కరోనా ఇబ్బందుల్ని అధిగమించి మన దేశ ఆర్థిక వ్యవస్థ దూసుకుపోతోందని, 'వి' ఆకారపు రికవరీ బాటలో ముందుకు సాగుతున్నామని ఆర్థిక మంత్రి చెప్పిన బడాయిలు, వంత పలికిన అధికార పక్ష మేధావుల మాటలు వొట్టివేనని తేలిపోయింది. గత ఏడు నెలల కనిష్టానికి పారిశ్రామిక ఉత్పత్తి పడిపోయిందని తాజా గణాంకాలు తేల్చిచెప్పాయి. దీనికి తోడు నిరుద్యోగం, అధిక ధరలు, ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి.
పారిశ్రామిక రంగంలో సంక్షోభానికి కారణం ఉత్పత్తి అయిన వస్తువులకు మార్కెట్‌లో సరైన డిమాండ్ లేకపోవడమే. గిరాకీ పడిపోవడానికి ప్రజల చేతిలో కొనుగోలు శక్తి పడిపోవడమే. కారణం. ఇదంతా ఒక వలయం లాంటిది. ఈ పరిస్థితుల్లో ప్రజల పట్ల బాధ్యత వహించే ఏ ప్రభుత్వమైనా మొట్టమొదట చేయాల్సింది ప్రజల కొనుగోలు శక్తిని పెంచేలా చర్యలు చేపట్టడం. ఈ పని చేయడానికి మోడీ ప్రభుత్వం మొదటి నుంచి మొండిగా నిరాకరిస్తూ వస్తున్నది. ప్రజలకు నేరుగా నగదు బదిలీ, కనీస వేతనం పెంపు, నిరుద్యోగ భృతి, నరేగా మాదిరే పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీని ప్రవేశపెట్టడం, ఉచితంగా విద్య, వైద్య సదుపాయాలు అందించడం, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అర్హులైనవారందరికీ ఆహార ధాన్యాలతో సహా 16 రకాల నిత్యావసరాలు సరఫరా చేయడం వంటి చర్యలు చేపట్టాలన్న ప్రతిపక్షాల సూచనలను బేఖాతరు చేస్తున్నది. చతికిలపడ్డ ఆర్థిక వ్యవస్థకు తిరిగి జవసత్వాలు కల్పించాలంటే ప్రభుత్వ వ్యయాన్ని పెంచడమొక్కటే మార్గం. ప్రభుత్వ వ్యయం పెంచడానికి అంతర్జాతీయ ఫైనాన్స్ పెట్టుబడి ఎంతమాత్రమూ ఒప్పుకోదు. ఫైనాన్స్ పెట్టుబడి గీచిన గీతను దాటే ధైర్యం మోడీ ప్రభుత్వానికీ లేదు. ఈ పని చేయడానికి బదులు బడా పెట్టుబడిదారులకు పన్నుల్లో రాయితీలు ఇస్తే, దేశంలోకి పెట్టుబడులు పోటెత్తుతాయని, తద్వారా ఆర్థిక వ్యవస్థ కొత్త పుంతలు తొక్కుతుందనే వింత వాదనను మోడీ ప్రభుత్వం ముందుకు తెస్తోంది. ఇది ఎంత పనికిమాలిన వాదనో అమర్త్య సేన్, ప్రభాత్ పట్నాయక్ వంటి ప్రముఖ ఆర్థికవేత్తలు ఇప్పటికే తేల్చి చెప్పేశారు. ప్రస్తుత పరిణామాలు కూడా దీనినే ధ్రువీకరిస్తున్నాయి. బడా కార్పొరేట్లకు యేటా లక్షల కోట్ల రూపాయలు కేవలం పన్ను రాయితీల రూపంలో ప్రభుత్వం ఇస్తున్నది. ఈ లోటును భర్తీ చేసుకోవడానికి ప్రజలపై పరోక్ష పన్నుల రూపంలోను, పెట్రో ఉత్పత్తులపై ఎడాపెడా పన్నులు వేయడం ద్వారా రాబట్టుకుంటున్నది. కార్పొరేట్లకు ఎన్ని రాయితీలు ఇచ్చినా ఈ కాలంలో పెట్టుబడులు తగ్గడమే తప్ప పెరగడం లేదు. కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు పెట్టుబడిదారులు ఉత్సాహం చూపకపోవడానికి కారణం సరుకులకు గిరాకీ లేకపోవడమే. ఈ వాస్తవాన్ని అంగీకరించేందుకు ప్రభుత్వం నిరాకరిస్తున్నది.
ప్రభుత్వ వ్యయాన్ని పెంచడానికి అవసరమైన అదనపు వనరుల సమీకరణ పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలను గుండుగుత్తగా అమ్మకానికి పెట్టింది. ప్రతి రోజూ బంగారు గుడ్డు పెట్టే బాతును కోసేస్తే, ఇంకా ఎక్కువ బంగారం ఒకేసారి పొందవచ్చునన్న తెలివితక్కువ దురాశ ఇది.
ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంలోనే కాదు, కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలోనూ ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. కరోనా బారిన పడి లక్షా యాభై వేల మంది చనిపోతే మోడీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు. కరోనా కేసుల్లో ప్రపంచంలో రెండో స్థానంలోను, మరణాల్లో మూడవ స్థానంలోను నిలవడం ద్వారా భారత్ రికార్డు సృష్టించింది. మండుటెండల్లో వలస కార్మికులు వేల కిలోమీటర్లు కాలినడకన ప్రయాణం సాగిస్తూ మార్గ మధ్యంలో తనువు చాలించిన హృదయ విదారక దృశ్యాలు మన దేశంలో తప్ప ప్రపంచంలో ఎక్కడా కానరావు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో దారుణమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిన మోడీ ప్రభుత్వం, కరోనా దెబ్బకు ఉపాధి కోల్పోయి కష్టాల్లో ఉన్న పేదలు, వలస కార్మికులు, మహిళల విషయంలోనూ ఇదే తీరున వ్యవహరించింది. 'ఆత్మ నిర్భర్ భారత్' పేరుతో ప్రకటించిన ప్యాకేజీలో సామాన్యులకు ఆవ గింజంత సాయం కూడా దక్కలేదు..కరోనా లాక్‌డౌన్ కాలంలో ఒక వైపు 12.5 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోతే, మరో వైపు దేశంలోని వంద మంది కుబేరుల వద్ద సంపద 13 లక్షల కోట్ల మేర పెరిగింది. దేశంలో పేదలు మరింత పేదలుగాను, సంపన్నులు మరింత సంపన్నులుగా మారడానికి కారణమైన మోడీ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్పాలి.










