May 05,2023 00:29

ఎర్రజెండాలు చేతబట్టి ప్రదర్శనలో పాల్గొన్న నిర్వాసితులు, ప్రజలు, అగ్రభాగాన బృందాకరత్‌, తదితరులు

న కేంద్రాన్ని ప్రశ్నించని వైసిపి, టిడిపి, జనసేన
న పోలవరం నిర్వాసితులకు పరిహారం చెల్లింపులో మోసపూరితం
న ఎర్ర జెండా నీడన పోరాటాలకు సిద్ధం కావాలి
న ప్రచార భేరి బహిరంగ సభలో సిపిఎం, సిపిఐ నాయకులు
ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి, చింతూరు
దేశ సందను కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తూ, ప్రజలపై భారాలు మోపుతూ, మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొడుతూ దేశ సమైక్యతకే ముంపు తెస్తున్న మోడీ ప్రభుత్వానికి చరమ గీతం పాడేందుకే ప్రచార భేరి చేపట్టామని సిపిఎం, సిపిఐ నాయకులు పునరుద్ఘాటించారు. కేంద్ర బిజెపి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సిపిఐ, సిపిఎం కేంద్ర కమిటీ పిలుపు మేరకు ఏప్రిల్‌ 14 నుంచి 30 వరకు నిర్వహించిన ప్రచార భేరి ముగింపు సందర్భంగా గురువారం చింతూరులో భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం సిపిఎం రంపచోడవరం జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్‌ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు బృందాకరత్‌ మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న అటవీ హక్కుల చట్టానికి మోడీ ప్రభుత్వం తూట్టు పొడుస్తుందని చెప్పారు. బిజెపి ప్రభుత్వం బడా పెట్టుబడిదారులకు ప్రయోజనాన్ని కలిగించే విధానాలను అనుసరిస్తుందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం చెల్లింపులో మోసపూరితంగా వ్యవహరిస్తుందని విమర్శించారు.
సిపిఐ కేంద్ర కార్యవర్గ సభ్యుడు రావుల వెంకయ్య మాట్లాడుతూ 32 మంది బలిదానంతో సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను నేడు కేంద్ర ప్రభుత్వం కారుచౌకగా బడా పెట్టుబడిదారులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తుందన్నారు. ఈ విధానాలపై మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని దుస్థితిలో అధికార వైసిపి, ప్రతిపక్ష టీడీపీ, జనసేన ఉన్నాయని పేర్కొన్నాను. పోరాటాలతోనే హక్కులు సాధ్యమని, రాబోయే రోజుల్లో చేపట్టబోయే ప్రజా పోరాటాలలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం మాట్లాడుతూ పోలవరం నిర్వాసితుల సమస్యలపై కేంద్రాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత జగన్‌ ప్రభుత్వానికి లేదా అని నిలదీశారు. టిడిపి, వైసిపి పేర్లు, నాయకులు మాత్రమే వేరని, ఆ రెండు పార్టీల విధానాలు ఒక్కటేనని తెలిపారు. అందువల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై పెట్టిన దృష్టి ప్రజలకు పునరావాసం, పరిహారం చెల్లింపుపై రెండు పార్టీలు పెట్టలేదని విమర్శించారు. దశాబ్దాల కాలంగా సిపిఎం ప్రజల పక్షాన నిర్వహించిన పోరాటాలను గుర్తు చేశారు. మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య అందించిన సేవలను కొనియాడారు. ప్రస్తుత వైసిపి శాసనసభ్యులు కనీసం వరదల్లో ఇబ్బందులు పడిన బాధితులను పలకరించడానికి కూడా రావడం లేదని తెలిపారు. దేశానికి, రాష్ట్రానికి వామపక్షాలే ప్రత్యామ్నాయమని, ప్రజా పోరాటలతో ప్రత్యామ్నాయ సాధనకు కలిసి రావాలని పిలుపునిచ్చారు.
సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్రంలోని వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం మినహా, బిజెపిని ప్రశ్నించే ధైర్యం చేయడం లేదని ఎద్దేవా చేశారు. 25 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచుతానని చెప్పిన వైయస్‌ జగన్‌ గడిచిన నాలుగేళ్లలో సాధించింది ఏమిటని ప్రశ్నించారు. బిజెపిని ఎదిరించే ధైర్యం ఎర్రజెండాకు మాత్రమే ఉందని, ఆ ఎర్రజెండా నీడన పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎపి రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి పి.జమలయ్య. ప్రజానాట్యమండలి రాష్ట్ర నాయకులు ఆర్‌.పిచ్చయ్య, విఆర్‌ పురం ఎంపీపీ కారం లక్ష్మి, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కందుకూరి స్వర్ణ, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మర్లపాటి నాగేశ్వరరావు, కుంజ సీతారామయ్య, లోతా రామారావు, మట్ల వాణిశ్రీ, నాయకులు పూనెం సత్యనారాయణ, సోయం చినబాబు, సీసం సురేష్‌, ఎర్రంశెట్టి శ్రీనివాసరావు, పల్లపు వెంకట్‌, మొత్తం రాజయ్య, ఎంపీటీసీ వి.రాజకుమార్‌, పద్మ, పి.లక్ష్మణ్‌, పండుం సుబ్బారావు, దేవుడు, భారతి, తదితరులు పాల్గొన్నారు.

