తనపై కేసుల కారణంగా జగన్ మోడీకి లోబడి వ్యవహరిస్తున్నారనే విమర్శ వున్నా మిగిలిన మూడు ప్రాంతీయ పార్టీలు కూడా స్థానం కాపాడుకోవడానికే పరిమితం కావడం, రాష్ట్రాల ప్రయోజనాలకు రాజ్యాంగ బద్దంగా రావలసిన వాటికి కూడా ఒత్తిడి చేయకపోవడం దారుణం. మోడీ సర్కారు కేంద్రీకృత నిరంకుశ విధానాలను నిలవరించే పోరాటం వీరికి అసలు పట్టకపోవడం మరింత నష్టదాయకం. కాంగ్రెస్ అవ్యవస్థ, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వంటి వారి అనిశ్చిత వ్యూహాలు, ఒరిస్సాను నిరాఘాటంగా పాలిస్తున్న నవీన్ పట్నాయక్ వంటి వారి పరిమిత పోకడలు, బిఎస్‌పి-ఎస్‌పి ల కలహాలు వంటివన్నీ మోడీకి మేలుగా మారుతున్నాయి. ఫిరాయింపులతోనూ బెదిరింపులతోనూ బిజెపి చెెలరేగిపోవడానికి ఊతమిస్తున్నాయి.
ప్రముఖ ఇంగ్లీషు పత్రిక 'హిందూ' అక్టోబరు 14న వ్యాసాలు వ్యాఖ్యల పేజీలో తెలుగు రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల రాజకీయాలపై ఒక వ్యాసం ప్రచురించింది. సీనియర్ పాత్రికేయుడైన ఆ వ్యాసకర్త రాసిన వాటికి కొన్ని పరిమితులున్నా ఆలోచించవలసిన కీలకాంశాన్ని ముందుకు తెచ్చింది. ఏడేళ్ల కిందట విభజన తర్వాత ఏర్పడిన రెండు తెలుగు రాష్ట్రాలు ఎ.పి, తెలంగాణలను పాలిస్తున్న వైసీపీ, టిఆర్‌ఎస్ లు కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వాన గల బిజెపి-ఎన్‌డిఎ ప్రభుత్వం పట్ల మరీ ముఖ్యంగా ప్రధాని పట్ల అనుసరిస్తున్న విధేయ వైఖరి ఇరు రాష్ట్రాల ప్రయోజనాలకు చేటు చేయడమే గాక దేశ వ్యాపితంగా రాష్ట్రాల హక్కులపై దాడి తీవ్రం కావడానికి ఎలా దోహదం చేస్తున్నదో అందులో వుంది. ఇది ఆ పార్టీలు గతంలో చెప్పిన దానికే విరుద్ధంగా వుండటమే కాదు, దేశంలో ప్రజాస్వామ్య ఫెడరలిజానికి చెప్పలేని హాని కలిగిస్తున్నది. తెలుగు ప్రజల పోరాట వారసత్వానికి కళంకం తెస్తున్నది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖరరావు, వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటించడం, తమ కోర్కెలు చెప్పిరావడం జరుగుతూనే వుంటుంది. కాని అందులో ఒక్కటంటే ఒక్కటి నెరవేరకపోయినా కొనసాగింపుగా కార్యాచరణ గాని ఉద్యమాలు గాని వుండటం లేదు. తాము ఇచ్చిన కోర్కెల పైనే పోరాటం లేనప్పుడు జాతీయ విషయాల గురించి అసలు మాట్లాడేదేముంటుంది ?
