సమావేశంలో ఆమోదించిన తీర్మానంలో తీసుకున్న వైఖరి ప్రకారం...మతోన్మాద ధోరణులను సృష్టించడం, హిందూ జాతీయవాదాన్ని రెచ్చగొట్టడం ద్వారా ఓట్లను రాబట్టుకోవాలన్న సూత్రం పైనే బిజెపి ప్రధానంగా ఆధార పడిందని స్పష్టమవుతోంది. తను గతంలో ప్రయత్నించి, పరీక్షించిన ఫార్ములానే ఇది. దీనికి తోడు పెద్ద ఎత్తున డబ్బు గుమ్మరించడం, యు.పి వంటి చోట్ల కుల, సామాజిక సమీకరణలను ఉపయోగించడం ఎటూ వుండనే వున్నాయి.
భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయ కార్యవర్గ సమావేశం నవంబరు 7వ తేదీన జరిగింది. రెండేళ్ళ తర్వాత జరుగుతున్న సమావేశం కావడంతో దేశంలోని రాజకీయ పరిణామాలను, కోవిడ్ సంక్షోభ కాలంలో పని తీరును కేంద్రంలోని పాలక పార్టీ ఏ విధంగా సమీక్షిస్తుందో తెలుసుకోవాలనే ఆసక్తి నెలకొంది. అయితే, ప్రభుత్వ పని తీరుపై, అనుసరించిన విధానాలపై నిష్పాక్షికంగా సమీక్ష జరుగుతుందని ఎవరైనా భావించినట్లైతే వారు కచ్చితంగా నిరాశ చెందుతారు. అధ్యక్షుని ప్రసంగం, రాజకీయ తీర్మానం, మోడీ ముగింపు ఉపన్యాసం...వీటిన్నింటిని చూసినట్లైతే ఒక్క పిసరైనా ఆత్మ విమర్శనాత్మక ధోరణి లేదని అర్ధమవుతోంది.
ప్రధాని మోడీ విధానాలను, కోవిడ్‌ను ఎదుర్కొనడం, ఆరోగ్య సంరక్షణ అందించడం, ఉపాధి, ఉచిత రేషన్ అందించడంతో సహా అన్ని రంగాల్లో మోడీ ప్రభుత్వం సాధించిన విజయాలను స్తుతించడమే రాజకీయ తీర్మానంగా వుంది. తీర్మానంలోని ప్రతి పేరా మోడీ చేపట్టిన విధానపరమైన చొరవలను పొగడ్తల్లో ముంచెత్తింది. మొత్తమ్మీద, మోడీ పట్ల విధేయతను ప్రదర్శించే కార్యక్రమంగా వుండిపోయింది.
పార్టీపై మోడీ ఆధిపత్యం ఏ మేరకు వుందో పూర్తి స్థాయిలో ప్రదర్శితమైంది. కోవిడ్‌ను ఎదుర్కొనడంలో మోడీ ప్రభుత్వం చేసిన మంచి పని అంటూ... వ్యాక్సినేషన్ డ్రైవ్ కోసం రూ.35 వేల కోట్లు కేటాయించడం, ఎనిమిది మాసాల పాటు 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు అందించడం, ఆరోగ్య బీమా పథకం వంటి వాటిని ప్రస్తావించారు. వంద కోట్ల మందికి టీకాలు పూర్తయిన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున పండుగలా జరుపుకున్నారు. కానీ, యువతలో కేవలం 30 శాతం మందికి మాత్రమే పూర్తిగా వ్యాక్సిన్ డోసులు అందాయన్న విషయాన్ని కనీసం ప్రస్తావించను కూడా లేదు. పైగా, ప్రస్తుతం వున్న వ్యాక్సినేషన్ రేటును చూసినట్లైతే 2021 నాటికల్లా యువతకు పూర్తిగా వ్యాక్సిన్ వేయాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరేలా కనిపించడం లేదు. కోవిడ్‌తో లక్షలాదిమంది మరణించారు. వారి గురించి సానుభూతి వచనం ఒక్కటి లేదు. వ్యాక్సిన్ నిల్వలను సేకరించడంలో జరుగుతున్న అవకతవకలు, ఆరోగ్య సంరక్షణా సదుపాయాలు, ఆక్సిజన్ కొరవడడం గురించి కానీ, కోవిడ్‌తో తీవ్రంగా అస్వస్థతకు గురైనవారి గురించి కానీ ఒక్క మాట లేదు. ఇక ఎదుర్కొనాల్సిన ఆర్థిక సమస్యలను గురించి చెప్పనక్కరలేదు. రైతాంగం సుదీర్ఘ కాలంగా సాగిస్తున్న పోరాటాన్ని అస్సలు ప్రస్తావించనే లేదు. అందుకు బదులుగా, ప్రభుత్వం చేపట్టిన రైతు అనుకూల చర్యలన్నింటినీ ఏకరవు పెట్టారు. ఇక ఉపాధికి సంబంధించి చూసినట్లైతే డిజిటలీకరణ, స్టార్టప్‌లను ప్రభుత్వం పెంచి పోషిస్తున్న కారణంగా ''యువత ఉపాధిని కోరేవారుగా కన్నా ఇచ్చేవారుగా మారుతున్నారు'' అని పేర్కొన్నారు.
