
ప్రజాశక్తి- యంత్రాంగం
దేవరాపల్లి : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించితేనే దేశానికి రక్షణ అని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న, మండల కార్యదర్శి బిటి దొర అన్నారు. ప్రచార భేరిలో భాగంగా బుధవారం దేవరాపల్లిలో ఉపాధి హామీ కూలీలను కలిసి మాట్లాడారు. మోడీ విధానాలను రాష్ట్రంలోని అధికారలో ఉన్న వైసిపి సమర్థించడం దారుణమన్నారు. దేశంలో ప్రతిపక్షాలు ఉండ కూడదని మోడీ, అమిత్‌షా కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. అంబేద్కర్ రాసిన రాజ్యంగాన్ని పక్కనబెట్టి మనుధర్మ శాస్త్రాన్ని తీసుకొచ్చి మతం, కులం పేరుతో ప్రజల మధ్య చీలికలు తేవాలని ఆర్‌ఎస్‌ఎస్ కుట్రలు చేస్తోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బి నాగేశ్వరరావు, ఎం.దేముడు, పి.లక్ష్మి, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
రాంబిల్లి : మండలంలోని లోవపాలెం, గజరెడ్డిపాలెం గ్రామాల్లో సిపిఎం నాయకులు ప్రచార భేరి నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి జి.దేముడునాయుడు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెంచిందని, ఫలితంగా నిత్యవసర వస్తువులు ధరలు కూడా భారీగా పెరిగి సామాన్యులు బతకలేని స్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన హామీలను మోడీ ప్రభుత్వం తుంగలో తొక్కినా రాష్ట్రంలోని అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి, జనసేన పార్టీలు మాట్లాడకపోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సిహెచ్.నూకన్న, వై.రాము, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.
అచ్యుతాపురం : సముద్రంలో చేపలు వేట నిషేధ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయం ప్యాకేజీ మత్స్యకారులందరికీ వర్తింపజేయాలని సిపిఎం నాయకులు ఆర్.రాము డిమాండ్ చేశారు. మండలంలోని పూడిమడక పంచాయతీ పరిధిలో బుధవారం ప్రచార భేరి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేపల వేట ద్వారా ఉపాధి పొందుతున్న మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం అతి తక్కువ మందికి మాత్రమే ఆర్థిక సహాయం ప్రకటించడం సరికాదని పేర్కొన్నారు. మత్స్యకారులకు 50 సంవత్సరాలకే పింఛన్ మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు గనగల నూకరాజు, ధోని అప్పారావు, మాణిక్యం పాల్గొన్నారు.
మాడుగుల:కేంద్ర ప్రభుత్వ దుర్మార్గాలను నిలదీసి, దేశాన్ని కాపాడుకోవాలని గిరిజన సంఘం ప్రధాన కార్యదర్శి ఇ.నరసింహ మూర్తి, వ్యవసాయ కార్మిక సంఘం నేత భవాని పిలుపునిచ్చారు. ఈ నెల 30 వరకు సిపిఎం, సీపీఐ తలపెట్టిన ప్రచార భేరి కార్యక్రమం బుధవారం మండలంలోని అవు రువాడ గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్రంలో కార్మికులకు వ్యతిరేకంగా, యాజమాన్యాలకు అనుకూలంగా తీసుకు వచ్చిన కార్మిక చట్టాలు వెంటనే రద్దు చేయాలని కోరారు. కేంద్రం తలపెట్టిన ప్రైవేటీకరణ ను ఆపాలని, అటవీ చట్టాలు పటిష్టంగా అమలు చేయాలన్నారు. ఉపాధి హామీ చట్టం కూలీలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రం ప్రజా వ్యతిరేక విధానాలు వీడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.
రోలుగుంట:బిజెపిని గద్దె దించాలని మండలంలో సిపిఎం ఆధ్వర్యంలో ఆర్ల, ఎంకె.పట్నం, ఎంకే పట్నం, పనసలపాడు, గంగవరం గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు ఈరెల్లి చిరంజీవి మాట్లాడుతూ, ప్రజలపై రోజు రోజుకి ధరల భారాలు పెరుగుతున్నాయన్నారు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ వంటి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు. కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయ లేదన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పోతురాజు, భీమరాజ్, శ్రీను పాల్గొన్నారు.