Oct 31,2023 22:45

ప్రజాశక్తి - చిత్తూరు అర్బన్‌, యంత్రాంగం
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి ఆంక్షలతో కూడిన బెయిల్‌ మంజురు కావడంతో తెలుగుదేశం నాయకులు జిల్లా పార్టీ కార్యాలయం, జిజేఏం ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఛైర్మెన్‌ తెలుగుదేశం నాయకులు గురజాల జగన్‌మోహన్‌నాయుడు, గాంధీ విగ్రహం, ముఖ్య నాయకుల నివాసాల వద్ద టపాకాయలు పేల్చి సంబరాలు చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు నిర్ధోషిగా విడుదల కావాలని, ప్రజల ఆంక్షల మేరకు బెయిల్‌ వచ్చిందని. త్వరలోనే ఆయనపై పెట్టిన తప్పుడు కేసులు కొట్టివేయబడతాయని తెలుగుదేశం నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
పుంగనూరులో...చంద్రబాబుపై ఎన్ని కేసులు నమోదు చేసినా అవి ఆధారాలు లేనివేనని నేతలు సివి రెడ్డి, రామయ్య, ప్రసాద్‌, నాగరాజు, బాషా అన్నారు. వెదురుకుప్పంలో.. మండల మాజీ అధ్యక్షులు, వెదురుకుప్పం క్లస్టర్‌ ఇన్‌ఛార్జి మోహన్‌ మురళి ఆధ్వర్యంలో బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. నరసింహయాదవ్‌, పోటుగారి గంగయ్య, భాస్కర్‌నాయుడు పాల్గొన్నారు. వి.కోటలో.. 'సత్యమేవ జయతే' అంటూ టిడిపి అధ్యక్షులు రంగనాథ్‌ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ సర్కిల్లో బాణసంచా పేల్చి స్వీట్లు పంచిపెట్టి సంబరాలు చేసుకున్నారు. ఎన్టీఆర్‌ సర్కిల్‌ నుంచి ర్యాలీ చేయబోగా అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. నగరిలో టిఎన్‌టియుసి అధికార ప్రతినిధి జ్యోతినాయుడు మాట్లాడుతూ ఏ సమయంలో ఎన్నికలు వచ్చినా తాడేపల్లి ప్యాలెస్‌ పోవుట ఖాయమన్నారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేశారు.
బంగారుపాళ్యంలో... మండల అధ్యక్షుల్‌ జయప్రకాష్‌నాయుడు, ప్రధాన కార్యదర్శి జనార్ధన్‌ గౌడ్‌, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు కోక ప్రకాష్‌నాయుడు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్వేటినగరంలో మండల అధ్యక్షులు చెంగల్రాయల్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో గాండ్లమిట్ట కూడలి వద్ద బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఎస్‌ఆర్‌పురంలో... పుల్లూరు క్రాస్‌ వద్ద టిడిజి జిల్లా కార్యదర్శి గంథమనేని రాజశేఖర్‌నాయుడు ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చి సిఎం డౌన్‌డౌన్‌ అంటూ నినాదాలు చేశారు.
యాదమరిలో తెలుగు యువత అధికార ప్రతినిధి వల్లేరు అమరనాథనాయుడు ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. గంగాధరనెల్లూరులో అంబేద్కర్‌ విగ్రహం ఎదుట జిల్లా టిడిపి యాదవ సాధికార సమితి అధ్యక్షులు శ్రీధర్‌యాదవ్‌, పార్లమెంట్‌ కార్యనిర్వహణ కార్యదర్శి కృష్ణమనాయుడు, మండల అధ్యక్షులు స్వామిదాస్‌ పాల్గొన్నారు.