370వ అధికరణను రద్దు చేసిన తర్వాత, జమ్మూ కాశ్మీర్‌లో శాంతి భద్రతలు, అభివృద్ధికి సంబంధించి కొత్త అధ్యాయం ఆవిష్కృతమైందని బిజెపి పేర్కొంది. అంతేకానీ వేలాదిమందిని ఖైదు చేయడంతో అక్కడ శ్మశాన ప్రశాంతత నెలకొందని, ఇంటర్‌నెట్ నిలిపివేయబడిందని, కదలికలపై నిషేధం విధించారని ఒక్కసారి కూడా ప్రస్తావించలేదు.
ఇక ఆత్మస్తుతి అసంబద్ధ స్థాయికి చేరింది. వాతావరణ మార్పులను ఎలా ఎదుర్కొనాలో మోడీ ప్రపంచానికి దారి చూపించారని, మోడీ నాయకత్వంలో అనుసరిస్తున్న విదేశాంగ విధానంతో భారత్ కేవలం సంతులన శక్తిగా మాత్రమే కాకుండా, ప్రపంచంలోనే అతి పెద్ద శక్తిగా ఆవిర్భవించేందుకు కృషి చేస్తోందని సమావేశంలో పేర్కొన్నారు.
ప్రజల ఇబ్బందుల పట్ల నిర్లక్ష్యపూరిత ధోరణి, గత రెండేళ్ళ కాలంలో ప్రభుత్వ లొసుగులు, లోపాల గురించి ఉద్దేశ్యపూర్వకంగానే విస్మరించడం చూస్తుంటే ఒక విషయం స్పష్టమవుతోంది. నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం, ధరల పెరుగుదల, ప్రజల ఆర్థిక ఇబ్బందులు వంటి సమస్యలు త్వరలో ఐదు రాష్ట్రాల్లో ( ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్‌లో ) జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అవకాశాలను దెబ్బ తీస్తాయని బిజెపి ఏమాత్రం ఆందోళన చెందడం లేదు. ఈ ఐదు రాష్ట్రాల్లో నాలుగు చోట్ల బిజెపి ప్రభుత్వాలే వున్నాయి.
సమావేశంలో ఆమోదించిన తీర్మానంలో తీసుకున్న వైఖరి ప్రకారం... మతోన్మాద ధోరణులను సృష్టించడం, హిందూ జాతీయవాదాన్ని రెచ్చగొట్టడం ద్వారా ఓట్లను రాబట్టుకోవాలన్న సూత్రం పైనే బిజెపి ప్రధానంగా ఆధారపడిందని స్పష్టమవుతోంది. తను గతంలో ప్రయత్నించి, పరీక్షించిన ఫార్ములానే ఇది. దీనికి తోడు పెద్ద ఎత్తున డబ్బు గుమ్మరించడం, యు.పి వంటి చోట్ల కుల, సామాజిక సమీకరణలను ఉపయోగించడం ఎటూ వుండనే వున్నాయి. సమావేశంలో యోగి ఆదిత్యనాథ్ ప్రతిపాదించిన రాజకీయ తీర్మానం చూస్తే యు.పి ఎన్నికల్లో ప్రధానంగా దేనిపై దృష్టి పెట్టనున్నారనేది స్పష్టంగా తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో రేషన్ పొందడానికి ముస్లింలకు ప్రాధాన్యత ఇవ్వబడిందంటూ కైరానా నుండి హిందూ కుటుంబాలు వలస వెళ్ళిపోవడం గురించి ఆదిత్యనాథ్ ఇప్పటికే మతోన్మాదాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. 2017లో కూడా ఇదే అంశాన్ని లేవనెత్తారు.
అయితే, ఇటీవల ఉప ఎన్నికలు జరిగిన మూడు లోక్‌సభ, 29 అసెంబ్లీ స్థానాల ఫలితాలను ఘన విజయంగా బిజెపి తీర్మానం పేర్కొంటున్నప్పటికీ నాయకత్వం ఆలోచించాల్సిన అంశం ఒకటుంది. కుల మతాలను వర్గీకరించే, రెచ్చగొట్టే తమ ఫార్ములా సాధించే విజయంపైనే పూర్తిగా ఆధారపడవచ్చా లేదా అని బిజెపి నాయకత్వం ఆలోచించేలా చేసింది. అస్సాంను, కొంతమేరకు మధ్యప్రదేశ్‌ను మినహాయిస్తే హిమాచల్‌ప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, కర్నాటకల్లో తన పని తీరు పట్ల బిజెపి ఆందోళన చెందాల్సిన అవసరముంది.
జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రదర్శితమైన అభిప్రాయానికి భిన్నంగా...ఉప ఎన్నికల్లో ప్రజల అసంతృప్తి, ఆగ్రహం ప్రదర్శితమయ్యాయి.
/'పీపుల్స్ డెమోక్రసీ' సంపాదకీయం/










