ప్రజాశక్తి- కూనవరం
కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని సిపిఎం మండల కార్యదర్శి పాయం సీతారామయ్య, జిల్లా కమిటీ సభ్యులు మేకల నాగేశ్వరరావు, వైస్ ఎంపిపి కొమరం పెంటయ్య పిలుపునిచ్చారు. సిపిఎం, సిపిఐ కేంద్ర కమిటీల పిలుపు మేరకు రాజకీయ ప్రచార భేరిలో భాగంగా మండలంలోని కుటూరు, ముల్లూరు గ్రామాలలో సిపిఎం నాయకులు ఆదివారం సందర్శించారు. అక్కడి ప్రజలతో వారు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయకుండా మోసం చేసిందని తెలిపారు. పోలవరం ముంపు బాధితులకు ప్యాకేజీ ఇవ్వకుండా అంకెల గారడీ చేస్తుందని విమర్శించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేస్తూ, ఓడరేవు, విమానాశ్రాయాలు, ఎల్‌ఐసి, బ్యాంకింగ్, రోడ్లు, భూములు, అడవులను బడాబాబులైన అదాని, అంబానీలకు కట్టాబెడుతుందని తెలిపారు. గిరిజన చట్టం అమలు చేయాలని, పోలవరం నిర్వసితులకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొగ్గా వెంకమ్మ, పాయం శేఖర్, సోడే శ్రీరాములు, రాజయ్య, రాజు, ప్రభాకర్, లక్ష్మణ్ పాల్గొన్నారు.
గ్రామాల్లో ప్రచార భేేరి
పెదబయలురూరల్ : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని గద్దెదించాలని మండలంలోని రూడకోట, కొరవంగి, అడుగులపుట్టు, లక్ష్మిపెట, కిముడుపల్లి, సీకరి, సీతగుంట, బొండాపల్లి, గలగండ, గంపరాయిలో సిపిఎం నేతలు ప్రచార భేరిని చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, మోడీ ప్రభుత్వం అటవీ సంరక్షణ చట్టాన్ని సవరిస్తుందన్నారు. గిరిజనులకు రాజ్యాంగంలోని హక్కులను, చట్టాలను దుర్వినియోగం చేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బోండా సన్నిబాబు, గంగాధరం, శరబన్న, బుజ్జిబాబు, ప్రజా నాట్యమండలి సభ్యులు లోకేష్, సంతోష్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
మూడో రోజు కొనసాగిన సిపిఐ పాదయాత్ర
కొయ్యూరు : ప్రచార భేరిలో భాగంగా సిపిఐ కొయ్యూరు మండల కమిటీ ఆధ్వర్యాన చేపట్టిన పాదయాత్ర మూడో రోజు ఆదివారం కూడా కొనసాగింది. ఇందులో భాగంగా కొమ్మిక పంచాయతీ డేగల పాలెం గ్రామం నుండి కంటారం, బాలారం, బకలూరు పంచాయతీల్లో పాదయాత్ర సాగింది. గ్రామ గ్రామాన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. బి.కొత్తూరు గ్రామంలో రాత్రి బస చేశారు.










