Apr 16,2023 22:46

ప్రజాశక్తి-అజిత్‌సింగ్‌నగర్‌ : కేంద్రంలో బి.జె.పి ప్రభుత్వ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం, సిపిఐ పార్టీల ఆధ్వర్యంలో ఆదివారం కండ్రిక చివరి బస్‌ స్టాప్‌ వద్ద ప్రచార బేరి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సి.హెచ్‌ బాబురావు, సి.పి.ఐ నగర కార్యదర్శి జి. కోటేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారం లోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు ప్రజా సమస్యలను పరిష్కరించకుండా బడా పెట్టుబడిదారులకు అను కూలంగా వ్యవహరిస్తూ పజలపై భారాలు మోపుతున్నారన్నారు. బి.జె.పి అధికారంలోకి వచ్చినప్పుడు వంటగ్యాస్‌ 400 రూపాయలు ఉండేదని,కానీ నేడు 1200 రూపాయలకు చేరిందని నిత్యావసర వస్తువులు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు. బిజెపి ప్రభుత్వ రంగాలను ప్రైవేటు పరం చేయటం కుల, మత, ప్రాంతాల మధ్య చిచ్చులు పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి ప్రభుత్వం మన రాష్ట్రానికి ప్రత్యేక హౌదా ప్రత్యేక నిధులు ఇస్తామని చెప్పి మోసం చేసినా రాష్ట్ర ప్రభుత్వం బిజెపి ప్రభుత్వా న్ని నిలదీయడం లేదని బి.జె.పి చెప్పు చేతల్లో వై.సి.పి ప్రభుత్వం నడుస్తూ చెత్త పన్ను, ఆస్తి పన్ను, కరెంటు చార్జీల పేరిట బారాలు వేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సి.పి.ఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్‌, సెంట్రల్‌ సిటీ కార్యదర్శి భూపతి రమణారావు, నగర కార్యదర్శి వర్గ సభ్యులు కె. దుర్గారావు, నగర కమిటీ సభ్యులు సి.హెచ్‌ శ్రీనివాస్‌, జి. ఝాన్సీరాణి, ఎస్కే పీరు సాహెబ్‌, జి. సుజాత నాయకులు పి. వెంకటరెడ్డి, ఎస్‌. కె. నిజాముద్దీన్‌, పి.సాంబిరెడ్డి, జి. రామాంజనేయులు, సి.పి.ఐ నగర కార్యవర్గ సభ్యులు లంకా దుర్గారావు, కె.వి భాస్కరరావు, బుట్టి రాయప్ప,పి. దుర్గాంబ, ఎల్‌. శివకుమార్‌, కె. రామరాజు, కె.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.