మోడీ దుష్పరిపాలన నుండి రైతాంగాన్ని ,శ్రామికులను కాపాడండి.
- కార్మిక ,కర్షక రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి.
- ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, సిఐటియు పిలుపు.
ప్రజాశక్తి - చాగలమర్రి
ఈ నెల 30వ తేదీన విజయవాడలోని పి.బి సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో జరగబోవు కర్షక, కార్మిక రాష్ట్ర సదస్సులో ఆళ్లగడ్డ నియోజకవర్గం లోని రైతులు కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి టి రామచంద్రుడు, జిల్లా నాయకులు సురేష్, ఈ . మహబూబ్ భాష సంయుక్త ప్రకటన ద్వారా చాగలమర్రిలో జరిగిన సమావేశంలో పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల రైతాంగానికి, కార్మికులకు వ్యవసాయ కార్మికులకు తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. భారత వ్యవసాయానికి, రైతాంగానికి తీవ్రమైన హాని కలిగించే మూడు నల్ల వ్యవసాయ చట్టాలను మరియు ఎలక్ట్రిసిటీ బిల్లు 2020 ని రద్దు చేయాలని, అన్ని పంటలకు కనీసం మద్దతు ధర డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సు చేసిన విధంగా నిర్ణయించి చట్టబద్ధత చేయాలని , దేశవ్యాప్తంగా పెరుగుతున్న రైతాంగ ఆత్మహత్యలను అరికట్టుటకు పంట రుణాలన్నింటినీ రద్దుచేసి, కేరళ తరహ రైతు రుణ ఉపశమన చట్టం పార్లమెంటులో తీసుకురావాలని కోరుతూ దేశంలోని 500 రైతు సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చాగా ఏర్పడి ఆందోళన చేపడతామని తెలిపారు. అలాగే లక్షలాది కార్మికులు దశాబ్దాల పాటు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి కార్మిక హక్కులకు ప్రయోజనాలను కాలరాశి నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని దేశంలోని కేంద్ర ట్రేడ్ యూనియన్లు సంయుక్త వేదిక నేర్పరుచుకున్నాయన్నారు. పై రెండు కార్మిక కర్షక సంఘాల ఆధ్వర్యంలో తమ హక్కుల కోసం గతంలో ఢిల్లీలో 387 రోజులపాటు ఆందోళన చేసిన ఫలితంగా ప్రధానమంత్రి మోడీ గారు దిగివచ్చి తప్పయింది క్షమించండి , మీ హామీ మీ కోరికలనుంటిని తీరుస్తానని లిఖితపూర్వకమైన హామీ ఇచ్చి మాట తప్పినాడు. అందువల్లనే మళ్లీ ఢిల్లీ తరహా దేశవ్యాప్త ఉద్యమాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని, అందులో భాగంగానే మన రాష్ట్రంలో ఈనెల 30వ తేదీన విజయవాడ లో కర్షక కార్మిక రాష్ట్ర సదస్సును నిర్వహిస్తున్నామన్నారు. ఈ సదస్సులో అఖిలభారత రైతు సంఘాల,కార్మిక సంఘాల నాయకులు ప్రసంగిస్తారని భవిష్యత్ పోరాట ప్రణాళికను రూపొందిస్తారని తెలిపారు. కావున మన ఆళ్లగడ్డ నియోజకవర్గం లోని రైతులు కూలీలు కార్మికులు అందరూ రాష్ట్ర సదస్సులో పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు.










