Dec 26,2021 07:15

    ''బ్రతుకంతా భారం, క్రూరం, / ప్రమాదాల తీరం, ఘోరం/ పుట్టటమే మహా పాతకం, / చావే యిక మేల'నుకుంటూ,/ నిరుత్సాహ పడబోకండోయ్!/ నిస్పృహగా వాపోకండోయ్!!' అంటాడు తెన్నేటి సూరి. నీవల్ల కాదులే, ఇంకా ఏం చేస్తాంలే... నువ్వనుకుంటే అయిపోతుందా... ఇంత భారం మోయడం అవసరమా... ఇలా వెనక్కు లాగడం, నిరుత్సాహపర్చడం ఒక పార్శ్వమైతే, దీనికి భిన్నమైన మరో పార్శ్వం... ఓటమి లోంచి విజయాన్ని, నిస్పృహ లోంచి స్ఫూర్తిని వెదుక్కోవడం. ప్రజల నుంచి శక్తిని పొందడం విజయ సాధకుని లక్షణం. 'పాతాళపు లోతుల నుంచీ,/ జలగర్భం చీల్చుకు వచ్చీ, / భూ భాగపు పొలిమేరల్లో,/ పర్వతాల పైగా నఱికీ,/ ఆకాశపు టంచులదాకా,/ స్వర్గానికి రోడ్డేస్తోందోయ్!' అన్నట్లుగా స్ఫూర్తి నింపిన నరజాతి చరిత్ర చూడండి... అంతలా నీరస పడిపోనక్కరలేదు. యుగయుగాల నుంచి ఆకాశపుటంచులను తాకే స్ఫూర్తి మనిషిని విజయపథాన నడిపిస్తూనే వుంది. 'ముళ్లూ, రాళ్లూ, అవాంతరాలెన్ని వున్నా/ ముందు దారి మాది/ ఉన్నచోటు చాలును మీకు/ ఇంకా వెనక్కి పోతామంటారు/ మీలో కొందరు/ ముందుకు పోతాం మేము/ ప్రపంచం మా వెంట వస్తుంది' అంటూ ముందుకు పోతూనే వుంటారు మరికొందరు ప్రగతిగాముకులు.
     పోరాటంలో వెనకడుగు వేయడానికీ, పరిస్థితి బాగోలేదని వెన్నుచూపి పారిపోవడానికీ తేడా వుంది. కింద పడటానికీ లొంగిపోవడానికీ తేడా వుంది. రెండడుగులు వెనక్కి పడితే నీరసపడటం కన్నా... నిలదొక్కుకుని పోరాడే ఉత్సాహం నింపుకోవాలి. వరదలకు పెద్దపెద్ద చెట్లే తిరగబడిపోతుంటాయి. కానీ, గడ్డిపోచలు తలొంచి నేలకు అతుక్కుపోతాయి. వరద తగ్గగానే గడ్డిపరకలు మళ్లీ నిటారుగా నిలబడతాయి. అంత పెద్ద వరద కూడా గడ్డిపరకలను ఏం చేయలేకపోతుంది. ఎందుకంటే... దాని దుంప భూమిలో బలంగా నాటుకుని వుంటుంది. వరద తాత్కాలికం. దానిని తట్టుకుని పెరగడమనేది దీర్ఘకాలికం. కాబట్టి నీ బలం ప్రజల్లో వుండాలి. ప్రజలను అంటిపెట్టుకొని వుండాలి. ప్రజాబలం వున్నంతకాలం... పరిస్థితులు ప్రతికూలంగా వున్నా, ఎన్ని ఒడుదుడుకులు వచ్చినా తట్టుకుని మళ్లీ నిలబడతాం. 'కష్టాలకు నిష్టురపడితే/ అసలెందుకు మొదలెట్టారోయ్?/ కష్టకాల మంతా గడచీ,/ ఈ కాస్తలో వదిలేస్తామా?' అన్నట్టుగా ఒక్కసారి పోరాటంలోకి దిగిన తర్వాత... ఎన్ని కష్టాలెదురైనా తుదివరకు పోరాడాలి... పోరాడి గెలవాలి.
     శ్రీశ్రీ అన్నట్లుగా... ముళ్లు రాళ్లు వుంటాయన్నది కమ్యూనిస్టులు ఎప్పుడూ మర్చిపోరు. గెలుపనేది ఎలాంటి అడ్డంకులు లేని రహదారి కాదు. గెలుపుబాటలో అనేక ఎత్తుపల్లాలు, ఒడుదుడుకులు వుంటాయి. ఓటమి ఎదురైన ప్రతిసారీ నిరుత్సాహ పడటం కమ్యూనిస్టు లక్షణం కాదు. పరిస్థితులను అనుకూలంగా మలచుకుని, ముందుకు పురోగమించడం కోసం నిరంతరం ప్రయత్నించాలి. ప్రతికూల పరిస్థితుల్లోనూ, మన ప్రయత్న లోపం వల్లనూ...ఎదురుదెబ్బలు తగులుతుంటాయి. వాటిని గుణపాఠంగా తీసుకుని మరింత బలపడి ముందుకెళ్లాలి. ఒక్కోసారి ఉద్యమకారులను కూడా నిరుత్సాహం ఆవరించుకుంటుంది. ఏమిచేయాలన్న ప్రశ్న తలెత్తుతుంది. ఎంత పనిచేసినా ప్రజలు స్పందించడంలేదనో, మనతో కలవడంలేదనో, మనం చేస్తున్నది సరైనదేనా అనే మీమాంస ఎదురవుతుంది. ప్రజలపై విశ్వాసం సన్నగిల్లుతుంటుంది. ఇది సరైంది కాదు. ఫలితం వస్తుందనే నమ్మకం కలిగిన రోజున ప్రజలు పెద్దఎత్తున పాల్గొంటారు. ప్రజలు సిద్ధమైనప్పుడే పోరాటాలు చేద్దామనుకుంటే.... అదెప్పటికీ సాధ్యంకాదు. మంట చిన్నదిగా వున్నప్పుడు గాలి ఆ మంటను ఆర్పేస్తుంది. అదే మంట పెద్దది అయితే... ఆ మంటకు గాలి మరింత ఆజ్యం పోస్తుంది. 'మొదటివాడు ఎప్పుడూ ఒంటరే, మొదటి అడుగు ఎప్పుడూ ఒక్కటే. కానీ, వెనుక వచ్చు వాళ్లకది బాట అవుతుంది. నీ కష్టంతో, త్యాగంతో ప్రజల్లో నిరంతరం కృషి చేసినట్లయితే, అదొక పెద్ద ఉద్యమంగా రూపుదిద్దుకుంటుంది. నీ ఒక్క అడుగే రాచబాట అవుతుంది. జనాలకు చైతన్యం కలిగించడం మన పని. దానికి ప్రవచనాలు చెప్పేవాళ్లు కాదు కావాల్సింది. కష్టజీవులతోపాటు కలిసి పనిచేస్తూ, వాళ్లతో వుంటూ, వాళ్లతోనే తింటూ, వాళ్లలో చైతన్యాన్ని నింపి, ఉద్యమం దిశగా వారిని మలచగలిగే వారు కావాలి. 'సోషలిజం నాటిన విత్తనాల్లాంటివాళ్లం మేము/ ఓ వసంత సుప్రభాతాన ప్రపంచవ్యాపితంగా మొలకెత్తుతాము' అని జూలియస్‌ ఫ్యూజిక్‌ అంటాడు. నిరంతరం జనాలతో మమేకమైతే... చైతన్యం మొలకెత్తి వికసించి ప్రజాప్రభంజనంగా మారడం అనివార్యం.