Oct 08,2021 06:10

వ్యాధిని వ్యాపింపచేస్తూ రూపాంతరం చెందే లక్షణం కలిగిన (మనమిప్పుడు డెల్టా వేరియంట్‌గా పిలిచే) సార్స్‌-కోవిడ్‌-2 గురించి మోడీ ప్రభుత్వానికి మార్చి 2021న మరోసారి హెచ్చరికలు ముందుగానే వచ్చాయి. మరింత ప్రమాదకరమైన కోవిడ్‌ వేరియంట్‌ మార్చి ప్రారంభంలో వ్యాపించవచ్చని 'ఇన్‌సాగ్‌' హెచ్చరించినట్లు 'రాయిటర్స్‌' (అంతర్జాతీయ న్యూస్‌ ఏజెన్సీ) 2021 మే 1న పేర్కొంది. అలాంటప్పుడు ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి ఎందుకు చర్యలు చేపట్టలేదు? కోవిడ్‌కు సంబంధించి ప్రమాదకరమైన కేసులలో అత్యంత ప్రధానమైన వైద్యానికి అవసరమైన ఔషధాలు, ఆక్సిజన్‌ ను ఎందుకు సరఫరా చేయలేదు? దీనికి బదులుగా...పబ్లిక్‌ ర్యాలీలు, ప్రజలతో ఊరేగింపులు, దీపాలు వెలిగించడం, ఎన్నికల సందర్భంలో బిజెపి నాయకులను పలు రాష్ట్రాలను సందర్శించడానికి అనుమతించడం, అనేక ఊరేగింపులను ఉద్దేశించి ప్రసంగించడానికి అనుమతించడం సరికాదు. కోవిడ్‌-19 సందర్భంలో వేదికలపై గాని, ఊరేగింపులలో గాని ఈ విధంగా ప్రవర్తించడం అనుచితం.

     ప్రమాదకరమైన కోవిడ్‌ రెండవ దశలో...భారత ప్రభుత్వం...సైన్సు కంటే రాజకీయాలకు ఏవిధంగా ప్రాధాన్యతనిచ్చిందో 'న్యూయార్క్‌ టైమ్స్‌' పత్రిక సెప్టెంబరు 14, 2021న ప్రచురించిన వ్యాసంలో విపులంగా వివరించింది. ఈ వ్యాసం యువ శాస్త్రవేత్త డా|| అనూప్‌ అగర్వాల్‌ చేసిన పోరాటం ఆధారంగా రాయడం జరిగింది. కోవిడ్‌ రెండవ దశ గురించి హెచ్చరిస్తూ, సూపర్‌ మోడల్‌గా పిలువబడే ప్రభుత్వ విధాన నిర్ణయాలు, దేశానికి ఆపద కల్గిస్తాయంటూ...''ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌'' (ఐసియమ్‌ఆర్‌)కు ఆయన హెచ్చరికతో కూడిన అభ్యర్థన చేశారు.
     ప్రభుత్వాన్ని హెచ్చరించిన వారిలో కేవలం అగర్వాల్‌ ఒక్కరే కాదు. ఇతర శాస్త్రవేత్తలు, సైన్సుకు సంబంధించిన విభాగాలు, కోవిడ్‌ రెండవ వేవ్‌ రాబోతోందని హెచ్చరించాయి. కానీ ప్రభుత్వం తమిళనాడు, కేరళ, అస్సాం, పశ్చిమ బెంగాల్‌లో జరగబోయే ఎన్నికలపై దృష్టి సారించింది. మహమ్మారి వ్యాపిస్తుందని తెలిసి కూడా, హరిద్వార్‌లో కుంభమేళాను అనుమతించారు.
     ఏప్రిల్‌ 2021లో, మహమ్మారి రెండవ వేవ్‌ వల్ల ఎంతో మంది ప్రాణాలను కోల్పోతున్న సమయంలో, వైద్యశాలలు బెడ్లు, ఆక్సిజన్‌ కొరతను ఎదుర్కొంటున్న సమయంలో కూడా మోడీ, అమిత్‌ షాలు బెంగాల్‌లో ఎన్నికల ప్రచారంలోనే నిమగమై ఉన్నారు. బెంగాల్‌లో వామపక్షాలు, ఇతర పార్టీలు బహిరంగ ప్రచారాన్ని విరమించుకున్న తర్వాత మోడీ తన ప్రచార కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. ఏమైనా, ఎలక్షన్‌ కమిషన్‌ దేశంలో ఎన్నడూ, ఏ రాష్ట్రంలో లేనట్లుగా బెంగాల్‌లో ఎన్నికలను సుదీర్ఘ కాలం నిర్వహించడం వల్ల, మహమ్మారి ఆ రాష్ట్రంలో అధికంగా వ్యాపించడానికి దోహదపడింది. రెండవ దశ మహమ్మారిని ఏ విధంగా నిరోధించాలనే నిర్ణయాలలో శాస్త్రీయమైన చిత్తశుద్ధి లోపించింది.
