Jun 28,2023 00:26

ప్రజాశక్తి - మాచర్ల : తనకు అధికారం ఇస్తే కేంద్రం మెడలు వంచి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతానని హమీ ఇచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి మోడీకి పాదపూజ చేస్తున్నారని టిడిపి జిల్లా అధ్యక్షులు జివి ఆంజనేయులు అన్నారు. భవిష్యత్‌కు గ్యారంటీ చైతన్య రధయాత్ర (బస్సు యాత్ర) సందర్బంగా దుర్గిలో జరిగే బహిరంగ సభకు తెలుగుదేశం పార్టీ నాయకులు రింగ్‌ రోడ్డు సెంటర్‌ నుండి పట్టణ పురవీధులలో పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. ర్యాలీగా దుర్గి వెళుతూనే ప్రత్యేక వాహనంపై నుండి జివి ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట్రంలోని యువతకు జాబ్‌ రావాలంటే బాబు ప్రభుత్వం రావాల్సిందేనని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని జగన్‌మోహన్‌రెడ్డి దోచుకుంటు ఉంటే, స్ధానికంగా ఎం.ఎల్‌.ఎలు దోచుకుంటున్నారని ఆక్రమ మైనింగ్‌ని వివరిస్తూ విమర్శించారు. మద్యపాన నిషేదాన్ని ఎందుకు అమలు చేయలేదని నిలదీశారు. మద్దతు ధరలు ఇచ్చి రైతులను ఆదుకోలేని ప్రభుత్వం జగన్‌మోహన్‌రెడ్డిదని అన్నారు. మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ రోజుకి 100 నుండి 500 టిప్పర్ల మట్టిని ఆక్రమంగా తరలిస్తూ, ఒక్క వాహనానికి రూ 2 వేలు చొప్పున దోపిడి చేస్తున్నారని మాచర్ల ఎం.ఎల్‌.ఎ అవినీతిని దుయ్యబట్టారు. దేశం పార్టీ ఇన్‌చార్జీ జూలకంటి బ్రహ్మరెడ్డి మాట్లాడుతూ వ్యవస్థను కాపాడవలసిన పోలీసులు ఎం.ఎల్‌.ఎకి కొమ్ముకాస్తూ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు. ర్యాలీలో నియోజకవర్గం నలుమూలల నుండి నాయకులు, కార్యకర్తలు పాల్గోని విజయవంతం చేశారు.
తెలుగుదేశం పార్టీ బస్సు యాత్రలో భాగంగా మంగళవారం మాచర్లకు వచ్చిన టిడిపి నాయకులకు శ్రేణులు ఘన స్వాగతం పలికారు. బస్సు వెంట భారీ ద్విచక్రవాహన ర్యాలీ కోనసాగింది. మంగళవారం కారంపూడి నుండి ప్రారంభమైన భవిష్యత్‌కు గ్యారంటీ చైతన్య బస్సు యాత్ర సాయంత్రం 4 గంటల సమయానికి మాచర్లకు చేరుకుంది. బస్సు యాత్రలో వస్తున్న నాయకులకు రాయవరం జంక్షన్‌ నుండి కార్యకర్తలు స్వాగతం పలికి పట్టణంలోకి తీసుకొచ్చారు. సమయాభావం వల్ల నిర్మాణ దశలోని టిడ్కో గృహల సందర్శన కూడ వాయిదా పడింది. మండల కేంద్రమైన దుర్గిలో జరిగే భారీ బహిరంగ సభకు హజరు కావలసి ఉన్నందున స్థానిక కార్యక్రమాలను రద్దు చేసుకున్నట్లు దేశం పార్టీ ఇన్‌చార్జీ జూలకంటి బ్రహ్మరెడ్డి తెలిపారు. పట్టణ తెలుగుదేశం పార్టీ నేతలందరు భోజనాలు చేసిన అనంతరం స్థానిక రింగ్‌ రోడ్డు సెంటర్‌ నుండి ర్యాలీగా దుర్గి బయలుదేరి వెళ్లారు. బస్సు యాత్రలో మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జివి ఆంజనేయులు, గుంటూరు ఇన్‌చార్జీ నజీర్‌ ఆహమ్మద్‌ తదితర నాయకులు పాల్గొన్నారు.