Aug 28,2023 21:14

కడప సిపిఎం పార్టీ కార్యాలయంలో అమర వీరులకు నివాళులర్పిస్తున్న నాయకులు

కడప అర్బన్‌ : మోడీ డైరెక్షన్‌లోనే జగన్‌ ప్రజలపై భారాలు మోపుతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్‌ విమర్శించారు. సోమవారం పాత బస్టాండ్‌ లోని సిపిఎం జిల్లా కార్యాలయంలో సిపిఎం నగర కార్యదర్శి కామ్రేడ్‌ ఎ.రామ్మోహన్‌ అధ్యక్షతన ' విద్యుత్‌ పోరాట మతవీరుల 23వ సంస్మరణ సభ' నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ 2000 సంవత్సరం ఆగస్టు 28న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లోని బషీర్‌బాగ్‌లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్‌ ఛార్జీలను నిరసిస్తూ ప్రపంచ బ్యాంకు సంస్కరణలు వద్దు అంటూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో చేసిన ఉద్యమంలో కామ్రేడ్‌ రామకష్ణ, కామ్రేడ్‌ విష్ణువర్ధన్‌ రెడ్డి, కామ్రేడ్‌ బాలస్వామి అమరులయ్యారని చెప్పారు. అప్పటల్లో ప్రతిపక్షంలో ఉన్న వైసిపి ఈ ఉద్యమానికి మద్దతు తెలిపారని పేర్కొన్నారు. నాటి అసెంబ్లీలో, నాటి పాలకులను నిలదీశారని, ప్రపంచ బ్యాంకు సంస్కరణలను, విద్యుత్‌ ఛార్జీల పెంపును వ్యతిరేకించారని చెప్పారు. వైసిపి వారసుడైన వై.ఎస్‌. జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం, మోడీ డైరెక్షన్‌లోనే జగన్‌ ప్రజలపై భారాలు మోపుతున్నారని విమర్శించారు. సిఎం జగన్మోహన్‌ రెడ్డి అహంకారం, ఆధిపత్యం, హింస వైసిపి ప్రభుత్వ ప్రత్యేకతలుగా ఉన్నాయని ఎద్దేవ చేశారు. నేడు ఆంధ్ర రాష్ట్రంలో విద్యుత్‌ బిల్లుల మోతతో ప్రజలకు షాక్‌ కొట్టిస్తున్న ప్రభుత్వ విధానాలపై మరో మారు 'ప్రజా సమర పోరు' చేయాల్సిన అవసరం ఉందన్నారు. సిపిఐ సీనియర్‌ నాయకులు కష్ణమూర్తి సిపిఐ కడప నగర కార్యదర్శి వెంకట శివ మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం విద్యుత్‌ ఛార్జీలు తగ్గించకపోగా నూరు శాతం పెంచిన నేపథ్యంలో జరుగుతున్న విద్యుత్‌ అమరవీరుల సంస్మరణ సభ భవిష్యత్‌ కార్యాచరణ బాధ్యత ఎక్కువగా ఉందని చెప్పారు. సిపిఐ (ఎం.ఎల్‌) న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి డబ్ల్యూ.రాము మాట్లాడుతూ విద్యుత్‌ చార్జీలను తగ్గించే వరకు ఐక్యంగా పోరాటాల ద్వారా ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని అన్నారు. సిపిఐ.(ఎం.ఎల్‌) లిబరేషన్‌ జిల్లా కార్యదర్శి రమణయ్య, మాట్లాడుతూ అసలు విద్యుత్‌ ఛార్జీల కన్నా, కొసరు ఎక్కువగా ఉన్నాయని విమర్శించారు. కార్యక్రమంలో సిపిఐ (ఎం.ఎల్‌) న్యూ డెమోక్రసీ- 2 జిల్లా కార్యదర్శి అంకన్న, ఆర్‌సిపి జిల్లా కార్యదర్శి సుబ్బరాయుడు, ఫార్వర్డ్‌ బ్లాక్‌ జిల్లా కార్యదర్శి జయవర్ధన్‌, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దస్తగిరి రెడ్డి, సుబ్బయ్య, తార, సిపిఐ జిల్లా నాయకురాలు భాగ్యమ్మ, వామపక్షాల కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రజాశక్తి - జమ్మలమడుగు
కరెంటు బిల్లుల మోతతో ప్రజలకు షాక్‌ కొట్టిస్తున్న ప్రభుత్వ విధానాలు సరైనవి కావని సిఐటియు జమ్మలమడుగు పట్టణ కార్యదర్శి దాసరి విజరు పేర్కొన్నారు. బషీర్‌బాగ్‌ ఉద్యమంలో అమరులైన కామ్రేడ్‌ రామకృష్ణ, కామ్రేడ్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, కామ్రేడ్‌ బాలస్వామి 23వ సంస్మరణ సభను సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా విజరు మాట్లాడుతూ 2000 సంవత్సరం ఆగస్టు 28న ప్రపంచ బ్యాంకు సంస్కరణను వ్యతిరేకిస్తూ, పెంచిన విద్యుత్‌ ఛార్జీలు తగ్గించాలంటూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైదరాబాదు నడి ఒడ్డయిన బషీర్‌బాగ్‌లో రాష్ట్ర ప్రజలు ప్రజా నిరసన శాంతియుతంగా చేస్తుంటే, నాటి పాలకులు ప్రజలపై భాష్పావాయువు ప్రయోగించడం, గుర్రాలతో తన్నించడం, లాఠీలతో బాధడం, కాల్పులు జరపడంతో వామపక్ష కార్యకర్తలు మరణించారన్నారు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్‌ఆర్‌ ఈ ఉద్యమానికి మద్దతు తెలిపారని, నాటి అసెంబ్లీలో, నాటి పాలకులను నిలదీశారని తెలిపారు. ప్రపంచ బ్యాంకు సంస్కరణలను, విద్యుత్‌ ఛార్జీల పెంపును వ్యతిరేకించారని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వ విధానాలపై మరో మారు 'ప్రజా సమర పోరు' చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో సిఐటియు అనుబంధం మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు శేఖర్‌, నాగన్న, శివన్న, ఆటో వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు ప్రసాద్‌రెడ్డి, సిఐటియు నాయకులు మోషే, మన్సూర్‌, భీమ, రాజు, దివాకర్‌ పాల్గొన్నారు.