ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి, యంత్రాంగం కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ బుధవారం కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యాన పలుచోట్ల ఆందోళనలు చేపట్టారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాటాలు నిర్వహిస్తామని సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు బేబిరాణి, ఇతర కేంద్ర కార్మిక సంఘాల నేతలు అన్నారు. విభజన చట్టంలోని హామీలు, ఎపికి ప్రత్యేక హోదా, నిధులు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ నోరు మెదపకపోవడం శోచనీయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ బుధవారం కేంద్ర కార్మిక సంఘాలు స్థానిక జిల్లా పరిషత్ సెంటర్‌లో చేపట్టిన మహా ధర్నా ప్రారంభం కాకముందే పోలీసులు పలువురు నాయకులను అక్రమంగా అరెస్టు చేసి పోర్టు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నేతలు పోలీసులకు మధ్య వాదోపవాదాలు జరిగాయి. తోపులాట నడుమ నాయకులను వాహనాల్లోకి బలవంతంగా ఎక్కించి స్టేషన్ కు తీసుకెళ్లారు. మోడీ విధానాలను ప్రశ్నిస్తే జగన్ అక్రమంగా అరెస్టులు చేయడం సిగ్గుచేటు అని కార్మిక సంఘాల నేతలు స్టేషన్ వద్ద ఆందోళన సందర్భంగా నినాదాలు చేశారు. అరెస్టులకు నిరసనగా స్టేషన్‌లో ధర్నా కొనసాగించారు. సిఐటియు జిల్లా అధ్యక్షుడు దువ్వా శేషబాబ్జి, ఐఎఫ్‌టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె.వెంకటేశ్వరరావు, ఎఐటియుసి రాష్ట్ర కన్వీనర్ గొడుగు సత్యన్నారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, టిఎన్‌టియుసి జిల్లా నాయకులు రాజారావు, సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి బోడకొండ మాట్లాడారు.
పోలీసులు అరెస్టు చేసిన వారిలో సిఐటియు జిల్లా కోశాధికారి మలక రమణ, జిల్లా ఉపాధ్యక్షుడు కె.సత్తిరాజు, జిల్లా సహాయ కార్యదర్శి చంద్రమళ్ల పద్మ, జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ, నర్ల ఈశ్వరి, రొంగల ఈశ్వరరావు, నక్కెళ్ల శ్రీను, టి.రాజా, సురేష్ ఇజ్రాయిల్, షేక్ పద్మ, అల్లాడి సూరిబాబు, కేశవరపు అప్పలరాజు, బొబ్బిలి శ్రీనివాసు తదితరులు ఉన్నారు.
అరెస్టులు రాజ్యాంగ విరుద్ధం
కేంద్ర కార్మిక సంఘాలు శాంతియుతంగా కాకినాడ జిల్లా పరిషత్ సెంటర్‌లో తలపెట్టిన ధర్నాను భగం చేస్తూ అక్రమ కేసులతో అరెస్టులు చేయడం రాజ్యాంగం కల్పించిన స్వాతంత్య్రం కాదని పౌరసంక్షేమ సంఘం కన్వీనర్ సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. త్రాళ్లరేవు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తహశీల్దారు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం డిప్యూటీ తహశీల్దారు సూరిబాబుకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు టేకుమూడి ఈశ్వరరావు, కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాజబాబు, విశ్వజన కళా మండల జిల్లా అధ్యక్షులు వడ్డి ఏడుకొండలు మాట్లాడారు. పులప కూర గోపాలకృష్ణ, మంద నక్క తణుకురాజు, కొల్లాటి వరలక్ష్మి, గోడి భాస్కరరావు, పితాని బాపనమ్మ, పిట్ట గంగాలమ్మ, పిట్ట అర్జున్, పలివెల సింహాచలం, దడాల సుబ్బరాజు, నేల అన్నవరం, మురమళ్ల శ్రీను, పులగల అప్పారావు, సత్యనారాయణ, పాలెపు ఈశ్వరరావు, లక్ష్మి పాల్గొన్నారు. పిఠాపురం పట్టణంలోని రథాలపేట సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద కెవిపిఎస్, దళిత సంఘాలు, వ్యవసాయ కార్మికు సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి కె.సింహాచలం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కెె.శివశంకర్, కెవిపిఎస్ మండల కన్వీనర్ ఎం.ఫ్రెడరిక్, వ్యవసాయ కార్మిక సంఘం నేత ఊబా బుల్లెబ్బాయి, కౌన్సిలర్ కె.పోశయ్య, కెవిపిఎస్ దళిత సంఘాల నాయకులు ఎం.ఏడుకొండలు, ఎం.నాగరాజు, తుమ్మలపల్లి మోహన్, పెదపాటి చిన్ని, ప్రసాద్ పాల్గొన్నారు. కాకినాడ నాడు క్విట్ ఇండియా పిలుపుతో దేశం నుంచి బ్రిటిష్ వారిని తరిమికొట్టినప్పటికీ, బ్రిటిష్ వారి కంటే ప్రమాదకరమైన కుల వివక్ష, మతోన్మాదం దేశంలో నేటికీ కొనసాగుతుతోందని, వాటిని కూడా ఈ దేశం నుండి తరిమి కొట్టాలని దళిత ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. క్విట్ ఇండియా డే సందర్భంగా బుధవారం దళిత, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ ఇంద్రపాలెం లాకులు వద్ద ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద క్విట్ వివక్ష, క్విట్ మతోన్మాదం అనే నినాదంతో నిరసన చేపట్టారు. సీనియర్ దళిత నాయకులు అయితాబత్తుల రామేశ్వరావు మాట్లాడుతూ భారత రాజ్యాంగం కుల వివక్షను నిషేధించినప్పటికీ నేటికీ భారతదేశంలో కుల వివక్ష కొనసాగుతోందనన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కెఎస్.శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలో బిజెపి రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశం మతోన్మాదం వైపు పయనిస్తోందని, భారత లౌకిక రాజ్యాంగాన్ని పక్కనపెట్టి మనువాద రాజ్యాంగం అమలు చేయడానికి బిజెపి ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఎఐఎఫ్‌టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంబాల సతీష్, ఎస్‌సి, ఎస్‌టి ఫోరం నాయకులు మోతా కృష్ణమూర్తి, కైస్తవ పరిషత్ నాయకులు కాశి బాలయ్య, మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బాంసెఫ్ నాయకులు కింగ్, దళిత సత్తా నాయకులు బచ్చల కామేశ్వరరావు, భయ్యా రాజేంద్రకుమార్, కెవిపిఎస్ జిల్లా అధ్యక్షుడు బుడితి సురేష్ కుమార్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎం.గంగాసూరిబాబు పాల్గొన్నారు.