రాష్ట్రానికి వాగ్దాన భంగం
ఎ.పి విషయమే తీసుకుంటే ప్రత్యేక హోదా. ఎప్పటికప్పుడు వాయిదాలు పడి ప్యాకేజీ ప్రహసనాలు ముగిసి ప్రత్యేక ధోకాగా మారిపోయింది. ఆ పేరెత్తితే కేంద్ర రాష్ట్ర బిజెపి నేతలు అపహాస్యం చేస్తున్నా పాలకులలో చలనం లేదు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్యాకేజీ గొప్పతనం చెప్పడానికి ఎంత శ్రమ పడ్డారో గుర్తుచేసుకుంటే హాస్యాస్పదంగా వుంటుంది. ఆ సమయంలో ప్రతిపక్ష నాయకుడుగా వున్న ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ నిరాహారదీక్షలు, యూనివర్సిటీ సెమినార్‌లు ఒకటేమిటి ప్రత్యేక హోదాను ప్రధానాంశంగా ప్రచారం చేశారు. ఆ దెబ్బతో చంద్రబాబు కూడా ఎన్నికలకు ఏడాది ముందు ఎన్‌డిఎ నుంచి వైదొలగి ప్రత్యేక హోదాపై పోరాటం ధర్మయుద్ధం పేరిట హడావుడి చేశారు. ఎ.పి ప్రజలు టిడిపి, బిజెపి రెంటినీ ఓడించి, వైసీపీ కి అసాధారణ ఆధిక్యతతో అధికారం అప్పగించారు. అంతే! ప్రమాణ స్వీకారం ముందే ప్రత్యేక హోదాపై చేతులెత్తేశారు. మోడీకి పూర్తి మెజార్టీ వుంది గనక ఏం చేయలేమనడం ప్రజలకు మొదటి రాజకీయ షాక్‌గా మారింది. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరం పెరిగిన ఖర్చులు, పునరావాస బాధ్యతలతో కలసి రూ.55565 కోట్లు ఆమోదం విడుదల కూడా జరగడం లేదు. పోలవరం ప్రాజెక్టు సాధికార సంస్థ (పిపిఎ) కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి రాజమండ్రి తరలించడమూ అలాగే వుంది. హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించడంపై ఏకాభిప్రాయం వున్నా పలుసార్లు అడిగినా అతీగతీ లేదు. రెవెన్యూ లోటు కింద మొదట్లో ఇవ్వాల్సినవి ఇవ్వకపోయినా ఈ ప్రభుత్వం సమస్యగా భావించడం లేదు. కాని వీరు అడిగిన మేరకు రూ.50 వేల కోట్ల అప్పుల పునర్వ్యవస్థీకరణ గానీ, ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించిన రూ. 3299 కోట్ల సబ్సిడీ బకాయిలు, గ్రామీణాభివృద్ధి శాఖలో రూ. 4652 కోట్లు కూడా రావడం లేదు. రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం సహాయం అందకపోయినా మూడు రాజధానుల ప్రతిష్టంభన కారణంగా అదీ అడిగే పరిస్థితి లేదు. కోవిడ్ నేపథ్యంలో కేంద్రం సహాయం లేకపోవడంపై కేరళ, ఢిల్లీ, బెంగాల్ వంటి రాష్ట్రాలు కలసి పోరాడితే ఎ.పి గొంతు కలపలేదు. న్యాయంగా అదనంగా కేంద్రం నుంచి రావలసినవి తెచ్చుకోలేని నిస్సహాయత అప్పుల ఊబిలో కూరుకుపోతున్నా జగన్ ప్రభుత్వం అందరినీ కలుపుకొని కేంద్రంపై పోరాడాలనే ఆలోచన మాత్రం చేయడం లేదు. గతంలో ప్రతిపక్షాల ఒత్తిడి కారణంగానైనా చంద్రబాబు ఆఖరులోనైనా మారాల్సి వచ్చింది. కాని ఇప్పుడు చూస్తే టిడిపి కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో విమర్శలు గుప్పించడం తప్ప కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని ఆక్షేపించడం లేదు. ఇంకా చెప్పాలంటే మీరు లోబడిపోయారంటే మీరు లొంగిపోయారని పరస్పరం తిట్టుకుంటూ బిజెపి కి రాష్ట్రాన్ని లోకువ చేస్తున్నారు. ఇదే ప్రత్యేక హోదాపై రౌండ్ టేబుళ్లు పెట్టి హిందీలో ప్రసంగాలు చేసి హడావుడి పెట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేరుగా బిజెపితో జతకట్టి ఆ ఊసే వదిలేశారు. రాష్ట్రానికి ఇంత అన్యాయం చేసిన బిజెపి రాజకీయంగా ఎదురుదాడికి దిగడమే గాక అలవాటైన మత రాజకీయాలతో హిందూ, క్రైస్తవ చిచ్చు పెట్టాలని పథకాలు వేస్తే వైసీపీ గట్టిగా ఎదిరించదు. టిడిపి, జనసేన డిటోగా మాట్లాడతాయి. జనసేన, బిజెపి లను కూడా టిడిపి తరపున పని చేస్తున్నట్టు వైసీపీ విమర్శిస్తుంది. బిజెపి, జనసేన అస్తిత్వాన్నే గుర్తించనట్టు వ్యవహరిస్తున్నా పవన్ కళ్యాణ్‌లో స్పందన వుండదు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వంటిదానిపై కూడా గట్టిగా పోరాడకపోగా తనను అక్కడ గెలిపించలేదని వాపోయారు. హిందూ వ్యాసం బిజెపి కి వైసీపీ లోబడిపోతున్న తీరును బాగానే చెప్పింది గాని మిగిలిన రెండు పార్టీలూ అదే తరహాలో వ్యవహరిస్తున్న వాస్తవం ప్రస్తావించలేదు.
తెలంగాణ సి.ఎం మకాం, మంతనాలు
ఎ.పి లో బిజెపి కి ఎన్నికల విజయాలు లేవు గాని తెలంగాణలో ఎంఎల్‌ఎ, ఎం.పి స్థానాలున్నాయి. మజ్లిస్ కూడా హైదరాబాదులో ఒక కీలక పాత్రధారిగా వుంది. బండి సంజరు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడైనా హిందూత్వ రాజకీయాలు రగిలించే ప్రయత్నం తీవ్రంగానే జరుగుతున్నది. హోంమంత్రి అమిత్ షాతో సహా వచ్చి వెళ్లారు. ఆ రీత్యా రాష్ట్ర స్థాయిలో కెసిఆర్ ప్రభుత్వం బిజెపిపై విమర్శలు చేయడం, పోరాడటం అనివార్యంగా జరుగుతుంది. కాని రాష్ట్రానికి కేంద్రం నుంచి రావలసినవి రాబట్టడంలోనూ మోడీ నిరంకుశ విధానాలపై జరిగే పోరాటాన్ని బలోపేతం చేయడంలోనూ పాల్గొనడం లేదు. ఒక దశలో ఆ విధమైన సంకేతాలిచ్చిన కెసిఆర్ తర్వాత వ్యూహం మార్చుకున్నారా అని పరిశీలకులు సందేహిస్తున్నారు. రైతాంగ వ్యతిరేక శాసనాలపై జరిగిన మొదటి బంద్‌ను బలపర్చిన కెసిఆర్ ప్రభుత్వం రెండవ బంద్‌కు సహకరించలేదు. గత నెలలో ఆయన ఢిల్లీకి రెండు సార్లు వెళ్లి పది రోజులు వుండటమే గాక అమిత్‌షాతో సహా బిజెపి అగ్ర నాయకులను ఒకటికి రెండుసార్లు కలసి వచ్చారు. రాష్ట్ర రాజకీయాలు ఎలా వున్నా కేంద్రంలో బిజెపికి సహకరిస్తామనీ, రేపు రాబోయే అయిదు రాష్ట్రాల ఎన్నికల వసరుల సమీకరణ లోనూ ఒక చేయి వేస్తామని హామీ ఇచ్చినట్టు చెబుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కన్నా బిజెపి ని ప్రత్యర్థిగా కలిగి వుండటమే మేలని కెసిఆర్ భావనగా వుంది. టిడిపి నుంచి కాంగ్రెస్‌లో చేరి పిసిసి అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి కూడా బిజెపి పై రాజకీయ పోరాటం కన్నా టిఆర్‌ఎస్ ను ఎదుర్కోవడం కీలకమనే ఎత్తుగడలు అనుసరిస్తున్నారు. కాంగ్రెస్ కుదురుకు చెందిన కొండా విశ్వేశ్వర రెడ్డి వంటి వారు హుజూరాబాద్‌లో బిజెపి తరపున పోటీ చేస్తున్న ఈటెల రాజేందర్‌ను బలపరుస్తున్నారు. అక్కడ కాంగ్రెస్ బలమైన అభ్యర్థిని కూడా పెట్టలేదనే విమర్శ వుంది.
