దేశ రక్షణ భేరి ప్రచారోద్యమంలో సిపిఎం నేతలు
ప్రజాశక్తి -ములగాడ : ప్రధాని మోడీ నేతృత్వంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక వినాశకర విధానాలను ప్రతిఘటిద్దామని సిపిఎం నేతలు పిలుపునిచ్చారు. దేశ రక్షణ భేరి ప్రచారోద్యమంలో భాగంగా సోమవారం మల్కాపురం జోన్, 59వ వార్డు నెహ్రునగర్, హనుమాన్ నగర్ ప్రాంతాల్లో సిపిఎం ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి, రాష్ట్రానికి, ప్రజలకు బిజెపి చేసిన ద్రోహాన్ని వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సిపిఎం మల్కాపురం జోన్ నాయకుడు ఆర్.లక్ష్మణమూర్తి మాట్లాడుతూ, ఎనిమిదేళ్ల బిజెపి పాలనలో ధరాభారంతో సామాన్యుని జీవనం కుదేలైందన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 44 చట్టాలను నాలుగు లేబర్ కోడ్స్‌గా మార్చి కార్మిక హక్కులను కాలరాసి, కార్పొరేట్లకు దాసోహం అంటున్నారని మండిపడ్డారు. లాభాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలకు ఆదానీ,అంబానీ వంటి కార్పొరేట్లకు కట్టబెట్టి, నిరుద్యోగ సమస్యను మరింత పెంచుతున్నారన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న ప్రత్యేకహోదా, విశాఖ కేంద్రంగా రైల్వేజోన్, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేకప్యాకేజీ వంటి హామీలన్నీ అమలు చేయకున్నా, రాష్ట్రంలోని అధికార, విపక్షాలు వైసిపి, టిడిపిలు మోడీ ముందు మోకరిల్లి ప్రజలకు, రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీటన్నింటినీ ప్రతిఘటించి, పాలకులకు బుద్ధి చెప్పాలంటే ప్రజలు, కార్మికులు ఏకతాటిపైకి వచ్చి ఉద్యమించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ప్రచారోద్యమంలో జె.రామునాయుడు, చీమల పైడిరాజు ,యు.రాజు ఎం.శ్రీను, ప్రశాంత్, జె.ఈశ్వరరావు, మోహనరావు, సూరిబాబు, రాంబాబు పాల్గొన్నారు.
సిపిఎం ఆధ్వర్యంలో పాదయాత్ర
గోపాలపట్నం : దేశ రక్షణభేరి పాదయాత్రలో భాగంగా సిపిఎం గోపాలపట్నం జోన్ కమిటీ అధ్యక్షులు బలివాడ వెంకటరావు ఆధ్వర్యంలో లక్ష్మీనగర్, ఇందిరానగర్, రామకృష్ణ నగర్ తదితర ప్రాంతాల్లో సిపిఎం బృందం పాదయాత్ర నిర్వహించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెంచి కేంద్ర ప్రభుత్వం కుదేలు పరిస్తే, చెత్తపై కూడా పన్ను విధించి, ఒత్తిడి తెచ్చి వసూలు చేస్తూ సామాన్య ప్రజలు జీవించలేని పరిస్థితులు కల్పిస్తున్నారని అవగాహన కల్పించారు. ప్రజలంతా సంఘటితమై పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం నేతలు జి.మురళీకృష్ణ, ఆర్.మల్లేష్ పాల్గొన్నారు.