      భారతదేశంలో ప్రధానమైన సైన్స్‌ సంస్థలు తక్షణ రాజకీయాలకు ఏ విధంగా అనుకూలంగా వ్యవహరిస్తు న్నాయో 'న్యూయార్క్‌ టైమ్స్‌' బహిర్గతం చేసింది. అది అంతర్గత విషయాలను ముందుకు తెచ్చింది. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ అధికారిక కథనాలను ప్రశ్నించవద్దని ఎలా నిరుత్సాహపరిచిందో కూడా వివరించింది. శాస్త్రీయమైన గొంతుకలు మూగబోయేలా క్రమశిక్షణా చర్యలు చేపట్టారు. అధికారిక కథనాలకు అనుకూలంగా మద్దతు ఇవ్వని పేపర్లను ముద్రించడానికి అనుమతి ఇవ్వకపోవడమే కాక, రద్దు చేశారు. ఇది ప్రపంచ వార్తగానే కాక మన దేశంలో కూడా వార్తగా కూడా మారింది. కానీ శాస్త్రవేత్తలు, ఆరోగ్య నిపుణులు ప్రభుత్వ అసంతృప్తికి భయపడకుండా మహమ్మారి సమయంలో దానిని గూర్చి ప్రజలతో మాట్లాడుతూనే ఉన్నారు. ప్రభుత్వం శత్రుత్వంతో వ్యవహరించినా, భారత వార్తా సంస్థలు గానీ, సాంప్రదాయ, డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ గానీ మోడీ ప్రభుత్వం కోవిడ్‌-19 మహమ్మారిని నిర్వహించిన తీరును, లోపాలను ప్రభుత్వానికి అయిష్టత ఉన్నప్పటికీ, విమర్శనాత్మక అభిప్రాయాలను కొనసాగించాయి. పీపుల్స్‌ డెమోక్రసీలో ''సైన్సు మరియు అభివృద్ధి'' అనే శీర్షిక కూడా భాగస్వామి అయింది. ఈ కాలంలోనే ప్రజా సైన్స్‌ ఉద్యమం మరియు జన స్వాస్థ్య అభియాన్‌ ఈ కాలంలోనే అనేక ప్రకటనలను ఇచ్చాయి. మహమ్మారికి సంబంధించి 'న్యూయార్క్‌ టైమ్స్‌' వెలిబుచ్చిన అనేక అంశాలను, ఆందోళనలను పైసంస్థలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చాయి.
     మొదట మనం ప్రభుత్వ ఆరోగ్య మరియు శాస్త్రీయ సంస్థల జోక్యం గురించి ప్రారంభిద్దాం. మూడు ప్రసిద్ధిగాంచిన ప్రభుత్వ వైద్య విభాగాలు...ఇండియన్‌ పబ్లిక్‌ హెల్త్‌ అసోసియేషన్‌ (ఐపిహెచ్‌ఎ), ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ అండ్‌ సోషల్‌ మెడిసిన్‌ (ఐఎపియస్యమ్‌), ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఎపిడమాలజిస్ట్‌ (ఐఎఇ)...మహమ్మారిని నిరోధించడంలో ప్రభుత్వ లోపాలను గూర్చి నిరంతరం ప్రకటనలను విడుదల చేశాయి. ఈ సమస్యను ప్రజారోగ్య, సాంక్రమిత రోగ విజ్ఞానానికి సంబంధించిన (అంటువ్యాధికి సంబంధించిన) సవాలుగా కాక, ఒక పరిపాలనా సంబంధమైన అంశంగా చూడడం ప్రధానమైన వైఫల్యం. మొదటి దశ మహమ్మారిని అరికట్టడంలో ఏ విధంగా విఫలమైందీ లాక్‌డౌన్‌ ప్రతిబింబించింది. దేశవ్యాప్తంగా మార్చి 25, 2020 నుండి మే 31 2020 వరకు విధించిన లాక్‌డౌన్‌ అత్యంత కఠినమైనదని, అయినప్పటికీ కేసులు ఈ కాలంలో విపరీతంగా పెరిగాయని, మార్చి 25న 600 కేసులు వుండగా, మే 24కు 1 లక్ష 38 వేల 845కు పెరిగాయని... మే 25న ఆయా విభాగాలు విడుదల చేసిన నివేదికలో తెలిపాయి. ప్రధానంగా జాతీయ స్థాయిలో జాగ్రత్తగా ప్రణాళికలు రూపొందించలేకపోవడం, విషయాన్ని సరిగా అర్ధం చేసుకోలేకపోవడం, విధాన రూపకల్పన చేసే వారి దగ్గర నచ్చజెప్పగల్గే ప్రణాళికలు గానీ, వ్యూహాలు గానీ లేకపోవడంతో ఈ పరిణామాలు సంభవించాయి. ఒక్క మాటలో చెప్పాలంటే...మహమ్మారిని అరికట్టడంలో ప్రభుత్వం నిర్వహించే పద్ధతులలో శాస్త్రీయ అవగాహన లోపించింది.
