Jul 20,2023 21:36

సదస్సులో మాట్లాడుతున్న రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య

ప్రజాశక్తి-గుంటూరు : మోడీ దుష్ట పరిపాలన అంతమొందించటానికి రైతులు, కార్మికులు, కూలీలు ఏకం కావాలని అఖిలపక్ష రైతు సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. రైతు సమస్యలపై రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో గురువారం బ్రాడీపేటలోని గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి కంచుమాటి అజరుకుమార్‌ అధ్యక్షతన జిల్లా సదస్సు నిర్వహించారు. ఈనెల 30న విజయవాడలో జరుగుతున్న రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని సదస్సులో తీర్మానించారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య మాట్లాడుతూ నూతన వ్యవసాయ చట్టాల రద్దు, స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల అమలుకు, పంట రుణాల మాఫీ వంటి కీలక సమస్యలపై ఏడాది పాటు ఢిల్లీలో ఉద్యమం చేపట్టిన సందర్భంగా కేంద్రం ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు చేయలేదన్నారు. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో కేంద్రంపై రైతు సంఘాలన్నీ ఐక్యమై మరోమారు పోరాటానికి సిద్ధమైనట్లు చెప్పారు. మోడి అమలు చేస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక విధానాలకు రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్‌లో ఆమోదం తెలిపి, ఇక్కడికొచ్చి ప్రజలకు మాయమాటలు చెబుతున్నాయని విమర్శించారు. గతేడాది కంటే ఈ ఏడాది వ్యవసాయ ఖర్చులు 30 శాతం వరకూ పెరిగాయని, పంటలకు కనీస మద్దతు ధర మాత్రం 5 శాతం నుంచి 10 శాతమే పెంచారపి తెలిపారు. అయినా కనీస మద్దతు ధర పెంచాలని అడగలేని స్థితిలో రాష్ట్రం ప్రభుత్వం ఉందన్నారు. గతేడాది రూ.1100 కోట్లు రాష్ట్రంలో బీమా ప్రీమియం వివిధ కార్పొరేట్‌ కంపెనీలకు వెళ్లిందని, కానీ తిరిగి రైతులకు వచ్చింది రూ.300 కోట్లేనని తెలిపారు. రూ.300 పురుగుమందు డబ్బాలు రూ.3 వేలకు అమ్ముతుంటే పట్టించుకునే వారే లేరన్నారు. విత్తన, పురుగుమందు, ఎరువుల చట్టాలు పట్టిష్టంగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. జగన్‌ ప్రభుత్వంలో 6500 రైతు ఆత్మహత్యలు జరిగాయని, రైతు ప్రభుత్వం అంటే ఇదేనా అని ప్రశ్నించారు. సహకార రంగాన్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే చర్యలు చేపటారని విమర్శించారు. ఈనేపథ్యంలో వ్యవసాయ రంగాన్ని రక్షించుకోవటానికి రైతుల్ని చైతన్యం చేయాలని పిలుపునిచ్చారు. కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య మాట్లాడుతూ కేరళ తరహ రుణ ఉపశమన చట్టాన్ని పార్లమెంట్‌లో ఆమోదించి రైతులు ఆత్మహత్యలను అరికట్టాలన్నారు. నూటికి 60 శాతం పైగా ఉన్న కౌలులు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మొండిచేయి చూపించిందన్నారు. భూ యజమాని సంతకం, అనుమతి కావాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ప్రకారం ఎక్కడా కూడా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, బ్యాంకు రుణాలు, సబ్సిడీలు అందించలేదన్నారు.
తెలుగు రైతు రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి టి.లక్ష్మణారెడ్డి మాట్లాడుతూ సాగు చేస్తున్న నేడు రైతులకు అనుగుణంగా పండిన పంటలకు ధరలు ఉండటం లేదన్నారు. విపత్కర పరిస్థితిలో వాతావరణ అనుకూలించని పరిస్థితుల్లో రకరకాల వైరస్లతో పంటలు దెబ్బతింటున్నాయన్నారు. చివరకు మార్కెట్‌ దోపిడి తోటి రైతులు నష్టపోతున్నారన్నారు. కిసాన్‌ క్రాంతి సంఘర్ష సంఘం రాష్ట్ర కార్యదర్శి మన్నవ హరిప్రసాద్‌ మాట్లాడుతూ సహకార రంగాలను దెబ్బతీసే విధంగా రాష్ట్రాల హక్కులను హరించేలా సహకార రంగాలను కేంద్ర ప్రభుత్వంలో స్వాధీనం చేసుకుందన్నారు. గ్రామాలకు పట్టుకొమ్మలైన సహకారంగాలను ప్రైవేటు కార్పొరేట్‌ కంపెనీలకు ధారాదత్తం చేస్తున్నారని విమర్శించారు. సదస్సులో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు, ఆల్‌ ఇండియా కిసాన్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర కార్యదర్శి టి.శివయ్య, శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ టి.వేణుగోపాలరావు మాట్లాడారు. సదస్సులో కొండవీటి వాగు ముంపు గురవుతున్న పంట భూములు కాపాడాలని, గుంటూరు ఛానల్‌ పొడిగింపునకు వెంటనే నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని, మన సహకార డెయిరీలను గుజరాత్‌ అమూల్‌ డైరీ నుండి కాపాడాలని, కార్మిక హక్కులను హరించే నాలుగు లేబర్‌ కోడలు రద్దు చేయాలని తదితర తీర్మానాలు ఆమోదించారు. సదస్సులో ఛానల్‌ విస్తరణ ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు కుర్రా హరిబాబు, ఆచార్యులు, వివిధ సంఘాల నాయకులు పి.శివాజీ, కె.రాజశేఖర్‌ రెడ్డి, పోతురాజు, వి.నరసింహారావు, జె.శివశంకర్‌, కె.రంగారెడ్డి, కార్మిక, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.