పెంచాలన్న డిమాండ్లతో జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద 500 మందితో నిరసన దీక్షను చేపట్టారు. ఉదయం 10 గంటల ప్రారంభమైన దీక్ష సాయంత్రం ఐదు గంటల వరకు సాగింది.
దీక్షనుద్దేశించి సిహెచ్.నర్సింగరావు మాట్లాడుతూ, నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ తన ఆప్త మిత్రులైన అంబానీ, అదానీలకు కట్టబెడుతున్నారని విమర్శించారు. దేశంలో ఉన్న పోర్టులు, స్టీల్‌ప్లాంట్, విమానాశ్రయాలు, రైల్వేలు, జాతీయ రహదారులు, బ్యాంకులు, ఇన్స్యూరెన్స్, గనులు, అంతరిక్షం చివరికి సముద్రాన్ని కూడా ప్రయివేటీకరణకు పూనుకుంటున్నారన్నారు. 32మంది ప్రాణత్యాగాలతో ఏర్పాటైన విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రయివేటు వారికి కట్టబెట్టాలని ఎన్ని కుట్రలు చేస్తున్నా విశాఖపట్నం కార్మిక వర్గం 909 రోజుల నుంచి పోరాడుతూ అడ్డుకుంటున్నారని, ఇదే ఐక్యతతో భవిష్యత్తులో మోడీని ఓడించడానికి కార్మిక వర్గం సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఐఎన్‌టియుసి జిల్లా అధ్యక్షులు మంత్రి రాజశేఖర్, ఎఐటియుసి రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ, నాయకులు మన్మధరావు, రెహమాన్, ఐఎఫ్‌టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు, మల్లన్న, సిఎఫ్‌టియు జాతీయ అధ్యక్షులు కనకారావు, ఎపిఎఫ్‌టియు నాయకులు దేవ, ఎఐసిటియు నాయకులు శంకరరావ, సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కెఎం శ్రీనివాసరావు, ఆర్‌కెఎస్‌వి.కుమార్, నాయకులు బి.జగన్, పి.మణి, అంగన్వాడీ జిల్లా అధ్యక్షులు తులసి, ఆశా యూనియన్ జిల్లా అధ్యక్షులు పద్మ, పోర్టు యూనియన్ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, మెటార్ యూనియన్ ప్రధాన కార్యదర్శి జి.అప్పలరాజు, క్యాబ్ యూనియన్ అధ్యక్షుడు శ్రీనివాస్, రైల్వే యూనియన్ నాయకులు అప్పారావు, షిప్ యార్డ్ యూనియన్ నాయకులు రాజు, ప్రసాద్, జివిఎంసి యూనియన్ నాయకులు నూకరాజు, యు.రాజు, ఇంటిపని వారి సంఘం నాయకులు కుమారి తదితరులు మాట్లాడారు.
స్టీల్‌ప్లాంట్ అధీనంలోనే గంగవరం పోర్టు ఉండాలి
గాజువాక : విశాఖ స్టీల్‌ప్లాంట్ అధీనంలోనే ఆదానీ గంగవరం పోర్టు ఉండాలని విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ చైర్మన్ సిహెచ్ నర్సింగరావు డిమాండ్ చేశారు. బుధవారం క్విట్ మోడీ, సేవ్ వైజాగ్ స్టీల్ నినాదంతో పాత గాజువాక జంక్షన్‌లో నిరసన చేపట్టారు. క్విట్ మోడీ, సేవ్ వైజాగ్ స్టీల్ నినాదాలతో పాతగాజువాక హోరెత్తింది. ఈ సందర్భంగా నర్సింగరావు మాట్లాడుతూ, విశాఖ స్టీల్ ప్లాంట్‌ను దెబ్బతీయాలనే మోడీ ప్రభుత్వ కుట్రలో భాగంగా ఇప్పటికే ప్రయివేటీకరణ చర్యలు పూనుకోగా, తాజాగా స్టీల్‌ప్లాంట్‌కు చెందిన రూ.వెయ్యి కోట్ల విలువైన కుకింగ్ కోల్‌ను ఇవ్వకుండా గంగవరం పోర్టు సముద్రంలోనే నిలిపేశారన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను నిర్వీర్యం చేయాలన్న మోడీ ప్రభుత్వ దుశ్చర్యలను ఖండించాలన్నారు. ప్రయివేటుపరంగా ఉన్న అనేక సంస్థలను ప్రభుత్వరంగంలోకి మార్చిన సందర్భాలు అనేకం ఉన్నాయని, అదే విధంగా గంగవరం పోర్టును కూడా ప్రభుత్వంపరం చేయాలని డిమాండ్ చేశారు. ఒక్క పైసా తీసుకోకుండా స్టీల్‌ప్లాంట్ భూములను గంగవరం పోర్టుకు ఇచ్చిన విషయాన్ని మరువరాదన్నారు. విశాఖ పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్లు చైర్మన్ మంత్రి రాజశేఖర్, డి ఆదినారాయణ మాట్లాడుతూ విశాఖ స్టీల్‌ప్లాంట్ కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ప్రజాశాంతి పార్టీ అధినేత కెఎ.పాల్ మాట్లాడుతూ, మోడీని ఎదిరించే సత్తా రాష్ట్రంలో టిడిపి, వైసిపిలకు లేదన్నారు. పార్లమెంట్‌లో విశాఖ స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ వాణిని వినిపించేందుకు తాను విశాఖ నుంచి ఎంపీగా పోటీకి సిద్ధంగా ఉన్నానని, ప్రజలు గెలిపించాలని కోరారు. పవన్ కల్యాణ్ చేస్తున్న వారాహి యాత్ర మోడీ విజయ యాత్రలా ఉందని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో కార్మికసంఘాల నేతలు అయోధ్యరాం, యు రామస్వామి, వైటి.దాస్, ఎన్.రామారావు, సత్యనారాయణ, జెర్రిపోతుల ముత్యాలు పాల్గొన్నారు.










