Aug 09,2023 20:57

క్విట్‌ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో బిజెపి విధానాలపై పోరు
మహాధర్నాలో కార్మిక, ప్రజాసంఘాల నేతలు
ప్రజాశక్తి - భీమవరం
క్విట్‌ ఇండియా ఉద్యమంతో దేశానికి స్వాతంత్రం ఇచ్చి బ్రిటీష్‌ వారు దేశాన్ని విడిచి వెళ్లారని అంత ప్రాముఖ్యత ఉన్న క్విట్‌ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో దేశాన్ని విచ్ఛిన్నం చేస్తూ సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతున్న బిజెపిని తరిమికొట్టాలని నేతలు పిలుపునిచ్చారు. మోడీ అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టడంతోపాటు మోడీని గద్దె దింపి, దేశాన్ని కాపాడాలని, ఆ విధంగా ప్రతిఒక్కరూ ఐక్యంగా ముందుకు సాగాలని ప్రతినబూనారు. కార్మికులు, ప్రజలపై భారాలు మోపుతూ కార్పొరేట్లకు దేశాన్ని ధారాదత్తం చేస్తున్న మోడీని గద్దె దింపండి.. దేశాన్ని కాపాడండి అనే నినాదంతో సిఐటియు, ఎఐటియుసి, టియుసిసి, రైతు, కౌలురైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్‌ కార్యాలయ ఆవరణలో బుధవారం మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా క్విట్‌ ఇండియా స్తూపం వద్ద అమరవీరులకు కార్మిక, ప్రజాసంఘాల నేతలు నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభకు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి.వాసుదేవరావు, రైతుసంఘం జిల్లా నాయకులు నరసింహమూర్తి, ఎఐటియుసి నాయకులు చెల్లబోయిన రంగారావు అధ్యక్షత వహించి మాట్లాడారు. మోడీ పాలనలో ఎవరూ సంతోషంగా లేరన్నారు. కార్పొరేట్లకు రూ.14 లక్షల కోట్లు రుణమాఫీ చేసిన ఘనత బిజెపి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు జెఎన్‌వి.గోపాలన్‌ మాట్లాడుతూ క్విట్‌ ఇండియా ఉద్యమం చరిత్రలో నిలిచిపోయిందన్నారు. ఈ ఉద్యమంలో భీమవరం ప్రాంతానికి ఎంతో ప్రత్యేకత ఉందన్నారు. పోలీస్‌ స్టేషన్‌పై బ్రిటీష్‌ జెండా తొలగిస్తున్న సమయంలో కాల్పులు జరిగాయని, ఈ కాల్పుల్లో ఇక్కడి వారు వీరమరణం పొందారని గుర్తు చేశారు. నేడు కేంద్రంలో ఉన్న బిజెపికి, బ్రిటీష్‌ పాలనకు తేడా లేదన్నారు. విభజించు-పాలించు నినాదంతో పరిపాలన సాగిస్తుందన్నారు. చెత్త పన్ను దగ్గర నుంచి అన్ని భారాలు ప్రజలపై మోపిందని విమర్శించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ అప్పట్లో తెల్ల దొరలు దోచుకుంటే ప్రస్తుతం నల్ల దొరలు దేశాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు. రైతుసంఘం జిల్లా కార్యదర్శి ఆకుల హరేరాం మాట్లాడుతూ ఢిల్లీ రైతాంగ పోరాటంలో 750 మంది రైతులు మృతి చెందారని గుర్తు చేశారు. నాడు ఇచ్చిన హామీలేవీ మోడీ అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. టియుసిసి నాయకులు లంక కృష్ణమూర్తి మాట్లాడుతూ దేశభక్తి గురించి, స్వాతంత్రం గురించి మాట్లాడే హక్కు నేటి పాలకులకు లేదన్నారు. రైతుసంఘం జిల్లా ఉపాధ్యక్షులు చింతకాయల బాబూరావు మాట్లాడుతూ స్వాతంత్రోద్యమంలో బిజెపిగాని, ఆర్‌ఎస్‌ఎస్‌గానీ పాల్గొనలేదన్నారు. దేశాన్ని దోచేస్తున్న బిజెపికి వ్యతిరేకంగా టిడిపి, వైసిపి, జనసేన మాట్లాడకపోవడం సిగ్గుచేటన్నారు. శ్రామిక మహిళ జిల్లా కార్యదర్శి డి.కళ్యాణి మాట్లాడుతూ మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు పెరిగాయన్నారు. సిఐటియు జిల్లా కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు మాట్లాడుతూ మోడీ ఇచ్చిన హామీలేవీ అమలు చేయడం లేదన్నారు. నల్లధనం తెస్తామని చెప్పిన బిజెపి పెద్ద నోట్లు రద్దు చేసి మరింత భారాన్ని మోపిందన్నారు. సిఐటియు జిల్లా కార్యదర్శి పివి.ప్రతాప్‌ మాట్లాడుతూ దేశం ప్రమాదకర పరిస్థితుల్లో ఉందన్నారు. మరో స్వాతంత్రోద్యమానికి నాంది పలకాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. తొలుత సిఐటియు కార్యాలయం నుంచి క్విట్‌ ఇండియా స్తూపం వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ప్రజాసంఘాల నేతలు ఎం.వైకుంఠరావు, ఎం.ఆంజనేయులు, షేక్‌ వలీ, చైతన్యప్రసాద్‌, ఎం.రామాంజనేయులు, డి.నాగు తదితరులు పాల్గొన్నారు. ప్రజానాట్యమండలి కళాకారులు ఆలపించిన అభ్యుదయ, దేశభక్తి గీతాలు ఆకట్టుకున్నాయి.
తాడేపల్లిగూడెం: కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి కార్మికులు, రైతులు, ప్రజలు సన్నద్ధం కావాలని ఎఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.సోమసుందర్‌ పిలుపునిచ్చారు. కేంద్ర కార్మికసంఘాల పిలుపు మేరకు క్విట్‌ ఇండియా దినోత్సవం సందర్భంగా ఎఐటియుసి ఆధ్వర్యంలో ఆర్‌టిసి డిపో వద్ద మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా డి.సోమసుందర్‌ మాట్లాడారు. కార్యక్రమంలో నేతలు ఓసూరి వీర్రాజు, పడాల శ్రీనివాస్‌, కళింగ లక్ష్మణరావు మాట్లాడారు.