Nov 03,2022 00:12

మీడియా సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 11, 12 తేదీలలో విశాఖ పర్యటన సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించేందుకు వైసిపి జిల్లా అధ్యక్షులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఉత్తరాంధ్ర రీజనల్‌ కో-ఆర్డినేటర్‌ వైవి.సుబ్బారెడ్డి ఆధ్వర్యాన ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం ప్రభుత్వ అతిథి గృహంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 11వ తేదీ సాయంత్రం మోడీ విశాఖపట్నం చేరుకుని నావెల్‌ బేస్‌లో బస చేస్తారని తెలిపారు. 12వ తేదీన విశాఖలో పలు శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. అనంతరం ఆంధ్ర యూనివర్సిటీ ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారని తెలిపారు. ఈ సభకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డితో పాటు జాతీయ, రాష్ట్ర నాయకులు పలువురు హాజరవుతారని చెప్పారు. మూడు హెలికాప్టర్లు ఒకేసారి ల్యాండ్‌ అయ్యేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఎస్‌పిజి అనుమతితో విద్యార్థులు అభివాదం, సాంస్కృతిక కార్యక్రమాలకు నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రధానమంత్రి పర్యటన షెడ్యూల్‌ పిఎంఒ నుంచి ఇంకా అందాల్సి ఉందన్నారు. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమం అని, రాజకీయాలకతీతంగా అన్ని పార్టీలూ సహకరించి రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహాయాన్ని స్వాగతించాలని కోరారు. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానంగా విశాఖ రాజధాని అవుతుందని, దాన్ని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణను తాము మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. భోగాపురం ఎయిర్‌పోర్టుకు సంబంధించి కోర్టులో కేసు ఉన్నందున స్పష్టత ఇవ్వలేమని తెలిపారు. ఇతర పార్టీల నాయకులను, అధినేతలను పిలిచే విషయంపై మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆహ్వానాలు, ప్రసంగాలు అన్నీ ఎస్‌పిజి, పిఎంఒ ఆధ్వర్యాన జరుగుతాయని తెలిపారు