Nov 12,2022 00:06

నినాదాలు చేస్తున సిఐటియు, గిరిజన సంఘం నాయకులు

ప్రజాశక్తి -అరకులోయ రూరల్‌: విశాఖపట్నంలో నరేంద్ర మోడీ పర్యటనను వ్యతిరేకిస్తూ సిఐటియు, గిరిజన సంఘం ఆధ్వర్యంలో అరకులోయ నాలుగు రోడ్డు జంక్షన్‌ వద్ద రాస్తారోకో చేపట్టారు. మోడీకి వ్యతిరేకంగా గో బ్యా క్‌ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అల్లూరి జిల్లా సిఐటియు ప్రధాన కార్యదర్శి వి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, రాష్ట్రానికి ఇవ్వాల్సిన ప్రత్యేక హౌదా, రైల్వేజోన్‌, గిరిజన యూనివర్సిటీ, స్టీల్‌ ప్లాంట్‌పై బహిరంగ ప్రకటన చేయాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రా రాష్ట్రానికి తీవ్రమైన ద్రోహం చేసి ప్రభుత్వ రంగ సంస్థలైన స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ చేస్తామని గంటపదంగా చెప్పి రాష్ట్రానికి తీవ్ర మోసం చేశారన్నారు. విభజన హామీలు, ప్రత్యేక హౌదా వంటి సమస్యలపై ప్రశ్నిచవలసిన మోడీని ఆయన పర్యటనలో ఘనస్వాగతం ఎలా పలుకుతారని వైసిపి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తూ సొంత గనులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. వైసీపీ ప్రభుత్వం స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటికరణకు వ్యతిరేకమని నటిస్తూ దాని అమ్మడానికి సిద్ధపడిన నరేంద్ర మోడీని ఆహ్వానించడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం మండల కార్యదర్శి పాంగి రామన్న, కిండంగి రామారావు, సిఐటియు మండల నాయకులు వి.సింహాద్రి, దాసుబాబు, కొండలరావు తదితరులు పాల్గొన్నారు.
పాడేరు టౌన్‌: విశాఖ ఉక్కుతో పాటు ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్‌ పరం చేస్తున్న ప్రధాని మోడీకి విశాఖకు పర్యటించే హక్కు లేదని ఎఐఎస్‌ఎఫ్‌ జిల్లా కన్వీనర్‌ కె.రాజశేఖర్‌ అన్నారు. బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనను వ్యతిరేకిస్తూ శుక్రవారం అల్లూరి జిల్లా కేంద్రం పాడేరులో ఎఐఎస్‌ఎఫ్‌ నాయకుడు లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. విభజన హామీలు అమలు చేయాలని, ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ ఊరుకోమని బిజెపి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బిజెపి ప్రభుత్వ నిర్ణయాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువత, తదితరులు పాల్గొన్నారు.
రాజవొమ్మంగి:అటవీ సంరక్షణ చట్ట సవరణకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తెస్తున్న బిల్లును తక్షణమే వెనక్కు తీసుకోవాలని కోరుతూ గిరిజన సంఘం ఆధ్వర్యాన స్థానిక అల్లూరి జంక్షన్‌ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రధాని విశాఖ పర్యటన నేపథ్యంలో మోడీ గోబ్యాక్‌ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ ప్రధాని మోడీ విశాఖ పర్యటనలో అటవీ సంరక్షణ చట్టసవరణ బిల్లును ఉపసంహరించుకుంటామని, జిఒ 3 పునరుద్ధరణపైనా ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ అమ్మే నిర్ణయాన్ని వెన్నక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం మండల అద్యక్షులు కె జగన్నాథం, నాయకులు కె సూరిబాబు, కె ప్రవీణ్‌, కె దొరబాబు, గంగరాజు, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.
కూనవరం : రాష్ట్రానికి ద్రోహం చేసిన ప్రధాని మోడీ విశాఖ పర్యటనను వ్యతిరేకిస్తూ సీపీఎం అధ్వర్యంలో కూనవరంలో శుక్రవారం నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మేకల నాగేశ్వరరావు మండల కార్యదర్శి పాయం సీతారామయ్య మాట్లాడుతూ విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేయొద్దని, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, పోలవరం నిర్వాసితులకు అర్‌ అండ్‌ అర్‌ ప్యాకేజీకి కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేయాలని, జిఒ 3ను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు తాళ్లూరి శ్రీనివాస్‌, బి.బొజ్జయ్య, ఎం.బాబూరావు, ఎం.జోగయ్య, వెంకన్నబాబు, జె.వీరబాబు పాల్గొన్నారు.
హుకుంపేట:ఉద్యమ నాయకుల పై అక్రమ అరెస్టులు. సరికాదని అనంతగిరి జెడ్పిటిసి దీసరి గంగరాజు తెలిపారు. మండల కేంద్రంలో సీఐటీయూ మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక పార్టీ కార్యాలయం వద్ద మోడీ పర్యటనపై నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంధ్రాకు అన్యాయం చేసి, విశాఖకు ప్రధాని మోడీ ఎలా వస్తున్నారన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌, ప్రత్యేక హౌదాపై మోడీ ప్రకటన చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా గిరిజన మహిళ సంఘం జిల్లా నాయకులు సొంటేన హైమావతి, వైస్‌ ఎంపీపీ సుడిపల్లి కొండలరావు, సిపిఎం మండల కార్యదర్శి వి లక్ష్మణరావు, రామారావు, గన్నేరుపుట్టు మాజీ సర్పంచ్‌ సూడిపల్లి లక్ష్మీ, ప్రమీల, సీఐటీయూ నాయకులు వాసు, నారాయణ, సన్నీ బాబు, మోహన్‌రావు, గోపాల్‌, నాగేశ్వరరావు, అనిల్‌ కుమార్‌, చిరంజీవి పాల్గొన్నారు.