Sep 09,2021 06:36

రైతాంగ ఉద్యమం పట్ల మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి రోజురోజుకి దుర్మార్గంగా మారుతోంది. హర్యానాలోని కర్నాల్‌లో సంయుక్త కిసాన్‌మోర్చా పిలుపుమేరకు మహాపంచాయత్‌కు తరలివచ్చిన రైతాంగాన్ని అడ్డుకోవడానికి, సభను విఫలం చేయడానికి చేసిన ప్రయత్నాలే దీనికి నిదర్శనం. తరలివస్తున్న వారిని అడ్డుకోవడమే లక్ష్యంగా ఇనుప కంచెలు ఏర్పాటు చేయడంతో పాటు, వాటర్‌ కేనన్లతో పోలీసులు విరుచుకుపడినా లక్షలాదిమంది సభాస్థలికి చేరుకోవడం, శాంతియుతంగా కార్యక్రమాన్ని ముగించుకోవడం రైతుల మొక్కవోని పట్టుదలను చాటిచెప్పింది. గత నెల 28న కర్నాల్‌లోని బస్తారా టోల్‌ప్లాజా వద్ద రైతులపై పోలీసులను తలలు పగలకొట్టండంటూ ఉసిగొల్పిన సబ్‌ డివిజనల్‌ మెజిస్ట్రేట్‌ ఆయూష్‌ సిన్హాపై చర్యలు తీసుకోవాలని, పోలీస్‌ దాడిలో మృతి చెందిన రైతు కుటుంబానికి 25 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలన్న డిమాండ్లను పట్టించుకోకపోగా తాజా సభను అడ్డుకోవడానికి చేసిన విఫలయత్నం బిజెపి సర్కారు బరితెగింపును చాటుతోంది. కార్పొరేట్లకు అనుకూలంగా రూపొందించిన వ్యవసాయ చట్టాల రద్దుతోపాటు, సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీ సరిహద్దుల్లో రైతాంగం చేపట్టిన ఆందోళన తొమ్మిది నెలల నుండి నిరవధికంగా కొనసాగుతోంది. ఒకటి, రెండు రాష్ట్రాలకే పరిమితమైందంటూ ప్రారంభంలో కమలదళం పేలిన అవాకులు, చవాకులు అవాస్తవాలని ఆచరణలో తేలిపోయాయి. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్న రైతాంగమే కాదు, వివిధ తరగతులకు చెందిన ప్రజానీకం ఈ పోరాటానికి మద్దతు తెలుపుతున్నారు. ప్రతిరోజూ వివిధ రాష్ట్రాల నుండి వేలాది మంది ఉద్యమ కేంద్రాలను సందర్శిస్తున్నారు. కార్మికులు రైతులకు అండగా నిలిచి, ఎక్కడికక్కడ కదులుతున్నారు. వివిధ ప్రాంతాల్లో కార్మికులు చేసే పోరాటాలకు రైతులు మద్దతు తెలుపుతున్నారు. కిసాన్‌ -మజ్దూర్‌ ఐక్యత వర్థిల్లాలన్న నినాదం దేశ వ్యాప్తంగా మారుమ్రోగుతోంది. వ్యవసాయ రంగ కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా ప్రారంభమైన రైతాంగ ఉద్యమం క్రమేణా నయా ఉదారవాద విధానాలపై పోరుగా మారింది. మన రాష్ట్రంలోనూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటంలో ఇటువంటి దృశ్యాలనే చూస్తున్నాం.

స్వతంత్ర భారత చరిత్రలో ఇటువంటి దృశ్యం అపూర్వం. ప్రపంచ చరిత్రలోనే ప్రభుత్వ నిర్బంధాలను ఎదుర్కుంటూ ఇంత సుదీర్ఘకాలం శాంతియుతంగా సాగిన పోరాటం మరొకటి లేదు. రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ప్రారంభమైన ఈ పోరాటం కార్పొరేట్ల కొమ్ముకాయడమే లక్ష్యంగా పెట్టుకున్న మోడీ ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి భంగపాటుకు రైతాంగ ఉద్యమం కూడా ఒక కారణం. త్వరలో జరగనున్న ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లోనూ తమ సత్తా చూపడానికి రైతులు సంఘటితమవుతున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో జరిగిన మహాపంచాయత్‌కు లక్షలాదిమంది రైతులు తరలిరావడమే కమలనాథులకు కలవరం కలిగిస్తుండగా, ఆ వెంటనే నిర్వహించిన కర్నాల్‌ మహాపంచాయత్‌ అనేక అడ్డంకులను అధిగమించి విజయవంతం కావడం వారికి మింగుడుపడని విషయమే! ఈ నేపథ్యంలోనే రైతాంగ ఉద్యమంపై అణచివేత చర్యలకు మోడీ ప్రభుత్వం తెగపడుతోంది. ఈ చర్యలను ప్రతిఘటించి, రైతాంగానికి అండగా నిలవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.

రాష్ట్రాల పరిధిలో ఉన్న వ్యవసాయ రంగం మీద కేంద్రం ఏకపక్షంగా, కనీసం ముందుగా రాష్ట్రాలను కానీ, రైతు సంఘాలను కాని సంప్రదించకుండా ఈ నల్లచట్టాలను రూపొందించింది. అందుచేత, ఈ చట్టాలు రాష్ట్రాల హక్కుల మీద మోడీ ప్రభుత్వం సాగించిన మరో దాడిగా పరిగణించాలి. అందుకే, పంజాబ్‌, కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాలు ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానాలు చేశాయి. మన రాష్ట్రం నుండి ఎన్నికైన వైఎస్‌ఆర్‌సిపి, టిడిపి ఎంపిలంతా ఈ చట్టాలకు అనుకూలంగా ఆనాడు ఓటు వేశారు. కానీ, ఆ తరువాత రైతాంగ బంద్‌కు మద్దతు ప్రకటించారు. అది కాస్త నయం. ఐతే, పెల్లుబుకుతున్న తీవ్ర వ్యతిరేకత దృష్ట్యా ఇప్పటికైనా మన రాష్ట్ర అసెంబ్లీ ఈ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేసి, ఉద్యమానికి సంఘీభావం ప్రకటించాలి. ఇప్పుడు కూడా మౌనంగా ఉంటే అది రైతుల పట్ల ద్రోహమే అవుతుంది.