మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలి
ప్రజాశక్తి-విఆర్ పురం
మోడీ నాయకత్వంలో కేంద్ర బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలందరూ ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని సిపిఎం మండల కార్యదర్శి సోయం చిన్నబాబు పిలుపునిచ్చారు. మండలంలోని రేఖపల్లి సిపిఎం కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం పచ్చి మతోన్మాద విధానాలతో కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తోందని విమర్శించారు. మేక్ ఇన్ ఇండియా అంటూనే ప్రభుత్వ రంగ పరిశ్రమలు, సంస్థలను ప్రైవేటుపరం చేస్తుందని, ప్రజల సంపదైన బిఎస్‌ఎన్‌ఎల్, ఓడరేవులు, విశాఖ స్టీల్‌ప్లాంట్, ఎల్‌ఐసిని దేశ, విదేశీ కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతుందని తెలిపారు. ఒకే దేశం, ఒకే పన్ను పేరుతో తీసుకొచ్చిన జిఎస్‌టి తీసుకొచ్చి ప్రజలపై మరిన్ని భారాలు మోపుతుందన్నారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెంచి ప్రజలు నడ్డి విరుస్తుందని చెప్పారు. మరో వైపు తన మతోన్మాద విధానాలతో ప్రజల ఐక్యతను విచ్ఛిన్నం చేస్తుందన్నారు. గిరిజన చట్టాలను సవరిస్తూ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఖనిజ సంపదను కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేసే ప్రయత్నం చేస్తుందని, దానికి అనుగుణంగా కార్పొరేట్ ఫారెస్ట్ విధానాన్ని ముందుకు తీసుకొస్తుందని తెలిపారు. బిజెపికి ప్రజలందరూ ఐక్యంగా బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. ఆదివాసీలను బలహీనపర్చడానికే రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం 52 జీవో ద్వారా బోయ, వాల్మీకి, బెంతు ఒరియాలను ఎస్‌టి జాబితాలో కలపాలని చూస్తందని దుయ్యబడ్డారు. ఈ సమావేశంలో సిపిఎం మండల నాయకులు పంకు సత్తిబాబు, సత్యనారాయణ, కార్యకర్తలు పాల్గొన్నారు.










