Mar 25,2021 06:40

మోడీ సర్కార్‌ దేశాన్ని పాలించడం కంటే... వివిధ రాష్ట్రాలలో అధికారంలో ఉన్న తమ వ్యతిరేక ప్రభుత్వాలను కూల్చడం మీదనే ఎక్కువ శ్రద్ధ పెట్టింది. పెరుగుతున్న ధరలను నియంత్రించే పనిని పక్కన పెట్టి దేశంలో ఎక్కడ ఏ ఎన్నిక జరిగినా తామే గెలవాలనే తలంపుతో అడ్డదారులు తొక్కడానికే అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఒక వైపు డీజిల్‌, పెట్రోల్‌, గ్యాస్‌ ధరలు చుక్కలను అంటుతున్నాయి. సామాన్య, మధ్యతరగతి వర్గాలకు బతుకు భారం అయింది. వారి కొనుగోలు శక్తి రోజురోజుకు తగ్గిపోతోంది. ఇంకో వైపు ధరలు రోజురోజుకు పెరగడంతో సామాన్యుడిది మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ చందంగా మారింది. ఒక్క మాటలో చెప్పాలంటే దేశ ఆర్థిక పరిస్థితులను మోడీ సర్కార్‌ గాలికి వదిలేసింది.
దేశ ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొనేందుకు, సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు తీసుకోవాల్సిన చర్యల మీద మోడీ సర్కార్‌ కేంద్రీకరించలేదు. వారు ఎంతసేపటికీ భావోద్వేగాలను పెంచే వాటి మీదనే ఎక్కుపెట్టారు. తద్వారా ప్రజల దృష్టిని పక్కదారి పట్టించి పబ్బం గడుపుకోవాలని చూశారే తప్ప నిర్దిష్ట చర్యలను మాత్రం తీసుకోలేదు. దేశ ఆర్థిక పరిస్థితులను ఎలా గటెక్కించాలి? పేద మధ్య తరగతి వర్గాలను ఆర్థిక ఇబ్బందుల నుంచి ఎలా బయటపడేయాలి అని మాత్రం ఆలోచన చేయలేదు. అనేక దేశాలు లాక్‌డౌన్‌ను దృష్టిలో ఉంచుకొని దారిద్య్రరేఖ దిగువన నివసించే వారికి నేరుగా నగదు బదిలీ చేసి వారికి కొనుగోలు శక్తిని కలిపించాయి. తద్వారా మార్కెట్‌లో డిమాండ్‌ను పెంచాయి. ఉపాధి అవకాశాలు దెబ్బ తినకుండా జాగ్రత్త పడ్డాయి. లాక్‌డౌన్‌ తరువాత అన్ని రంగాలు పుంజుకునేందుకు ప్రోత్సాహకాలు ఇచ్చాయి. మోడీ సర్కార్‌ మాత్రం ఇవేవీ పట్టించుకోలేదు. పైగా సామాన్యుడి మీద భారం వేసే పని పెట్టుకుంది. గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్‌ ధరలతోపాటు నిత్యావసర సరుకుల ధరలను పెంచి ప్రజల నడ్డివిరిచే ప్రయత్నం చేసింది. చేస్తోంది. ప్రజలు తమ మీద పడుతున్న భారాన్ని మౌనంగా భరించాలని తమ శిష్యగణంతో సామాజిక మాధ్యమాల ద్వారా సందేశాలను ఇప్పిస్తోంది. పైగా దేశం కోసం బాధలు పడాలని చెప్పే ప్రయత్నం చేస్తోంది. స్వాతంత్య్రం వచ్చాక ఇంతటి దివాలాకోరు ప్రభుత్వాన్ని దేశ ప్రజలు ఎప్పుడూ చూడలేదని చెప్పొచ్చు. సామాన్యుడు తన కష్టాలకు దేవుడి మీద భారం వేసి జీవితాన్ని గడుపుతున్నట్టు... మోడీ సర్కార్‌ తన అసమర్థతను 'దేశభక్తి' మీద వేసి పాలన కొనసాగిస్తున్నట్టు కనపడుతున్నది. ప్రజా సమస్యలను విడిచిపెట్టి .... మతం, దేశభక్తి పేరుతో ఎవరైనా కొంత కాలమే నెట్టుకురాగలరు. ఎల్లకాలం సాధ్యం కాదు. ఆకలి వేసిన వాడికి ముందు కడుపు నిండాలి. ఆ తరువాతే ఏదైనా. ఆలా కాకుండా ఆకలేస్తుంది అని సామాన్యుడు మొర పెట్టుకుంటుంటే మోడీ సర్కార్‌ జాతీయతనో, మతమనో మరొకటనో అంటుంటే ప్రజలకు పట్టడం లేదు. 'ముందు మా కడుపు నింపండి. లేదంటే చచ్చిపోతామ'ని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారి ఆర్తనాదాలు, ఆకలి కేకలు మోడీ సర్కార్‌ చెవులకు తాకడం లేదు. దీనితో వారిలో మోడీ సర్కార్‌పై ఆగ్రహం పెరుగుతోంది.


