May 25,2022 06:39

ఆస్ట్రేలియాలో స్కాట్‌ మోరిసన్‌ నేతృత్వంలోని మితవాద ప్రభుత్వానికి ప్రజలు దిమ్మతిరిగే తీర్పునిచ్చారు. ఆదివారం జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో తొమ్మిదేళ్ల మితవాద పాలనకు ప్రజలు చరమగీతం పాడారు. మోరిసన్‌ను ఇంటికి సాగనంపడమే గాక, ఆయన తరువాత మితవాద కూటమికి నాయకత్వం వహిస్తాడనుకున్న సీనియర్‌ నాయకుడు జోష్‌ ఫ్రైడెన్‌బర్గ్‌నూ చిత్తుగా ఓడించారు. గత సారితో పోల్చితే మోరిసన్‌ పార్టీకి 5.7 శాతం ఓట్లు, 17 సీట్లు తగ్గి 54 సీట్లకు పరిమితమైంది. పాలక లిబరల్‌ నేషనల్‌ పార్టీ ఇంతటి అవమానకర ఓటమిని చవిచూడడం 1983 తరువాత ఇదే మొదటిసారి. 2007 తరువాత తొలిసారి అధికారంలోకి వచ్చిన ప్రతిపక్ష లేబర్‌ పార్టీ లౌకికతత్వం, ప్రజాతంత్ర విలువల పరిరక్షణ గురించి మాట్లాడినా, ఆర్థిక విధానాల విషయంలో లిబరల్‌ నేషనల్‌ పార్టీకి, లేబర్‌ పార్టీకి మధ్య పెద్దగా తేడా ఏమీ లేదు. రెండు సాంప్రదాయక పార్టీల వ్యవస్థలో తృతీయ శక్తి అవతరించడానికి అవకాశాలు తక్కువ. ఎన్నికల ముందు తీసుకొచ్చిన చట్ట సవరణ వల్ల ఆస్ట్రేలియా కమ్యూనిస్టు పార్టీ, (సిపిఎ) సోషలిస్టు ఈక్విటీ పార్టీ (ఎస్‌ఇపి) వంటి వామపక్ష శక్తులు పోటీకి అవకాశం లేకుండా చేసింది. ప్రతిపక్ష లేబర్‌ పార్టీ అత్తెసరు సీట్లతో అధికారంలోకి వచ్చింది. 151 స్థానాలు ఉన్న పార్లమెంటులో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన కనీస మెజారిటీకి (76 స్థానాలకు) నాలుగు సీట్లు తగ్గాయి. దీంతో గ్రీన్స్‌, టేల్స్‌, ఇండిపెండెంట్ల మద్దతుతో లేబర్‌ పార్టీ అధికారం హస్తగతం చేసుకుంది. ప్రధానమైన ఈ రెండు రాజకీయ పార్టీల పట్ల ప్రజల్లో విముఖతకు తగ్గిన ఓటింగ్‌ శాతం ఒక సంకేతం. 2019లో జరిగిన ఎన్నికల్లో 74 శాతం ఓట్లు పోల్‌ కాగా, ఈసారి 68.5 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఇంత తక్కువగా ఓట్లు పోల్‌కావడం రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఆస్ట్రేలియా చరిత్రలో ఇదే మొదటిసారి. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే రెండు పార్టీల వ్యవస్థను బద్దలు కొట్టేలా ఎన్నికల సంస్కరణలు తేవాలి.
    ఆస్ట్రేలియా పాలిట మరో ట్రంప్‌లా పరిణమించిన మోరిసన్‌ ఓటమికి ప్రధాన కారణం ఆయన అవలంబించిన ప్రజా వ్యతిరేక విధానాలే అనడంలో ఎలాంటి సందేహం లేదు. దేశం ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యల నుంచి ప్రజల దృష్టిని పక్కదారి పట్టించేందుకు జాతి, మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టడం, ఆదివాసీ తెగలపై నిర్బంధాన్ని ప్రయోగించడం, వరదలు, కార్చిచ్చులు, కరువుకాటకాలు, కోవిడ్‌ మహమ్మారి విజృంభించినప్పుడు మోరిసన్‌ నీరో చక్రవర్తిని తలపించారు. ఒక వైపు సంక్షేమానికి కోత పెడుతూ, మరో వైపు ఆకస్‌, క్వాడ్‌ వంటి యుద్ధ కూటములకు మద్దతుగా వందల కోట్ల డాలర్లు మిలిటరీ వ్యయం కోసం వెచ్చించారు. అమెరికన్‌ అణు సబ్‌మెరైన్లకు బేషరతుగా అనుమతి ఇవ్వడ అమెరికా సైనిక స్థావరాలను ఆస్ట్రేలియా భూ భాగంలో ఏర్పాటు చేసుకునేందుకు అనుమతించడం ద్వారా స్వతంత్ర విదేశాంగ విధానానికి తూట్లు పొడిచారు. 2030 నాటికి గ్రీన్‌ హౌస్‌ గ్యాస్‌ ఉద్గారాలను గణనీయంగా తగ్గించుకుంటామని, 2050 నాటికి పూర్తిగా జీరో స్థాయికి తీసుకొస్తామని ఇచ్చిన హామీలకు భిన్నంగా అదానీ వంటి కార్పొరేట్లకు బొగ్గు గనులను అప్పగించారు. ఒక్క మాటలో చెప్పాలంటే మోరిసన్‌ తన తిరోగమన విధానాలతో ఆస్ట్రేలియాను అన్ని విధాలా భ్రష్టు పట్టించారు. ఇటువంటి అభివృద్ధి నిరోధక రాజకీయాల్లో మోరిసన్‌కు, మోడీకి మధ్య అనేక పోలికలున్నాయి. చైనాకు వ్యతిరేకంగా అమెరికాతో చేతులు కలిపారు. క్వాడ్‌ కూటమిలో అమెరికా, జపాన్‌లతో భాగస్వాములయ్యారు. కార్మిక హక్కులపై దాడి చేస్తూ, బడా పెట్టుబడిదారుల అనుకూల విధానాలను అమలు చేయడంలో ఇద్దరూ ఇద్దరే. ప్రజాతంత్ర హక్కులను కాలరాయడంలోను, నిరంకుశ పద్ధతులను అనుసరించడంలోను వీరి మధ్య తేడా ఏమీ లేదు. అమెరికాలో పచ్చి మితవాది ట్రంప్‌ నిష్క్రమించిన కొద్ది కాలానికే జపాన్‌ ప్రధాని అబె తప్పుకున్నారు. తాజాగా మోరిసన్‌ అదే బాట పట్టారు. అమెరికా, భారత్‌, ఆస్ట్రేలియా, జపాన్‌లతో కూడిన క్వాడ్‌ కూటమిలో ముగ్గురు నేతలు ఒకరి తరువాత ఒకరు ఈ రెండేళ్లలోనే నిష్క్రమించారు. ఇక మోడీ వంతు మిగిలి ఉంది. కార్పొరేట్‌ హిందూత్వ మతతత్వ విధానాలను ఇదే విధంగా కొనసాగిస్తే మోరిసన్‌కు పట్టిన గతే మోడీ ప్రభుత్వానికీ పడుతుంది. అందుకే మోడీకి ఇదొక గుణపాఠం కావాలి.