చెవిలో పూలు పెట్టుకొని డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకుల నిరసన
ప్రజాశక్తి-విజయవాడ
ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పట్నం సభలో రాష్ట్రానికి ఇచ్చిన హామీలపై ఒక్క మాట మాట్లాడకుండా రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన తీరును ఖండిస్తూ డివైఎఫ్‌ఐ,ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో శనివారం స్థానిక లెనిన్ సెంటర్లో చెవులో పువ్వులు పెట్టి నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి, ప్రధాని నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్న తీరు, సిఎం వైఎస్‌జగన్మోహన్‌రెడ్డి మెతకవైఖరికి వ్యతిరేకంగా ఆయా సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి జి. రామన్న, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి కె.ప్రసన్న మాట్లాడుతూ నరేంద్ర మోడీ ఎనిమిది సంవత్సరాల క్రితం రాష్ట్రానికి ఇచ్చిన హామీలు గురించి విశాఖ సభలో మాట్లాడకపోవడం తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని అన్నారు. సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హౌదా, విభజన హామీలు అంశం మీద ప్రధాని నరేంద్ర మోడీని అభ్యర్థిస్తున్నట్లు సిఎం తెలుగులో మాట్లాడటం సరికాదన్నారు. హిందీలో కానీ ఆంగ్లంలో కాని మాట్లాడి ప్రధాని నరేంద్ర మోడీకి రాష్ట్ర సమస్యలను అర్థమయ్యే టట్లు విశాఖ సభ సాక్షిగా వివరించినట్లయితే తెలుగు ప్రజలు హర్షించే వారన్నారు. కానీ ఆ రకంగా సిఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడకపోవడం ఆంధ్ర ప్రజలను మోసం చేయడం తప్ప మరొకటి కాదన్నారు. ఇప్పటికైనా సిఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వం పట్ల బానిసత్వం మాని మన ఎంపిలతో రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బిజెపి నాయకులు రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా విస్మరిస్తూ రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా గెలవాలనే యావతో ఎన్నికల పొత్తుల హడావుడి తప్ప ఆపార్టీకి మరొకటి లేదన్నారు. రాష్ట్రంలో ప్రత్యేక హౌదా, విభజన హామీలు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ,ఇతర అంశాల గురించి వామపక్షాలు తప్ప ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం, జనసేన, బిజెపి ప్రధాని నరేంద్ర మోడీ వైఖరిపై ఎక్కడా కూడా మాట్లాడిన దాఖలాలు లేవన్నారు. ఇప్పటికయినా బిజెపి మోసకారి తనం, ప్రధాని మోడీ వ్యవహరిస్తున్న తీరును రాష్ట్ర ప్రజలు గమనించాలని కోరారు. ఈ కార్యక్రమంలోడివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి.కష్ణ, ఎన్.నాగేశ్వరరావు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎమ్.సోమేశ్వరరావు, సిహెచ్ వెంకటేశ్వరరావు, సిటీ నాయకులు రాము, నోహిత్ కష్ణ,సుభాని పాల్గొన్నారు.










