ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్ : ప్రధాని నరేంద్ర మోడీ విధానాలు దేశానికి పెను ప్రమాదమని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం కన్వీనర్ బాలాజీ మనోహర్ పేర్కొన్నారు. సోమవారం పుట్టపర్తిలో కోటా లాడ్జ్‌లో ఆ పార్టీ విస్తృతస్థాయి సమావేశం సీనియర్ నాయకుడు కోటా సత్యం అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో నియోజకవర్గ కోఆర్డినేషన్ సభ్యులు ఏడుగురిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈసందర్బంగా కన్వీనర్ బాలాజీ మనోహర్ మాట్లాడుతూ చంద్రబాబు, పవన్, బిజెపి ఒకటే అన్నారు. గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ అంటూ జత కడతారన్నారు. ముఖ్యమంత్రి జగన్ కేసుల వల్ల రాష్ట్ర ప్రయోజనాల గురించి నిలదీయలేని నిస్సహాయకుడిగా మారాడన్నారు. తగినన్ని సీట్లు ఇస్తే మెడలు వంచుతానని ప్రగల్బాలు పలికిన జగన్ ఈ నాలుగున్నర ఏళ్లలో బిజెపి పెద్దలకు సాష్టాంగాలు పెడుతున్నాడని విమర్శించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మతోన్మాద అల్లర్లు సృష్టించడం, యుద్ధ బూచి చూపడం బిజెపికి పరిపాటిగా మారిందన్నారు. రాష్ట్రానికి విభజన హామీలు, ప్రత్యేక హోదా కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు. బిజెపిని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్‌కే ఉందన్నారు.కోఆర్డినేషన్ సభ్యులు పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని, ఎమ్మెల్యే అభ్యర్థిని కూడా వారే నిర్ణయిస్తారని చెప్పారు. సిడబ్ల్యుసి సభ్యుడుగా రఘువీరా రెడ్డి ఎంపిక కావడం పట్ల ఆయనతో పాటు కోటా సత్యం హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పార్టీకి పూర్వ వైభవం రానున్నదన్నారు. అసెంబ్లీ కోఆర్డినేషన్ సభ్యులుగా కోటా సత్యం, కోట శ్వేత, మాజీ ఎమ్మెల్యే నాగరాజు రెడ్డి, మహమ్మద్ గౌస్, ప్రసాద్, మనోహర్ నాయుడు, గౌస్‌బాషా ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో ఆ పార్టీ నాయకులు వేమనారాయణ, కొండకమర్ల బాబు, పాముదుర్తి రవికుమార్, అమానుల్లా, పుట్ల గంగాద్రి, జమీల్, తిరుపాల్, పోతుల రాజు, మారాల ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.










