Oct 26,2023 21:11

మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు వి.యేసు రత్నం
డోన్‌ పట్టణంలో బైక్‌ ర్యాలీ నిర్వహిస్తున్న సిపిఎం, ఐద్వా, ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ నాయకులు
డోన్‌ పట్టణంలో బైక్‌ ర్యాలీ నిర్వహిస్తున్న సిపిఎం, ఐద్వా, ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ నాయకులు




మోడీని గద్దె దింపుదాం
- ప్రజారక్షణ భేరి బస్సు జాతాను జయప్రదం చేయాలి
- సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు వి.ఏసురత్నం
ప్రజాశక్తి - ఆత్మకూర్‌

కేంద్రంలో ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీని గద్దె దింపాలని, ప్రత్యామ్నాయ ఇండియా కూటమిని గెలిపిద్దామని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వి.ఏసురత్నం పేర్కొన్నారు. ఈ నెల 31న జరిగే ప్రజా రక్షణ భేరి బస్సు జాతాను జయప్రదం చేయాలని కోరారు. గురువారం పట్టణంలోని డాక్టర్‌ ఏ.ధనుంజయ మీటింగ్‌ హాల్‌లో సిపిఎం పట్టణ కమిటీ విస్తృత స్థాయి సమావేశం పట్టణ కమిటీ సభ్యులు ఏ.సురేంద్ర అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం ప్రజలపై విచ్చలవిడిగా భారాలు మోపి పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తోందని విమర్శించారు. 2014లో బిజెపి అధికారంలోకి రాకముందు ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి తొమ్మిది సంవత్సరాలు అవుతున్నా ఉద్యోగాలు ఇవ్వకపోగా ప్రభుత్వ రంగాలను ప్రైవేటీకరణ చేసి ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్నారని అన్నారు. వంద రోజుల్లో ధరలు అరికడతామని చెప్పి నేడు పెట్రోలు, డీజిల్‌, వంట గ్యాస్‌, విద్యుత్తు నిత్యవసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నా నియంత్రించడం లేదన్నారు. రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామని చెప్పిన మోడీ నేడు అప్పులను, ఆత్మహత్యలను రెట్టింపు చేశారని విమర్శించారు. జిఎస్‌టి పేరుతో సామాన్య ప్రజలపై విపరీతమైన భారాలు మోపుతూ రాష్ట్రాలకు రావాల్సిన జిఎస్టి నిధులపైనా కేంద్రం పెత్తనం చేస్తుందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయకపోగా విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేసిన మోడీకి రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు గులాంగిరి చేస్తున్నాయని విమర్శించారు. బిజెపి విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం ప్రత్యా మ్నాయ రాజకీయ విధానం కోసం రాష్ట్రవ్యాప్తంగా మూడు బస్సు జాతాలు జరుగుతున్నాయని, అందులో ఒకటి ఆదోని నుండి ప్రారభమయ్యే జాతా ఈ నెల 31వ తేదీ ఆత్మకూరుకు చేరుకుంటుందని, పాతబస్టాండ్‌లో జరుగు బస్సు జాతాను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో సిపిఎం పట్టణ కార్యదర్శి ఏ. రణధీర్‌, సీనియర్‌ నాయకులు ఎం.రజాక్‌, నాయకులు ఎన్‌. స్వాములు, దినేష్‌, నాయకులు వీరన్న, పాల శివుడు, ఏ. కిరణ్‌, గణపతి, అంబయ్య, శ్రీధర్‌, సతీష్‌, నబి, మోహన్‌, రాజు, ప్రేమ్‌, కలిముల్లా, చాంద్‌, జబిల్లా, రమణ తదితరులు పాల్గొన్నారు. మిడుతూరు : లౌకిక వాదం, ప్రజాస్వామ్య పరిరక్షణ, అసమానతలు లేని అభివృద్ధి కోసం సిపిఎం చేపట్టిన ప్రజారక్షణభేరి జాతాను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం.నాగేశ్వరరావు కోరారు. మిడుతూరు లోని సిపిఎం కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నాయకులు పి లింగస్వామి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజలందరూ ఐక్యంగా పోరాడితేే ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కును కాపాడు కోగలమన్నారు. నాయకులు పకీర్‌ సాహెబ్‌, ఓబులేసు, దానమయ్య, ఏసన్న, ప్రభాకర్‌, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. డోన్‌: ఈనెల 31న నంద్యాల పట్టణంలో పెద్ద ఎత్తున జరుగు ప్రజా రక్షణ భేరీ బహిరంగ సభలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని సిపిఎం పట్టణ కార్యదర్శి నక్కి శ్రీకాంత్‌, సిఐటియు మండల అధ్యక్షులు రామాంజ నేయులు, ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు షమీం బేగంలు కోరారు. ప్రజా రక్షణ భేరిని జయప్రదం చేయాలని బైక్‌ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని సిపిఎం కార్యాలయం వద్ద సీనియర్‌ నాయకులు కొండయ్య జెండా ఊపి బైక్‌ ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ మండల కార్యదర్శి నక్కీ హరి, రామలింగం, రాజు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షురాలు ఇర్ఫానా బేగం, మండల అధ్యక్ష కార్యదర్శులు జె.అశోక్‌, మహబూబ్‌ బాషా, మహేంద్ర, సురేష్‌, సుధాకర్‌, భాస్కర్‌, రాజేంద్ర, మహేష్‌, తదితరులు పాల్గొ న్నారు. నందికొట్కూర్‌ టౌన్‌ : ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజారక్షణ భేరి బస్సు జాతా నిర్వహిస్తున్నట్లు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కె.భాస్కర్‌ రెడ్డి, పట్టణ కార్యదర్శి టి.గోపాలకృష్ణ తెలిపారు. స్థానిక భరత్‌ కాంప్లెక్స్‌లో సిఐటియు రూరల్‌ కార్యదర్శి సి.నాగన్న అధ్యక్షతన మండల కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ నెల 28, 29 తేదీలలో చేపట్టిన బస్సు జాతాను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఆంజనేయులు, హుస్సేన్‌, కిరణ్‌, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.