Jul 24,2023 21:10

నగరంలో ర్యాలీ నిర్వహిస్తున్న మహిళలు

కడప అర్బన్‌ : మణిపూర్‌లో మహిళల మాన, ప్రాణాలకు రక్షణ కల్పించలేని మోడీ, అమిత్‌షా తక్షణమే రాజీనామా చేయాలని అఖిల పక్ష నేతలు డిమాండ్‌ చేశారు. సోమవారం నగరంలో అఖిల పక్ష పార్టీలు, మహిళా సంఘాలు చేపట్టిన నిరసన తెలియజేశారు. బాబు బారు నేతత్వంలో అల్మాస్‌ పేట నుంచి ఏడు రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మణి పూర్‌ మారణ హోమాన్ని కారకులైన బిజెపి ప్రభుత్వం మేయితీలను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఆదేశాలు జారీ చేసిందన్నారు. దీని వల్ల కుకీ తెగకు చెందిన గిరిజనలు అభద్రత భావానికి గురై తమ భూములను, రిజర్వేషన్లను మేయితల చేతికి వెళ్లిపో వటానికి నిరసిస్తూ ట్రైబల్‌ సోల్జారిటీ మార్చ్‌ పేరిట మెటీలకు ఇచ్చిన ఎస్టీ రిజర్వేషన్‌ రద్దు చేయాలని ర్యాలీ నిర్వహించారని పేర్కొన్నారు. ఇలా రెండు తెగలకు మధ్య మొదలైన ఘర్షణ 270 గ్రామా లను, 3,400 పై ఇళ్లను అగ్నిహోమంగా మార్చి ధ్వంసం చేశారని చెప్పారు. వేలాది మందిని హతమార్చుతుంటే ప్రపంచ ప్రఖ్యాతి చెందిన క్రీడాకారులు, రాజ్యసభ మెంబర్‌ అయిన మేరీ కోమ్‌ తమ ట్విట్టర్‌లో దేశ ప్రధాని మోడీకి, హోమ్‌ మంత్రి అమిత్‌షాని ట్యాగ్‌ చేసినా మణిపూర్‌ రాష్ట్రం తగలబడిపోతుంది కాపాడండి అని మొర పెట్టుకున్నారని పేర్కొన్నారు. అయినా నరేంద్ర మోడీ మౌనం వహించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా నరేంద్ర మోడీ మౌనం పట్ల మణిపూర్‌ ప్రజలు దిగ్భ్రాంతికి గురవుతూ కనీసం జూన్‌ 18న మన్‌ కీ బాత్‌ ప్రసా రంలో మణిపూర్‌ మారనకాండం గురించి ప్రస్తా వన లేదని వాపోయారు. 550 పౌర సమాజ బం దాలు, ప్రజా ప్రతినిధులు, రచయితలు కలిసి విచ్చిన్నకర రాజకీయాలకు తావు లేకుండా దేశ ప్రధాని నరేంద్ర మోడీ మౌనం వీడాలని డిమాండ్‌ చేశారు. మోడీ మణిపూర్‌ గురించి పట్టిం చుకోకపోగా అమెరికా పర్యటనకు వెళ్లడం సిగ్గు చేటు అన్నారు. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్య దర్శి వర్గ సభ్యులు జి. ఈశ్వరయ్య, జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, తెలుగుదేశం అమీర్‌ బాబు, కార్పొరేటర్‌ ఉమాదేవి, వైసిపి అహ్మద్‌ బాషా, సిపిఎం నగర కార్యదర్శి రామ్మోహన్‌, కాంగ్రెస్‌ సత్తారు, ఏపీ మహిళా సమాఖ్య బస్సురునిసా, ఐద్వా జిల్లా అధ్యక్షులు ఐ. ఎన్‌. సుబ్బమ్మ, మహిళా నేతలు పర్వీన్‌, సిపిఐ నగర కార్యదర్శి ఎన్‌ వెంకట శివ, ఎఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి వలరాజు, నగర కన్వీనర్‌ మైనుద్దీన్‌, వైయస్సార్సీపి సుభాన్‌ బాషా, షఫీ, మహిళలు విద్యార్థులు పాల్గొన్నారు.