Feb 18,2022 06:53

నరేంద్ర మోడీ సర్కార్‌ అధికారానికి వచ్చిన ఏడాది అంటే... 2014 మార్చి ఆఖరుకు ఉన్న అప్పు రూ.53,11,980 కోట్లు. ఎనిమిది సంవత్సరాల్లో కొత్త అప్పులు రూ.99,05,930 కోట్లు. బహుశా దీనికి కూడా నెహ్రూ, కాంగ్రెసే కారణమని జనం చెవుల్లో ఎక్కించేందుకు పూనుకోవచ్చు. పోనీ ఇంత చేసినా కరోనాతో నిమిత్తం లేకుండా సాధారణ పరిస్థితి ఉన్నపుడే అభివృద్ధి 8 నుంచి 4 శాతానికి తగ్గింది. ఏమిటీ నిర్వాకం అని ఎవరైనా ప్రశ్నిస్తే మీరు దేశభక్తులేనా, ఇక్కడి తిండి తింటూ ఇక్కడి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారా అని దాడి చేస్తారు.

    గతంలో అప్పులు వున్న వారెందరు అని వెతికితే ఇప్పుడు అప్పు లేని వారెవరు అన్నది ప్రశ్న. భారతీయత గురించి లౌడ్‌ స్పీకర్లతో పని లేకుండానే గొంతెత్తి అరచి మాట్లాడేవారి పాలనలో దేశం అప్పుల ఊబిలో కూరుకుపోతోంది.
    తాజా బడ్జెట్‌ పత్రాల్లో వెల్లడించిన సమాచారం ప్రకారం 2022 మార్చి నాటికి కేంద్ర ప్రభుత్వ అప్పు రూ.1,35,87,893 కోట్లుగానూ 2023 మార్చి ఆఖరుకు అది రూ.1,52,17,910 కోట్లకు పెరుగుతుందని ఉంది. అంటే ఏడాది కాలంలో రూ.16 లక్షల 30 వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం కొత్తగా అప్పు చేయనుంది. వర్తమాన కరెన్సీ మారకపు విలువ, ఇబిఆర్‌, క్యాష్‌ బాలెన్సులను పరిగణనలోకి తీసుకుంటే ఈ మొత్తాలు రూ.139,155 లక్షల కోట్లుగా ఉంటాయని ప్రభుత్వమే వివరణలో పేర్కొన్నది. నరేంద్ర మోడీ సర్కార్‌ అధికారానికి వచ్చిన ఏడాది అంటే 2014 మార్చి ఆఖరుకు ఉన్న అప్పు రూ.53,11,980 కోట్లు. ఎనిమిది సంవత్సరాల్లో కొత్త అప్పులు రూ.99,05,930 కోట్లు. బహుశా దీనికి కూడా నెహ్రూ, కాంగ్రెసే కారణమని జనం చెవుల్లో ఎక్కించేందుకు పూనుకోవచ్చు. పోనీ ఇంత చేసినా కరోనాతో నిమిత్తం లేకుండా సాధారణ పరిస్థితి ఉన్నపుడే అభివృద్ధి 8 నుంచి 4 శాతానికి తగ్గింది. ఏమిటీ నిర్వాకం అని ఎవరైనా ప్రశ్నిస్తే మీరు దేశభక్తులేనా, ఇక్కడి తిండి తింటూ ఇక్కడి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారా అని దాడి చేస్తారు.
    ఒక వైపు దేశాన్ని అప్పులపాలు చేయటంతో పాటు మోడీ సర్కార్‌ అనుసరిస్తున్న విధానాలు జనాలను కూడా అప్పుల ఊబిలో దింపుతున్నాయి. కరోనా కాలంలో ప్రభుత్వాలు, జనాలు ఇబ్బందులు, అప్పుల పాలయ్యారు. కుబేరులు మాత్రం మరింతగా పెరిగారు, బలపడ్డారు. ఇదెలా జరిగింది? వారికి అనుకూలమైన విధానాలే కారణం, ఎవరినైనా ఇతర సహేతుక కారణాలు చెప్పమనండి. అనేక మంది పారిశ్రామికవేత్తలు కరోనా కారణంగా తమ సంస్ధలను మూసివేశారు. వాటిని పునరుద్ధరించే పేరుతోనో మరొక సాకుతోనే ప్రభుత్వాల నుంచి రాయితీలు పొందారు. పోనీ వాటిని తిరిగి పెట్టుబడిగా పెట్టి ఉపాధి కల్పించేందుకు పూనుకున్నారా అంటే అదెక్కడా కనిపించటం లేదు. కరోనా తొలి, ద్వితీయ తరంగాల్లో అనేక కుటుంబాలు ఆసుపత్రి ఖర్చుల కోసం ఉన్న ఆస్తులు అమ్మి, అప్పుల పాలైనా అనేక కుటుంబాల్లో ఆప్తులు దక్కలేదు. చేసిన అప్పులు ఎలా తీర్చాలో దిక్కుతోచటం లేదు.