హైదరాబాద్ రాజధానిగా వున్న తెలంగాణకు ఎ.పి కి వున్న రెవెన్యూ లోటు సమస్య కూడా లేదు గాని అపరిష్కృత అంశాలు అనేకం కేంద్రం దగ్గర వున్నాయి. గత నెల ప్రధానిని కలిసిన కెసిఆర్ ఆ జాబితా ఇచ్చి వచ్చారు. హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటు, నాగపూర్‌తో పారిశ్రామిక క్యారిడార్, వరంగల్‌లో జౌళి పార్కు, గిరిజన విశ్వ విద్యాలయం, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి, రహదార్ల మెరుగుదల, ఒక ప్రాజెక్టునైనా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడం వంటివి తెలంగాణ దీర్ఘకాలిక కోర్కెలు.
ఉభయ హానికరం
రెండు రాష్ట్రాలకు సంబంధించిన విభజన సమస్యలు కొనసాగుతూనే వున్నాయి. ఇప్పుడు నదీజల వివాదాలను సాకుగా చూపి కేంద్రం మొత్తం ప్రాజెక్టులను తన గుప్పిట్లోకి తీసుకుంటున్నది. ఇంత జరుగుతున్నా కెసిఆర్, జగన్‌లు గట్టిగా గొంతెత్తి మాట్లాడ్డం లేదు. రాష్ట్రాలలో పార్టీల మధ్య విమర్శలతో పాటు ఇరు రాష్ట్రాల మధ్య అవాంఛనీయ వివాదం పెంచుకోవడానికే పరిమితమవుతున్నారు. కేంద్రం చెప్పిన వాటిని ముందుగా ఎ.పి అమలు చేస్తుంటే తెలంగాణ రాజ్యాంగ బాధ్యత పేరిట మద్దతునిస్తుంటుంది. 370వ అధికరణాన్ని పక్కన పెట్టడం, పౌరసత్వ సవరణలతో సహా బిజెపి బిల్లులన్నిటినీ ఈ పార్టీలు ఏదోరకంగా బలపర్చాయి. పౌరసత్వ సమరణ బిల్లును వ్యతిరేకించిన టిఆర్‌ఎస్ రాష్ట్రంలో దాన్ని అమలు చేయబోమని ప్రకటించలేదు. వైసీపీ అక్కడ మద్దతునిచ్చి ఇక్కడ అమలు చేయబోమని ప్రకటించింది. వీటి విషయమే ఇలా వుంటే మత రాజకీయాలకు, పౌర హక్కులపై దాడులకు సంబంధించిన ఇతర అంశాలు చెప్పనవసరం లేదు. తనపై విమర్శలకు సమాధానంగా మరిన్ని ఆలయ ప్రదక్షిణలు చేయడం జగన్ విధానంగా వుంది. యాదాద్రి నూతన నిర్మాణానికి మోడీని రప్పించడంలో కెసిఆర్ రాజకీయం కనిపిస్తుంది.
