Jul 26,2023 21:37

సదస్సులో మాట్లాడుతున్న సమితి రాష్ట్ర నాయకులు మర్రాపు సూర్యనారాయణ

ప్రజాశక్తి- కలెక్టరేట్‌ : మోడీ దుష్పరిపాలన నుంచి రైతులను, శ్రామికులను కాపాడుకోవాలని రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర నాయకులు మర్రాపు సూర్యనారాయణ అన్నారు. రైతులకు నష్టం కలిగించే 3 వ్యవసాయ చట్టాల రద్దుకు మోడీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 30న విజయవాడలో జరుగు రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈనేపథ్యంలో జిల్లా సదస్సు బుధవారం స్థానిక ఎన్‌జిఒ హోంలో జరిగింది. రైతు సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి లక్ష్మునాయుడు, ఆర్‌సిఎస్‌ జిల్లా సహాయ కార్యదర్శి పి.శ్రీను నాయుడు, ఎఐకెఎంఎస్‌ జిల్లా కార్యదర్శి పి.రమణి, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఇవి నాయుడు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన సూర్యనారాయణ మాట్లాడుతూ భారత వ్యవసాయ రైతంగానికి తీవ్రమైన హాని కలిగించే మూడు నల్ల వ్యవసాయ చట్టాలను, విద్యుత్‌ సంస్కరణ బిల్లు 2020ను రద్దు చేయాలని అన్నారు. పంటలన్నింటికీ డాక్టర్‌ స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సు చేసిన విధంగా సమగ్ర పంట ఉత్పత్తికి 50 శాతం కలిపి చట్టబద్ధ ఎంఎస్‌పి నిర్ణయించాలని డిమాండ్‌ చేశారు. దేశవ్యాప్తంగా 500 పైగా రైతు సంఘాలతో ఏర్పడ్డ సంయుక్త కిసాన్‌ మోర్చా నేతృత్వంలో సంవత్సరం పైగా పోరాటం కొనసాగించినా లెక్క చేయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ , ఉత్తర ప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు క్షమాపణ చెప్పి రైతుల డిమాండ్లను సానుకూలంగా పరిష్కరిస్తానని రైతులతో చర్చించిన తర్వాతే పార్లమెంట్లో ప్రవేశపెడతామని లిఖితపూర్వక హామీ ఇచ్చినప్పటికీ నేటికీ అమలు చేయలేదని అన్నారు. ఈనేపథ్యంలో రెండో దశ ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. అందులో భాగంగా ఈనెల 30న విజయవాడలో పిబి సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో కర్షకుకార్మిక రాష్ట్ర సదస్సు జరుగుతుందని, ఈ సదస్సులో భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. రైతులు ,కార్మికులు పెద్ద ఎత్తున హాజరుకావాలని కోరారు. సదస్సులో దంతల్లూరి వర్మ, బుడితి అప్పలనాయుడు, బొత్స నరసింగరావు, పి.భాస్కరరావు తదితరులు ప్రస్తుత కాలంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వ్యవసాయం ప్రస్తుత పరిణామాలపై మాట్లాడారు. కార్యక్రమంలో సుంకి గ్రామ సర్పంచ్‌ రవీంద్ర, వెలమల సత్యనారాయణ, ఎం. భాస్కరరావు, ఎస్‌.విశ్వేశ్వరరావు, ముత్యాలు, పి.సంగం వావిలపల్లి రమణమూర్తి, రైతులు తదితరులు పాల్గొన్నారు.
కిసాన్‌మోర్చా జిల్లా కన్వీనర్‌గా బంటు దాసు
సంయుక్త కిసాన్‌ మోర్చా జిల్లా కమిటీని సదస్సు లో ఎన్నుకు న్నారు. జిల్లా కన్వీనర్‌ గా బంటు దాసు, సమ న్వయ సమితి సభ్యు లుగా డి.వర్మ, బుడితి అప్పల నాయుడు, బొత్స నర్సింగ రావు, కృష్ణ, వివిధ సంఘా లకు చెందిన నాయ కులు ఎన్నికయ్యారు.