ప్రజాశక్తి - గోనెగండ్ల
కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ విషపూరిత విధానాలను తిప్పికొట్టి రాజ్యాంగ హక్కులను కాపాడుకోవాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎమ్‌డి.ఆనంద్ బాబు కోరారు. సోమవారం గోనెగండ్లలో సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో ప్రచార భేరి కార్యక్రమాన్ని ఆనంద్ బాబు ప్రారంభించారు. ప్రచార భేరి సభలు బస్టాండ్ సెంటర్‌లో ప్రారంభమై వైఎస్‌ఆర్ సర్కిల్, గంజహళ్లి రోడ్, చింతల మునిస్వామి గుడి, పెద్ద కట్ట, సంతబజార్, బీరప్ప గుడి, ఎస్సీ కాలనీ, స్టేట్ బ్యాంక్ సెంటర్లలో సాగాయి. కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు బి.కరుణాకర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆనంద్ బాబు, ఎఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు మునిస్వామి, ఈరన్న మాట్లాడారు. తెల్లవారిని తరిమికొట్టి దేశానికి స్వాతంత్య్రం సాధించుకోవడంతో పాటు, రాజ్యాంగం ద్వారా ప్రజలందరికీ హక్కులను సాధించుకున్నామని తెలిపారు. నేడు మోడీ, అమిత్ షాల నాయకత్వంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం, ప్రజలకు దక్కాల్సిన రాజ్యాంగ హక్కులన్నీ ధ్వంసం చేస్తూ, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తోందని విమర్శించారు. ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొడుతోందని మండిపడ్డారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూ పాలిస్తున్న బిజెపిని ఇంటికి సాగనంపేదాకా ప్రజలను మరింత ఐక్యం చేసి పోరాడాలని కోరారు. ప్రచార భేరికి న్యాయవాదులు చంద్రశేఖర్, వెంకటేష్‌లు మద్దతు తెలిపారు. డేవిడ్ రాజు, ఐరన్ బండ దేవదాస్, గోనెగండ్ల మారేష్, నరసింహుడు, పెద్ద నేలటూరు పెద్ద దస్తగిరి, ఏనుగ బాల ఆనంద్, పిల్లిగుండ్ల పెద్ద భీమన్న, ఎస్‌ఎఫ్‌ఐ ఖాజా పాల్గొన్నారు. దేవనకొండ మండలంలోని నల్లచెలిమల గ్రామంలో సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో ప్రచార భేరి నిర్వహించారు. సిపిఐ, సిపిఎం జిల్లా నాయకులు కె.మద్దిలేటిశెట్టి, బి.వీరశేఖర్ మాట్లాడారు. ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దింపి దేశాన్ని కాపాడుకోవాలని కోరారు. సిపిఐ, సిపిఎం మండల నాయకులు సూరి, బజారి, నరసింహులు, భూపేష్, పల్లెదొడ్డి నాగేష్ రాజు, పెద్ద రంగన్న, నాగరాజు, దుబ్బ నరసింహ, కిష్టన్న, లక్ష్మన్న పాల్గొన్నారు.
ప్రచార భేరిలో మాట్లాడుతున్న ఆనంద్ బాబు










