ప్రజాశక్తి-పాడేరు: కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రాజ్యాంగ హక్కుల్ని హరిస్తోందని, దీన్ని గద్దె దించితేనే దేశానికి రక్షణ కలుగుతుందని సిపిఎం అల్లూరి జిల్లా కార్యదర్శి పి.అప్పలనర్స తెలిపారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను చాటి చెప్పేందుకు గ్రామస్థాయిలో సిపిఎం చేపట్టిన దేశ రక్షణ భేరి కార్యక్రమంలో భాగంగా బుధవారం పాడేరులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. బిజెపి పాలనలో మంచి రోజులు వస్తాయని చెప్పిన ప్రధాని మోడీ ఈ ఎనిమిది ఏళ్లలో ప్రజల జీవన పరిస్థితులు పూర్తిగా దిగజారాయని పేర్కొన్నారు. మంచి రోజుల పోయి చెడ్డ రోజులు దాపురించాయని విమర్శించారు. దేశ ప్రజలపై పన్నుల, ధరల భారాలను జిఎస్‌టి పేరుతో మోడీ మోపారని దుయ్యబట్టారు. ఎల్‌ఐసి, రైల్వే, బిఎస్‌ఎన్‌ఎల్, బ్యాంకులు వంటి 290 రకాల ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరించేందుకు బిజెపి పూనుకుందన్నారు. ప్రభుత్వ ఆస్తుల్ని రక్షించాల్సిన కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ విధానాలతో విమానాశ్రయాలు, విద్యుత్, టెలికాం, విశాఖ ఉక్కు వంటి విలువైన సంస్థల్ని అంబానీ, ఆదానిలకు దారాదత్తం చేస్తుందని విమర్శించారు. అడవులను, అటవీ సంపదను ప్రైవేట్ సంస్థల పరం చేస్తున్నారన్నారు. దేశంలో పలు బ్యాంకుల నుంచి 14 లక్షల కోట్లు అప్పులు చేసి ఎగ్గొట్టి దేశం వదిలి పారిపోయిన వ్యక్తులకు బిజెపి సర్కార్ కొమ్ము కాస్తోందని విమర్శించారు. పంజాబ్ నేషన్ బ్యాంకులో రూ.52 కోట్లు అప్పుచేసి ఎగ్గొట్టిన మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు బిజెపి నీడనిచ్చి కొమ్ముకాతస్తోందని విమర్శించారు. దోపిడీదారులకు రుణమాఫీ, సబ్సిడీలు ఇస్తుందని తెలిపారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజల్లో అశాంతి పెరిగిందని, దళితులు, గిరిజనులపై అత్యాచారాలు పెరిగిపోయాయన్నారు. మతవిద్వేషాల చిచ్చు రేపి ప్రజల మధ్య వైశమ్యాలు పెంచుతుందన్నారు. బిజెపిని ఓడించి మోడీ కబంధహస్తాల నుంచి దేశాన్ని రక్షించడమే ప్రజల ధ్యేయం కావాలని పిలుపునిచ్చారు.వైసీపీ ఎంపీలు పార్లమెంట్లో రాష్రంల్టో సమస్యలపై కేంద్ర ప్రభుత్వంతో పోరాడిందే లేదన్నారు. ప్రభుత్వ పథకాల్లో రక రకాలుగా కోతలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయని విమర్శించారు. విశాఖలో ఉక్కు పరిశ్రమను వదిలేసి రాజధాని పేరుతో వైసిపి జపం చేస్తోందని, పంచాయతీలకు నిధుల్ని ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించిందని విమర్శించారు.
సిపిఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు శంకర్రావు మాట్లాడుతూ, దేశ సంపదను సంపన్నులకు బిజెపి కట్టబెడుతుందన్నారు. ఒక్కొక్కటీ ప్రైవేట్ పరం చేస్తూ దేశ సంపతిని నాశనం చేస్తోందని విమర్శించారు. గిరిజన ప్రాంతాల్లోని ఖనిజాలను ప్రైవేటుపరం చేసేందుకు కేంద్రం పూనుకుటుందన్నారు. సిపిఎం మండల కార్యదర్శి ఎల్.సుందర్రావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో పాడేరు, జి.మాడుగుల, హుకుంపేట మండలాల పార్టీ కమిటీ సభ్యులు పాలికి లక్కు, చిట్టి బాబు, నరసయ్య, ధర్మన్న పడాల్, దీనబంధు పాల్గొన్నారు.
దేశ రక్షణ బేరి సభలో ముందుగా భగత్ సింగ్ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి సిపిఎం జిల్లా కార్యదర్శి పి.అప్పలనర్స పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే పాడేరు, జి.మాడుగుల సిపిఎం మండలాల కమిటీ నాయకులు ఎల్.సుందర్రావు, పాలికి లక్కు, నరసయ్య, ప్రభుదాస్, చిట్టిబాబు, ధర్మన్న పడాల్, దీనబంధులు నివాళులర్పించారు.










