ప్రజాశక్తి-యంత్రాంగం
ఉక్కునగరం : ప్రధాని మోడీ విశాఖ పర్యటన సందర్భంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పిలుపునిచ్చిన నిరసన కార్యక్రమాలకు కార్మికులు, వారి కుటుంబ సభ్యులు భారీ ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పోరాట కమిటీ నాయకులు పిలుపునిచ్చారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన కూర్మన్నపాలెంలోని స్టీల్‌ప్లాంట్ ఆర్చి వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారం నాటికి 634వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలో స్టీల్‌ప్లాంట్ సింటర్‌ప్లాంట్ విభాగం కార్మికులు కూర్చున్నారు. ఈ దీక్షలనుద్దేశించి పోరాట కమిటీ నాయకులు డి.ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్, గంధం వెంకటరావు, జె.అయోధ్యరాం, వరసాల శ్రీనివాసరావు, డి.సంపూర్ణం మాట్లాడుతూ, ఈ నెల 11వ తేదీన ఉద్యోగులంతా మాస్ క్యాజువల్ లీవ్ పెట్టాలని తీర్మానించినట్లు వెల్లడించారు. దీక్షా శిబిరం నుంచి చేపట్టేని ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 11వ తేదీ దీక్షా శిబిరంలో ఉక్కు కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, వివిధ మహిళా సంఘాలు దీక్షా శిబిరంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. 12వ తేదీ దీక్షా శిబిరం యథావిధిగా కొనసాగుతుందని, కార్మికులందరూ పాల్గొనాలని కోరారు. స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరించబోమని ప్రధానమంత్రి విశాఖలో ప్రకటన చేయాలని, ఈ మేరకు బిజెపితో సహా అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని, ప్రధానికి ఉత్తరాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
కలెక్టరేట్ : వైజాగ్ స్టీల్‌ప్లాంట్, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద విశాఖ అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల జెఎసి ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు సోమవారానికి 585వ రోజుకు చేరాయి. దీక్షల్లో పాల్గొన్న వారిని ఉద్దేశించి హెచ్‌ఎంఎస్ స్టీల్‌ప్లాంట్ యూనియన్ ప్రధాన కార్యదర్శి దొమ్మేటి అప్పారావు మాట్లాడారు. స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలన్నారు. ప్రభుత్వ రంగంలోనే ప్లాంట్‌ను కొనసాగించాలన్నారు. దీక్షల్లో యూనియన్ నాయకులు డి.ఈశ్వరరావు, జి.సత్యారావు, బొడ్డు రమణ, జి.అప్పలరాజు, మురళి, నాగేశ్వరరావు, జి.ఈశ్వరరావు పాల్గొన్నారు.










