కడప అర్బన్ : కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో హెడ్ పోస్ట్ ఆఫీస్, బిఎస్‌ఎన్‌ఎల్ కేంద్ర కమిటీ వామపక్ష రైతు కార్మిక సంఘాల పిలుపుమేరకు బ్లాక్ డే నిరసన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. వామపక్ష రైతు కార్మిక సంఘాల జిల్లా కార్యదర్శులు నాగ సుబ్బారెడ్డి, కె. శ్రీనివాసులు రెడ్డి, బి.దస్తగిరిరెడ్డి, ఎం.వి. సుబ్బారెడ్డి, అన్వేష్, సుబ్రహ్మణ్యం హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులపై కాల్పులు జరిపి ప్రాణాలను బలి తీసుకున్న ఘటనకు బాధ్యుడైన మంత్రిని బర్త్ రఫ్ చేయాలని నిరసనగా దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా బ్లాక్ డే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతులు, పేదలు, కార్మికులు, సామాన్య ప్రజల సమస్త ప్రయోజనాలను నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. బ్యాంకులలోని లక్షల కోట్ల రూపాయలను కార్పొరేట్లకు ఉదారంగా అందజేస్తూ, తొమ్మిదేళ్ల కాలంలో దాదాపు రూ.12 లక్షల కోట్ల రుణాలను రైటాఫ్ పేరుతో రుణమాఫీ చేసిందని పేర్కొన్నారు. వ్యవసాయ సంక్షోభం ఫలితంగా అప్పుల ఊబిలో కూరుకు పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల రుణాలు మాఫీ చేయడానికి మోడీ ప్రభుత్వానికి చేతులు రావడం లేదన్నారు. కార్పొరేట్ కంపెనీల రుణాలు మాఫీ చేయడం కాదని, మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఓడరేవులు, ఎయిర్ పోర్టులు, విద్యుత్ సంస్థలు, రైల్వే, బొగ్గు గనులు, చివరకు ఆదివాసి, గిరిజనుల అటవీ భూములపై హక్కులను హరిస్తూ తాజాగా అటవీ చట్టానికి సవరణ పాస్ చేసిందని విమర్శించారు. చర్యలన్నీ కార్పొరేట్లకు ప్రత్యేకంగా మోడీ మానస పుత్రుడు గౌతమ్ అదానీని ప్రపంచ కుబేరులలో మొదటి స్థానానికి చేర్చేందుకు దోహదపడ్డాయన్నారు. మరోవైపు కార్మికుల హక్కులను హరిస్తూ నాలుగు లేబర్ కోడ్‌లను తీసుకువచ్చిందన్నారు. ఫలితంగా బలహీన వర్గాల ప్రజల ఉపాధికి నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్లకు లాభాలు పెంచి ప్రజల సంపదలు లూటీ చేస్తున్న కార్పొరేట్లను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఢిల్లీ రైతాంగం సందర్భంగా కేంద్ర మోడీ ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తీవ్రంగా విమర్శించారు. వెంటనే కేంద్ర మంత్రిని తొలగించాలని లేనిపక్షంలో కేంద్ర మోడీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. బ్లాక్ డే నిరసన కార్యక్రమానికి సిపిఐ, సిపిఎం జిల్లా కార్యదర్శులు గాలి చంద్ర, జి.చంద్రశేఖర్, సిపిఎం నగర్ కార్యదర్శి ఎం. రామ్మోహన్ సంఘీభావం ప్రకటించారు. నిరసన కార్యక్రమంలో ఎపి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గోపాలకష్ణయ్య, ఎఐటియుసి జిల్లా అధ్యక్షులు వేణుగోపాల్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ బాదుల్లా, సిఐటియు నగర అధ్యక్ష, కార్యదర్శులు సుబ్బయ్య, చంద్రారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు శివకుమార్, రైతు సంఘం జిల్లా నాయకులు మనోహర్ రెడ్డి, చంద్రయ్య, శంకర్ రెడ్డి, ఎఐటియుసి నగర అధ్యక్షులు మదిలేటి, సిపిఎం నగర కార్యదర్శి రామ్మోహన్, మహిళా సంఘం నాయకులు రాజామణి పాల్గొన్నారు.
నిరసనలో వామపక్ష రైతు సంఘాల నాయకులు
జమ్మలమడుగు : మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక, రైతుల పక్షాన కార్మిక వర్గం తరఫున సిఐటియు ఆధ్వర్యంలో జమ్మలమడుగు పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద సిఐటియు ప్రధాన కార్యదర్శి బి.మనోహర్ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. రైతులపై కాల్పులు జరిపి వారి ప్రాణాలను బలి తీసుకున్న ఘటనకు బాధ్యుడైన మంత్రిని బర్త్ రఫ్ చేయనందుకు నిరసనగా దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా బ్లాక్ డే నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం బ్యాంకులలోని లక్షల కోట్ల రూపాయలను కార్పొరేట్లకు ఉదారంగా అందజేస్తూ, ఈ 9 సంవత్సరాల కాలంలో దాదాపు రూ.12 లక్షల కోట్ల రుణాలను రైటాఫ్ పేరుతో రుణమాఫీ చేసిందని చెప్పారు. ఢిల్లీ రైతాంగం సందర్భంగా కేంద్ర మోడీ ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తీవ్రంగా విమర్శించారు. రైతాంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. బ్లాక్ డే నిరసనకు సిఐటియు పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు మొరగుడి దాసు దాసరి. విజరు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ సభ్యులు విజయకుమార్ సిఐటియు ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు.కడప : బిఎస్‌ఎన్‌ఎల్, తపాలా కార్యాలయాల వద్ద నిరసన తెలియజేస్తున్న నాయకులు