     కోవిడ్‌ విషయంలో నిరంతరం జరిగిన పొరపాటు ఏమంటే...ఔషధాల విషయంలో ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ చేసే ప్రతిపాదనలు. హైడ్రో క్లోరోక్విన్‌, ఐవర్‌మెక్టిన్‌ తో విరివిగా చేసే ప్రయోగాలలో వారికి ఎలాంటి సమర్ధత లేదని తెలుస్తుంది. అయినప్పటికీ ఈనాటికి కూడా ఇండియన్‌ మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ 2021 మే17న జారీ చేసిన కోవిడ్‌ మార్గదర్శకాలను కొనసాగిస్తూ...ఆరోగ్య మంత్రిత్వ శాఖ, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించిన విధంగా ఆ రెండు ఔషధాలను కోవిడ్‌-19 చికిత్స కోసం అనుమతించింది. ట్రంప్‌, బోల్సనారో ప్రభావం మోడీ పై ఉందని న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొంది.
    మోడీ ప్రభుత్వం కోవిడ్‌ నిర్వహణలో ఈ విధమైన నిర్లక్ష్యం కొనసాగింది. ఈ సమయంలో మోడీ ప్రభుత్వం సైన్స్‌ పట్ల వ్యవహరించిన తీరు ఏవిధంగా ఉన్నదనే దానికి రెండు కీలక అంశాలను ఉదహరించవచ్చు. మొదటిది, సూపర్‌ మోడల్‌గా చెప్తూ కోవిడ్‌-19పై పూర్తి విజయం సాధించినట్లు ప్రకటించడం. రెండవది ఈ సంవత్సరం ప్రారంభంలో, శాస్త్రీయమైన సమాచారాన్ని నిర్లక్ష్యం చేయడం. ఒక సమాచారం ప్రకారం భారతదేశంలో నూతనంగా వ్యాపించి, రూపాంతరం చెందగల వేరియంట్లు ఉద్భవిస్తాయని, దీనివల్ల రెండవ వేవ్‌ వచ్చే ప్రమాదం ఉందని తెలియజేసింది. మోడీ ప్రభుత్వం ఒక ప్రచార బృందాన్ని ఏర్పరుచుకుంది. వారి పనేంటంటే మహమ్మారిపై విజయం సాధించామని ప్రచారం చేయటం. డీయస్టీ (డే లైట్‌ సేవింగ్‌ టైమ్‌) సూపర్‌ మోడల్‌ కు నాయకత్వం వహించే ముగ్గురు వ్యక్తులు ఒక పేపర్‌ ను రచించి ఇండియన్‌ జనరల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చిలో ప్రచురించారు. దానిలో ఆశ్చర్యంగొలిపే ప్రతిపాదనలు ఉన్నాయి. వాటి ప్రకారం ప్రజలు రెండు రకాలుగా ఉన్నారు. వారిలో కొందరు రోగ లక్షణాలు కలవారు. మరికొందరు తీవ్రంగా జబ్బుపడ్డ వారు. 2019 చివరి భాగంలో కోవిడ్‌ మహమ్మారి క్షీణ దశ లోకి ప్రవేశించిందని, ఫిబ్రవరి 21కి భారతదేశం నుండి అదృశ్యమౌతుందని చెప్పారు. భారతదేశంలో ఇంత క్రితమే 380 మిలియన్‌ ప్రజలకు వ్యాధి సోకిందని, సామూహిక నిరోధకశక్తి (హెర్డ్‌ ఇమ్యూనిటీ) వైపుకు పయనిస్తోందని చెప్పారు.
