Oct 03,2023 22:07

కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తున్న రైతు, కార్మికసంఘాల నాయకులు, కార్యకర్తలు

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  కేంద్రంలోని మోడీ ప్రభుత్వ నిరంకుశ విధానాలను వ్యతిరేకిస్తూ, వ్యవసాయ నల్లచట్టాలపై ఆందో ళన సందర్భంగా మోడీ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం కలెక్టర్‌ కార్యాలయం వద్ద రైతు, కార్మిక సంఘాల ఆధ్వర్యాన ధర్నా చేపట్టారు. అనంతరం రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా సంయుక్త కిసాన్‌ మార్చ్‌ సమన్వయ కమిటీ నాయకులు బి.రాంబాబు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సురేష్‌ మాట్లాడారు. రైతు వ్యతిరేక, కార్పోరేట్‌ అనుకూల వ్యవసాయ చట్టాలు రద్దు చేసి రైతులకు స్వామినాథన్‌ కమిటీ సిపార్సులకు అనుగుణంగా మద్దతు ధరకు చట్టం చేయాలని దేశవ్యాప్త రైతు ఉద్యమం జరిగిందన్నారు. ఆ సందర్భంగా మోడీ ఇచ్చిన హామీలను ఏడాదైనా అమలు చేయలేదన్నారు. రైతులు వ్యవసాయ కూలీలు కార్మికులు సామాన్య ప్రజల ప్రయోజనాలను నరేంద్ర మోడి ప్రభుత్వం కార్పొరేట్లకు కట్టబెట్టడాన్ని నిరసిస్తూబ్లాక్‌డే నిర్వహిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ సంక్షోభం ఫలితంగా అప్పుల ఊబిలో కూరుకు పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల రుణాలు మాఫీ చేయడానికి మోడీ ప్రభుత్వానికి చేతులు రావడం లేదన్నారు. కార్పొరేట్‌ కంపెనీలకు రుణమాఫీచేస్తున్నారని అన్నారు. సామాన్య ప్రజలపైన పన్నుల భారాన్ని పెంచుతూ, కార్పొరేట్లకు ఐటి, ఎక్సైజ్‌, కస్టమ్స్‌,కార్పొరేట్‌ టాక్స్‌ ల పైన లక్షలాది కోట్ల రూపాయల రాయితీలను ఇస్తున్నారన్నారు. మరోవైపు కార్మికులు బ్రిటిష్‌ కాలం నుండి పోరాడి 44 కార్మిక చట్టాలను కార్మికుల సాధించుకుంటే కార్మికులను యజమానులకు కట్టు బానిసలుగా మార్చేందుకు వాటిని నాలుగు లేబర్‌ కోడ్‌లుగా మార్చిందన్నారు. ఫలితంగా బలహీన వర్గాల ప్రజల ఉపాధికి నష్టం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్‌.గోపాల్‌, ఉపాధ్యక్షులు ఎల్‌.ఆదినారాయణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.శ్రీనివాస్‌, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు డేగల అప్పలరాజు, కౌలు రైతుసంఘం జిల్లా కన్వీనర్‌ రాకోటి రాములు, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్‌ వి.లక్ష్మి, సిఐటియు నాయకులు ఎ.జగన్మోహన్‌, బి.రమణ తదితరులు పాల్గొన్నారు.

బొబ్బిలిలో మానవహారం చేస్తున్న కార్మికులు
బొబ్బిలిలో మానవహారం చేస్తున్న కార్మికులు

బొబ్బిలిలో మానవహారం
బొబ్బిలి : కేంద్రంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అణిచివేతకు వ్యతిరేకంగా కార్మికులు పోరాటాలకు సిద్ధం కావాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు పి. శంకరరావు అన్నారు. ప్రపంచ కార్మిక సంఘాల సమాఖ్య వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా స్థానిక కోరాడ వీధి కూడలిలో సిఐటియు ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలు రద్దు చేస్తూ నాలుగు లేబర్‌ కోడ్స్‌ తెచ్చి కార్మిక వర్గాన్ని బానిసలుగా మారుస్తూ కార్మిక హక్కులు హరిస్తున్నా రన్నారు.
రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం ఉద్యోగులు కార్మికులు తమ హక్కుల కోసం పోరాడుతుంటే నిర్బంధాన్ని ప్రయోగించి అక్రమ అరెస్టులు కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. ప్రజాస్వామ్య యుతంగా ప్రజలు నిరసనలు తెలియజేసిన వైసిపి ప్రభుత్వం అంగీకరించడం లేదన్నారు. నియంతలా మారి ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తుందన్నారు. పాలకులు కార్మిక ప్రజల హక్కుల దాడిపై పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జి. గౌరీ, బి. యుగంధర్‌, జె. రామారావు జి. శంకర్రావు కార్మికులు పాల్గొన్నారు.