ప్రజాశక్తి-భట్టిప్రోలు: దేశంలో ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బిజెపి ప్రభుత్వాన్ని, నరేంద్రమోదీని గద్దె దింపాలని సిపిఐ బాపట్ల జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ పిలుపునిచ్చారు. మండల కేంద్రం భట్టిప్రోలులో బుధవారం ప్రచారభేరి జరిగింది. మోడీ పాలనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక రథం సెంటర్లో జరిగిన కార్యక్రమంలో సింగరకొండ మాట్లాడుతూ మోడీ పాలనలో పేద, మధ్య తరగతి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుండగా బ్యాంకుల నుంచి లక్షల కోట్లు రుణాలు తీసుకొని ఎగ్గొట్టిన అదానీ, అంబానీలకు ప్రభుత్వ ఆస్తులు కట్టబెడుతున్నారని ఆరోపించారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు టి కృష్ణమోహన్ మాట్లాడుతూ మోడీ విధానాల నుంచి దేశాన్ని కాపాడుకునేందుకు రాష్ట్రంలో ఈ నెల 14 నుంచి 30వ తేదీ వరకు జరిగే ప్రచార యాత్రను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు జి బాలాజీ, సిపిఎం నాయకులు సిహెచ్ మణిలాల్, జి సుధాకర్, ఎం సత్యనారాయణ, నాగమల్లేశ్వరరావు, బి సుబ్బారావు, వి వెంకట్రామయ్య, అహరోను, దీపాల సత్యనారాయణ, జి నాగరాజు తదితరులు ఉన్నారు.