ఒక వైపు ప్రజల మీద భారం వేస్తూనే మరో వైపు ప్రభుత్వ రంగ సంస్థలను పప్పుబెల్లాలకు తమకు అనుకూలంగా ఉండే ఒకరిద్దరు బడా బాబులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎల్‌ఐసి, బ్యాంకులు, రైల్వేలతో పాటు అన్ని ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు సంస్థలకు అప్పచెప్పేందుకు సిద్ధం అయ్యిందీ సర్కారు. దీనితో ఆయా సంస్థలలో పని చేసే ఉద్యోగులలో ఆగ్రహ జ్వాలలు రగులుతున్నాయి. ఇప్పటికే మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పట్టుదలతో సుదీర్ఘ కాలంగా ఢిల్లీ సరిహద్దులలో ఆందోళన చేస్తున్న విషయం మనందరికి తెలిసిందే. మరో వైపు రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా ఫెడరల్‌ విధానాలకు తిలోదకాలు ఇస్తూ రాష్ట్రాల హక్కులను హరించేలా చట్టాలను తేవడంపై కూడా ప్రాంతీయ పార్టీలు మోడీ సర్కారుపై గుర్రుగా ఉన్నాయి. మోడీ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక అనుసరిస్తున్న విధానాలన్నీ మరింత ప్రజా వ్యతిరేకమైనవిగా ఉంటున్నాయి. దీనితో ప్రజలలో రోజురోజుకు ఆగ్రహం పెరుగుతున్నది. ఇప్పటిదాకా జాతీయత, మతం, పాకిస్తాన్‌, చైనా, రామ మందిర్‌ నిర్మాణం, కాశ్మీర్‌ సమస్య... వంటి అనేక ఉద్వేగభరిత అంశాలను ముందుకు తీసుకొచ్చి ప్రజలను భ్రమలలో ఉంచగలిగారు. కానీ ఇప్పుడు అది సాధ్యం కాదు. ఎందుకంటే ప్రజలకు వాస్తవాలు తెలుస్తున్నాయి. తమ జీవితాలలో ఎలాంటి మార్పు లేకపొగా కష్టాలు పెరిగాయి. అర్థాకలితో, పస్తులతో గడపాల్సి వస్తున్నది. దీంతో వారు వాస్తవాలను గ్రహిస్తున్నారు. అందుకు రైతుల ఆందోళన ఉదాహరణ. అలాగే త్వరలో జరిగే బెంగాల్‌, కేరళ, తమిళనాడు, అసోం, పుదుచ్చేరి రాష్ట్రాల ఎన్నికలలో కూడా బిజెపి కి ప్రతికూల ఫలితాలు రావడం ఖాయమన్న విషయం మోడీ-షా ద్వయానికి అర్థమైంది. అందుకే ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే ఒకటి రెండు చోట్ల ప్రభుత్వాలను పడగొట్టడానికి కుట్రలు చేశారు. మరోవైపు తమిళనాడులో ఎఐడిఎంకె ను లొంగదీసుకున్నారు. కేరళలో పట్టుమని పది స్థానాలయినా దక్కించుకోవాలని భావించి మాజీ ఐఏఎస్‌ అధికారులను, విశ్రాంత న్యాయమూర్తులను చేర్చుకుంటున్నారు. త్వరలో జరిగే నాలుగు రాష్ట్రాలలో బిజెపి గెలుపు అంత సులభం కాదని సర్వేలు, విశ్లేషణలు తెలియజేస్తున్నాయి. రోజు రోజుకు కేంద్ర ప్రభుత్వంపై ప్రజలలో వ్యతిరేకత పెరుగుతున్నదని, మోడీ ఇమేజ్‌ మసకబారుతున్నదని అర్థం అవుతున్నది. మోడీ బృందం అవలంబిస్తున్న విభజన, ఫిరాయింపు, అణిచివేత, నియంతృత్వ విధానాలను ప్రజలు గమనిస్తున్నారు మరి.
                                          * పి.వి. శ్రీనివాసరావు, సెల్‌:95539 55396