     ఈ నమూనా విధానం తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంది. వ్యాధి సోకిన వారిలో భిన్నమైన స్థాయిలలో బహిర్గతమైనదని, వివిధ స్థాయిలలో రోగ నిరోధక శక్తి కలిగి ఉన్నారని సాంక్రమిక రోగ విజ్ఞాన వైద్యుడు, గౌతమ్‌ మీనన్‌ తెలిపారు. గతంలో క్రిస్టియన్‌ కళాశాల వైరాలజీ విభాగానికి అధిపతిగా ఉన్న టి.జాకోబ్‌ జాన్‌ ప్రముఖ ప్రచురణ సంస్థ ''సైన్స్‌''తో మాట్లాడుతూ జాతీయ అంటువ్యాధుల నమూనాలు ఎందుకు పని చేయడం లేదని ప్రశ్నించారు. జాతీయ అంటువ్యాధులనేవి ఊహాజనిత లెక్కలు మాత్రమేనని, దానికి బదులుగా 100 కంటే ఎక్కువ అంటువ్యాధులు విభిన్న రాష్ట్రాలలో, పట్టణాల్లో ఉన్నాయని, ఆయా కాలాల్లో అభివృద్ధి అవుతూ, తగ్గుతూ ఉంటాయని తెలిపారు. ప్రభుత్వ విభాగాల లోపల వెలుపల, అనేక శాస్త్రీయమైన వాదనలు తెలియజేసేది ఏమంటే, సూపర్‌ మోడల్‌ను ప్రత్యేకమైన అధికారం కలదిగా ప్రచారం చేస్తూ, ప్రభుత్వం ఏం వినదల్చుకున్నదో లేక ప్రజలకు ఏం వినిపించదల్చుకున్నదో చెప్పే విధానం ప్రమాదకరమైన ఫలితాలను ఇస్తుందని తెలిపారు.
     వ్యాధిని వ్యాపింపచేస్తూ రూపాంతరం చెందే లక్షణం కలిగిన (మనమిప్పుడు డెల్టా వేరియంట్‌గా పిలిచే) సార్స్‌-కోవిడ్‌-2 గురించి మోడీ ప్రభుత్వానికి మార్చి 2021న మరోసారి హెచ్చరికలు ముందుగానే వచ్చాయి. మరింత ప్రమాదకరమైన కోవిడ్‌ వేరియంట్‌ మార్చి ప్రారంభంలో వ్యాపించవచ్చని 'ఇన్‌సాగ్‌' హెచ్చరించినట్లు 'రాయిటర్స్‌' (అంతర్జాతీయ న్యూస్‌ ఏజెన్సీ) 2021 మే 1న పేర్కొంది. ప్రత్యక్షంగా ప్రధానికి నివేదించగల అత్యున్నత అధికారికి ఈ విషయాన్ని తెలియజేశారు. బహుశా ఐసియంఆర్‌ ప్రతినిధికి గానీ, ప్రధానికి శాస్త్రీయ సలహాదారు ద్వారా గానీ తెలియజేసి ఉండవచ్చు. అలాంటప్పుడు ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి ఎందుకు చర్యలు చేపట్టలేదు? కోవిడ్‌కు సంబంధించి ప్రమాదకరమైన కేసులలో అత్యంత ప్రధానమైన వైద్యానికి అవసరమైన ఔషధాలు, ఆక్సిజన్‌ ను ఎందుకు సరఫరా చేయలేదు? దీనికి బదులుగా పబ్లిక్‌ ర్యాలీలు, ప్రజలతో ఊరేగింపులు, దీపాలు వెలిగించడం, ఎన్నికల సందర్భంలో బిజెపి నాయకులను పలు రాష్ట్రాలను సందర్శించడానికి అనుమతించడం, అనేక ఊరేగింపులను ఉద్దేశించి ప్రసంగించడానికి అనుమతించడం సరికాదు. కోవిడ్‌-19 సందర్భంలో వేదికలపై గాని, ఊరేగింపులలో గాని ఈ విధంగా ప్రవర్తించడం అనుచితం.
    న్యూయార్క్‌ టైమ్స్‌ నివేదికలు, మనకు తెలిసిన విధంగానే సైన్స్‌ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ధృవీకరించాయి. రాయిటర్స్‌ కు చెప్పబడిన, రెండు శాస్త్రీయమైన ఆలోచనల గురించి చెప్పి ముగిస్తాను. విధానాలను నిర్ణయించడంలో సైన్స్‌ను విశ్వాసంలోకి తీసుకోవడం లేదని తాను ఆందోళన చెందుతున్నానని, శాస్త్రీయ సలహా బృందానికి అధ్యక్షుడైన షాహిద్‌ జమీన్‌ తెలిపారు. దేశం లోని శాస్త్రీయ సమాజాన్ని నిరాశకు గురి చేశారని సెల్యులార్‌ మాలిక్యులర్‌ బయాలజీ అధిపతి రాకేష్‌ శర్మ తెలిపారు. సైన్సుకు మరింత ప్రాధాన్యత ఇచ్చి ఉన్నట్లయితే మనం మరింత మెరుగ్గా పని చేయగలిగే వాళ్ళం. ఏ చిన్న అవకాశం ఉన్నా మనం సక్రమంగా వినియోగించకోగలిగి ఉండే వాళ్ళం.

ప్రబీర్‌ పురకాయస్థ

ప్రబీర్‌ పురకాయస్థ