ప్రధాని మోడీ విశాఖ పర్యటనను నిరసిస్తూ శనివారం రెండవ రోజున కూడా పలుచోట్ల నిరసనలు వెల్లువెత్తాయి. విశాఖ స్టీల్‌ప్లాంట్‌తోపాటు పలు ప్రభుత్వరంగసంస్థలనుప్రైవేటీకరించడంతోపాటు ప్రత్యేక హోదా, విశాఖ రైల్వేజోన్, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ నిధులు వంటి విభజన హామీల అమలులో మొండిచేయి చూపిన ప్రధాని ఏ మొహం పెట్టుకుని వచ్చారని ప్రశ్నిస్తూ, 'మోడీ గోబ్యాక్' అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. మోడీ చేస్తున్న శంకుస్థాపనలన్నీ అమరావతి అభివృద్ధిలా అర్థాంతరంగా మిగిలిపోతాయని ఎద్దేవా చేశారు.- ప్రజాశక్తి విలేకర్ల యంత్రాంగం
రాంబిల్లి : మోడీ విశాఖ పర్యటనను వ్యతిరేకిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి. కోటేశ్వరరావు మాట్లాడుతూ, విభజన ఆంధ్రకు ప్రత్యేకహోదా, అమరావతి రాజధాని, పోలవరం నిర్మాణానికి నిధులు, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేకప్యాకేజీ, విశాఖ రైల్వేజోన్ ఇలా ఇచ్చినహామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయని ప్రధాని మోడీ ఏం మొహం పెట్టుకుని ఆంధ్రాపర్యటనకు వచ్చారో చెప్పాలని మండిపడ్డారు. రాష్ట్రవిభజనతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఆంధ్రాను ఆదుకోవాల్సిందిపోయి, ఆంధ్రుల హక్కుగా ఉన్న విశాఖ ఉక్కును ప్రైవేటుకు అమ్మేయాలని నిర్ణయించిన మోడీ, ఎపికి ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఆంధ్రాకు కేంద్రం ఇంతగా అన్యాయం చేస్తున్నా, రాష్ట్రంలోని అధికార వైసిపితోపాటు ప్రధాన ప్రతిపక్షం టిడిపి, మిత్రపక్షం జనసేన నోరు మెదపకపోగా, రెడ్‌కార్పెట్ స్వాగతం పలకడం రాష్ట్ర ప్రజలను అవమానించడమేనని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు జి దేముడు నాయుడు, సిహెచ్ గంగరాజు, సిహెచ్ పవన్‌కుమార్, బద్ది భాస్కరరావు, బంగారురాజు, నూకరత్నం, లక్ష్మి పాల్గొన్నారు.
కె.కోటపాడు : విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను అమ్మేస్తూ, విభజన హామీలకు ఎగనామం పెట్టిన ప్రధానిమోడీ విశాఖ పర్యటనకు రావడం సిగ్గుచేటని సిపిఎం నేతలు మండిపడ్డారు. మండలంలోని సూరెడ్డిపాలెం మెయిన్‌రోడ్డులో మోడీ రాకను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. సిపిఎం నేతలు ఎర్ర దేవుడు, వనం సూర్యనారాయణ మాట్లాడుతూ, మోడీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం ప్రతీ చర్య వల్ల ఎపికి అన్యాయం, నష్టం జరిగిందే తప్ప, ఎటువంటి ప్రయోజనం లేదన్నారు. అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసిన మోడీ దాన్ని పూర్తి చేయకుండా మధ్యలోనే వదిలేశారని, ఇపుడు విశాఖకు వచ్చి ఏం ఒరగబెడతారని ప్రశ్నించారు. కార్యక్రమంలో వెలగల వెంకటరావు, కర్రి జానకిరామ్, పోతల శ్రీరామ్ పాల్గొన్నారు.
అనకాపల్లి : విభజన హామీలను అటకెక్కించిన ప్రధాని మోడీ ఐదు కోట్ల ఆంధ్రులను మోసగించారని, దీనిపై ప్రశ్నించాలని ప్రయత్నిస్తే నిర్బంధాలు, అక్రమ అరెస్ట్‌లతో అడ్డుకోవడం దుర్మార్గమని ఎఐటియుసి జిల్లా కన్వీనర్ వైఎన్.భద్రం, రాష్ట్ర సమితి సభ్యులు కోన లక్ష్మణ, శ్రీరామదాసు అబ్బులు మండిపడ్డారు. మోడీ ప్రభుత్వ విధానాలు, ప్రధాని పర్యటన సందర్భంగా వామపక్షనేతల అక్రమ అరెస్ట్‌లను ఖండిస్తూ నిరసన ఎఐటియుసి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఎనిమిదేళ్ల మోడీ పాలనలో కార్పొరేట్లకు రూ.పదిలక్షల కోట్ల రాయితీలిచ్చి, సామాన్య ప్రజలపై పెట్రో ఉత్పత్తులు, వంటగ్యాస్, నిత్యావసరాల ధరల మోతతో కుదేలు చేశారని దుయ్యబట్టారు. కార్యక్రమంలో వీరాచారి, కెవి రమణ, శ్రీకాంత్, జానీ, అప్పారావు, సత్యారావు, చెల్లూరి నాగరాజు, కోరిబిల్లి శంకర్రావు, ఆడారి అప్పారావు పాల్గొన్నారు.










