ప్రజాశక్తి-చెరుకుపల్లి: ప్రజా కంటక విధానాలు అనుసరిస్తూ, ప్రజల మధ్య మతాలు కులాల పేరుతో చిచ్చు పెడుతూ ప్రభుత్వ ఖజానాను కొల్లగొడుతున్న అధికార బిజెపిని సాగనంపాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు సిహెచ్ మణిలాల్ పిలుపునిచ్చారు. ప్రజా వ్యతిరేక నిరంకుశ మతోన్మాద బిజెపికి వ్యతిరేకంగా ఉభయ కమ్యూనిస్టు పార్టీలు నిర్వహిస్తున్న ప్రచారభేరి కార్యక్రమాన్ని శనివారం చెరుకుపల్లిలో నిర్వహించారు. స్థానిక తహశీల్దారు కార్యాలయం వద్ద నుంచి గుల్లపల్లి కోటి సెంటర్ వరకు నిర్వహించిన ర్యాలీలో ఐలాండ్ సెంటర్లో నిర్వహించిన బహిరంగ సభలో సిపిఐ నాయకులు జి బాలాజీ మాట్లాడుతూ కార్మిక కర్షక నిరంకుశ విధానాలను తిప్పికొట్టాలని పాలక బిజెపి పార్టీని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అధికార పార్టీ నిరంకుశ విధానాలను వివరిస్తూ ప్రజలకు కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి కే శరత్, సిపిఎం, సిపిఐ నాయకులు విష్ణు నారాయణ, సాంబయ్య, పోలేరయ్య, వెంకటేశ్వర్లు, ఆదెమ్మ తదితరులు పాల్గొన్నారు.
కొల్లూరు: మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సాగుతున్న ప్రచారభేరి శనివారం కొల్లూరులో జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం బాపట్ల జిల్లా కమిటీ సభ్యులు సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక నిరంకుశ, మతోన్మాద బిజెపిని సాగనంపుదాం, దేశాన్ని కాపాడుదాం అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బిజెపి అధికారంలోకి వస్తే నిత్యావసర ధరలు తగ్గిస్తామని, నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తామని, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చారు. వచ్చిన వెంటనే ఏ ఒక్కటీ నెరవేర్చక పోగా 9 సంవత్సరాల పాలనలో అవినీతి తారస్థాయికి పెరిగిపోయిందని అన్నారు. లౌకిక దేశమైన భారతదేశంలో మోడీ కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో తోడేటి సురేష్, బోనిగల సుబ్బారావు, వేములపల్లి వెంకటరామయ్య, కృపానందం పాల్గొన్నారు.
భట్టిప్రోలు: దేశంలో బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సాగుతున్న ప్రచార యాత్ర శనివారం చుండూరు మండలం చినగదేలవర్రు గ్రామంలో కొనసాగింది. సిపిఎం జిల్లా నాయకులు టి కృష్ణమోహన్, వేమూరు మండల నాయకులు బి అగస్టీన్ ఆధ్వర్యంలో ఇంటింటికీ కరపత్రాలు పంపిణీ చేశారు. మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపితే తప్ప సామాన్య, మధ్య తరగతి ప్రజలు సుఖంగా జీవించలేరని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కర్రీ వెంకటరెడ్డి, శ్రీనివాసరెడ్డి, శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.