దేశవ్యాపిత ప్రభావం
తెలుగునాట ఒకనాడు కమ్యూనిస్టుల సంఖ్యాబలం, ఉద్యమాలు కేంద్రానికి సింహస్వప్నంగా వుండేవి. తర్వాత కాలంలో తెలుగుదేశం స్థాపించి అధికారం లోకి వచ్చిన ముఖ్యమంత్రి ఎన్టీఆర్, జ్యోతిబాసు, రామకృష్ణ హెగ్డే, ఫరూక్ అబ్దుల్లా వంటి వారితో కలసి రాష్ట్రాల హక్కుల కోసం పోరాడారు. ఆయనను కూలదోస్తే ప్రజలూ ప్రతిపక్షాలూ కలసి పున:ప్రతిష్టించుకున్నారు. ఆ క్రమంలోనే బిజెపి లేని నేషనల్ ఫ్రంట్ కూడా ఏర్పడింది. దాన్ని కూలదోసేందుకు అద్వానీ రథయాత్ర చేసిన తర్వాత ఎన్టీఆర్ బిజెపితో తెగతెంపులు చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు ఈ పరిణామం లోనే జాతీయ పాత్ర నిర్వహించి తర్వాత బిజెపి తో చేతులు కలిపారు. విడిపోయి మళ్లీ కలిపారు. 2019 లోనూ ప్రతిపక్షాల వేదిక అన్నారు. ఓడిపోయాక మళ్లీ బిజెపి విధానాలపై విమర్శలు విరమించుకున్నారు. టిడిపి రాజ్యసభ పక్షం మొత్తం బిజెపి లో కలసిపోయినా ఉపేక్షించారు. తనపై కేసుల కారణంగా జగన్ మోడీకి లోబడి వ్యవహరిస్తున్నారనే విమర్శ వున్నా మిగిలిన మూడు ప్రాంతీయ పార్టీలు కూడా స్థానం కాపాడుకోవడానికే పరిమితం కావడం, రాష్ట్రాల ప్రయోజనాలకు రాజ్యాంగ బద్దంగా రావలసిన వాటికి కూడా ఒత్తిడి చేయకపోవడం దారుణం. మోడీ సర్కారు కేంద్రీకృత నిరంకుశ విధానాలను నిలవరించే పోరాటం వీరికి అసలు పట్టకపోవడం మరింత నష్టదాయకం. కాంగ్రెస్ అవ్యవస్థ, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వంటి వారి అనిశ్చిత వ్యూహాలు, ఒరిస్సాను నిరాఘాటంగా పాలిస్తున్న నవీన్ పట్నాయక్ వంటి వారి పరిమిత పోకడలు, బి.ఎస్.పి-ఎస్.పి ల కలహాలు వంటివన్నీ మోడీకి మేలుగా మారుతున్నాయి. ఫిరాయింపులతోనూ బెదిరింపులతోనూ బిజెపి చెెలరేగిపోవడానికి ఊతమిస్తున్నాయి. స్పష్టమైన సైద్ధాంతిక భూమిక వుండే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వంటి వారి గురించి చెప్పనవసరం లేదుగాని బెంగాల్ సి.ఎం మమతా బెనర్జీ, బీహార్‌లో తేజస్వి యాదవ్ వంటి వారే ఈ వాతావరణంలో బిజెపి ని ఎదుర్కొనే నేతలుగా కనిపిస్తున్నారు. మోడీ ప్రైవేటీకరణ విధానాలపై కార్మిక ఉద్యోగులు, వినాశకర వ్యవసాయ శాసనాలపై రైతులు పోరాడుతుంటే తెలుగు రాష్ట్రాలలో గత ప్రస్తుత పాలక పార్టీలు ఈ విధంగా బిజెపి కి ఉపగ్రహాలుగా మారడం తెలుగు ప్రజల చైతన్యానికి, సమరశీల సంప్రదాయాలకు విరుద్ధం, విపత్కరం.
తెలకపల్లి రవి