ఎరుపెక్కిన మన్యం
ప్రజాశక్తి-చింతూరు, విఆర్‌.పురం
చింతూరు మన్యం ఎరుపెక్కింది. వేలాదిగా తరలివచ్చిన నిర్వాసితులు, ప్రజలతో పాత ప్రభుత్వాసుపత్రి ఆవరణ కిటకిటలాడింది. కేంద్ర బిజెపి ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ సిపిఎం, సిపిఐ కేంద్ర కమిటీల పిలుపు మేరకు నిర్వహించిన ప్రచార భేరి ముగింపు సందర్భంగా గురువారం చింతూరులో భారీ ప్రదర్శన, వేలాది మందితో బహిరంగ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి చింతూరు, విఆర్‌.పురం, కూనవరం ఎటపాక మండలాల నుంచి భారీ సంఖ్యలో నిర్వాసితులు, ప్రజలు తరలివచ్చారు. చింతూరులోని సంతపాక వద్ద మధ్యాహ్నం 3.30 గంటలకు ర్యాలీ ప్రారంభమైనది. వేలాది మందితో సాగిన మహా ప్రదర్శనలో గిరిజన సంప్రదాయ కొమ్ముడోలు నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు బృందాకరత్‌, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం, వి.వెంకటేశ్వర్లు, రంపచోడవరం జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్‌ తదితరులు ప్రదర్శనకు అగ్రభాగాన నడిచారు. సంతపాకల నుండి చింతూరు పాత ప్రభుత్వ ఆసుపత్రి వరకు ప్రధాన రహదారి మీదుగా సాగిన ఈ ప్రదర్శనతో చింతూరు ఎర్రజెండాలతో రెపరెపలాడింది. కార్యక్రమం నేపథ్యంలో ప్రధాన వీధులు ఎర్ర తోరణాలతో ప్రత్యేకంగా అలంకరించారు. వేలాది మంది నిర్వాసితులు ఎర్రజెండాలతో నిర్వహించిన ప్రదర్శన అబ్బురపరిచింది. ప్రదర్శనలో భాగంగా చింతూరు సెంటర్లోని మన్యం వీరులు అల్లూరి సీతారామరాజు, గాం గంటం దొర, మల్లు దొర, కొమరం భీమ్‌, గిరిజన అమరవీరులకు బృందాకరత్‌ పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బహిరంగ సభ జరిగింది. ప్రజానాట్యమండలి కళాకారులు ఆలపించిన గీతాలు అలరించాయి.