
ప్రజాశక్తి-గుంటూరు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై ఈనెల 15న విజయవాడలో సిపియం తలపెట్టిన ప్రజారక్షణ భేరి బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ పార్టీ నగర కమిటీ చేపట్టిన ప్రచార కార్యక్రమం నగరంలో కొనసాగుతోంది. ఆదివారం ప్రగతినగర్, గోరంట్ల, నగరాలు, హిమనీ నగర్, రెడ్డిపాలెం, సంజీవయ్య నగర్, శివనా గరాజు కాలనీ, శారదాకాలనీలో సిపిఎం నాయకులు, కార్యకర్తలు కరపత్రాలు, సభల ద్వారా విస్తృత ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శివర్గ సభ్యులు బి.ముత్యాలరావు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మికులు, రైతులు, సామాన్య ప్రజల హక్కులను కాలరాసే విధంగా పరిపాలిస్తోందని, ప్రజలపై రకరకాల భారాలు మోపుతోందని మండిపడ్డారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీల అమలు చేయకుండా తీవ్రంగా మోసం చేసిందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా కార్పొరేట్లకు కట్టబెడుతోందని, త్యాగాలతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు. పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్, నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటాయన్నారు. మరోవైపు రాష్ట్రంలో అధికార పార్టీ కేంద్ర ప్రభుత్వ విధానాలకు అడుగులకు మడుగులొత్తుతోందన్నారు. ప్రధాన ప్రతిపక్షాలు కూడా బిజెపికి సాగిలపడుతున్నాయని విమర్శించారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెలుగులోకి తేవటానికి సిపిఎం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు చేస్తున్నామని, యాత్రల ముగింపు సందర్భంగా 15న విజయవాడలో భారీ బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. ఈ సభలో అన్ని రంగాల ప్రజలంతా పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి కె.నళినీకాంత్, జిల్లా కమిటీ సభ్యులు ఎంఎ చిష్టి, నగర నాయకులు కె.శ్రీనివాసరావు, షేక్ ఖాశింవలి, ఎ.నికల్సన్, పి.శ్రీనివాసరావు, షేక్ సమీర్, నరసింహ, యశ్వంత్, దీవెనరావు పాల్గొన్నారు.
ప్రజాశక్తి - మంగళగిరి : 15న విజయవాడలో జరిగే ప్రజా రక్షణ భేరి భహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ పట్టణంలోని మూడో వార్డులో కరపత్రాల పంపిణీ చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌ఎస్ చెంగయ్య మాట్లాడుతూ దేశానికి వినాశనకరంగా మారిన బిజెపి విధానాలను సిపిఎం తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న బిజెపిని రాష్ట్రంలో ఉన్న అధికార వైసిపి, ప్రతిపక్ష పార్టీలైన టిడిపి, జనసేన మద్దతు పలకడం దారుణమన్నారు. వైసిపి ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో అభివృద్ధి జరగకుండా అడ్డుకుందని, విద్యుత్ ఛార్జీలను విపరీతంగా పెంచిందని విమర్శించారు. కార్యక్రమంలో నాయకులు ఎం.బాలాజీ, ఎస్.గణేష్, ఎస్.వెంకటేష్ పాల్గొన్నారు.
ప్రజాశక్తి - పెదకాకాని రూరల్ : మండలంలోని నంబూరులోని సుందరయ్య కాలనీలో ప్రచారం చేశారు. సిపిఎం మండల కార్యదర్శి ఎన్.శివాజి మాట్లాడారు. డివి. నరసింహారావు, కె.సుబ్బారావు, సాంబయ్య, యేసు, దానేలు, శేషగిరిబాబు పాల్గొన్నారు.
ప్రజాశక్తి - తెనాలి : ఈ నెల 9న తెనాలి అన్నాబత్తుని పుర వేదికకు చేరనున్న ప్రజారక్షణభేరి బస్సు యాత్రకు ఘన స్వాగతం పలికి బహిరంగ సభను విజయవంతం చేయాలని సిపిఎం పట్టణ కార్యదర్శి కె.బాబుప్రసాద్ కోరారు. ప్రజారక్షణ భేరిపై ఆదివారం చినరావూరు డొంకలోని ఎరుకల కాలనీలో ప్రచారం చేశారు. నాయకులు షేక్ హుస్సేన్ వలి తదితరులు పాల్గొన్నారు.