    కుటుంబాలు కరోనాతో ఎలా దెబ్బతిన్నాయో, ఒత్తిడి ఎలా పెరిగిందో వారి బంగారం తాకట్టు ఉదంతాలు వెల్లడిస్తున్నాయి. రిజర్వుబాంకు నివేదిక ప్రకారం 2019 నవంబరు 22 నాటికి బ్యాంకుల్లో బంగారు రుణాల మొత్తం రూ.29,514 కోట్లు కాగా 2021 నవంబరు 19 నాటికి రూ.65,630 కోట్లకు పెరిగాయి. ఇది అర్థిక వ్యవస్ధ సజావుగా లేదనేందుకు ఒక సూచిక. వారు వ్యక్తులు లేదా చిన్న, సన్నకారు సంస్ధల వారు ఎవరైనా కావచ్చు.పత్రికల్లో ఏ రోజు చూసినా బంగారు తాకట్టు సంస్దల వేలం వార్తలు కనిపిస్తాయి. ఒక నాడు ఆర్థిక భరోసా లేదా భద్రతగా భావించి కూడపెట్టుకున్న బంగారాన్ని ఒకసారి తాకట్టు పెట్టిన తరువాత విడిపించుకోవటం పెద్ద సమస్యగా మారుతోంది ఇప్పుడు. ముతూట్‌ ఫైనాన్స్‌ వంటి బంగారం తాకట్టు కంపెనీలు గత ఏడాది 21 శాతం లాభాలు సంపాదించాయి. ఈ ఏడాది తాకట్టు రుణాలు 15 శాతం పెరిగే అవకాశాలున్నట్లు అంచనా.
    గృహ రుణాల్లో వినిమయ వస్తువుల కోసం చేసిన వాటి నుంచి అనేక రకాలు ఉంటాయి. 2020లో జిడిపిలో ఈ అప్పు 12.6 శాతం ఉంటే 2021 మార్చి నాటికి 14.5 శాతానికి పెరిగింది. ఈ కాలంలో జనాలు విలాసవస్తువుల జోలికి పోలేదన్నది అందరికీ తెలిసిందే. 1999లో ఇది కేవలం 2.2 శాతమే ఉంది. ఆ తరువాత జనాలతో అప్పులు చేయించి వస్తువుల కొనుగోలుకు ప్రోత్సహించిన అంశం తెలిసిందే. ఇదే కాలంలో కార్పొరేట్‌ శక్తులు విద్య, వైద్య రంగాల్లో పెద్ద ఎత్తున విస్తరించటం, ప్రభుత్వం ఈ రంగాలను నిర్లక్ష్యం చేసిన కారణంగా రుణగ్రస్త అంశాల్లో ఇవి కూడా ప్రముఖంగా చోటు చేసుకుంటున్నాయి. 2021 మార్చినాటికి గృహ రుణ భారం 393 బిలియన్‌ డాలర్లుగా అంచనా వేశారు (మన కరెన్సీలో దాదాపు 30 లక్షల కోట్ల రూపాయలు).
    కరోనా లాక్‌డౌన్లు, మూసివేతలను ఎత్తివేసిన తరువాత అనేక సంస్థలు తిరిగి పాతవారికి అవకాశం ఇచ్చినప్పటికీ అనేక చోట్ల వేతన కోతలు ఉన్నాయి. అందువలన కుటుంబ అవసరాల కోసం తాకట్టు పెట్టిన బంగారాన్ని ఎంత మంది విడిపించుకుంటారన్నది సందేహమే. కరోనాతో నిమిత్తం లేకుండానే గృహస్తుల పొదుపు తగ్గింది. 2014-15లో జిడిపిలో 13 శాతంగా ఉన్నది 2019-20కి పదకొండు శాతానికి, 2020-21 డిసెంబరు త్రైమాస కాలానికి 8.2 శాతానికి పడిపోయింది. అంటే ఉన్న పొదుపును కరోనా ఖర్చు చేయించింది. కేంద్ర ప్రభుత్వ ఎన్‌ఎస్‌ఓ సమాచారం ప్రకారం గ్రామీణ కుటుంబాల సగటు అప్పు 2012-18 సంవత్సరాలలో 84, పట్టణాలలో 42 శాతం చొప్పున పెరిగింది. 2021 ఐసిఇ 360 సర్వే ప్రకారం 2015-16 నుంచి 2020-21తో పోలిస్తే దేశంలో దిగువన ఉన్న 20 పేద గృహస్తుల ఆదాయం 53 శాతం తగ్గితే ఇదే కాలంలో 20 శాతం ధనికులకు 39 శాతం పెరిగింది. ఈ కాలమంతా నరేంద్ర మోడీ అమలు చేసిన విధానాలే ఉన్నాయి.
   రైతులపై 2021లో రణం సాగించిన నరేంద్ర మోడీ సర్కార్‌ రానున్న రోజుల్లో కార్మిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుంది. లేబర్‌ కోడ్‌ పేరుతో ప్రతిపాదించిన అంశాలు ఇప్పుడున్న బేరమాడే శక్తిని, వారి హక్కులను మరింత హరిస్తాయి. యజమానుల దయాదాక్షిణ్యాలకు వదలివేసే బాటలో నడుస్తున్నారు. జనంపై రణం, దేశానికి రుణాన్ని పెంచటం తప్ప నరేంద్ర మోడీ ఎనిమిది సంవత్సరాల పాలనలో చేసిందేమిటి?

/ వ్యాసకర్త సెల్‌: 8331013288 /
ఎం. కోటేశ్వరరావు

ఎం. కోటేశ్వరరావు