మొక్కుబడిగా సర్వసభ్య సమావేశం
- ప్రజాసమస్యల పరిష్కారంలో అధికారులు స్పందన కరువు
- పలువురు సర్పంచ్‌ల గైర్హాజరు
ప్రజాశక్తి-మర్రిపాడు : స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం ఎంపిపి గంగవరపు లక్ష్మీదేవి అధ్యక్షతన జరిగిన సాధారణ మండల సర్వసభ్య సమావేశం మొక్కబడిగా సాగింది. ఈ సమావేశంలో జెడ్‌పిటిసి మల్లు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ మండలం ఎస్‌సి కాలనీలకు, మసీదులలో పనులు జరిగాయన్నారు. మండలంలో కోటీ 85లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. కొన్ని గ్రామాల్లో కరెంటు స్థంభాలు, ట్రాన్స్‌ఫారంలు కావాలని గడప గడప కార్యక్రమంలో ప్రజలు అడిగారన్నారు. గ్రామ పంచాయతీల్లో ఆన్ ఆఫ్ స్విచ్‌ల కోసం 20 పంచాయతీల్లో ఎస్టిమేషన్ వేయాలని ఎస్‌ఇ చెప్పారన్నారు. గ్రామాల్లో విరిగిన స్థంభాల స్థానంలో కొత్తవి వేయాలని విద్యుత్ శాఖ అధికారులను కోరారు. కృష్ణాపురం సబ్ స్టేషన్‌లో విద్యుత్ సరఫరా సరిగా ఉండడం లేదన్నారు. మండలంలో మూడు సచివాలయాలు పూర్తి కావాల్సి ఉందని త్వరగా పూర్తి చేస్తామని పంచాయతీ రాజ్ ఎఇ తెలిపారు. గ్రామ పంచాయతీలలో తాగునీటి కోసం జలజీవన్ మిషన్ పనులు కొన్నిచోట్ల పూర్తిగా మరికొన్నిచోట్ల పనులు జరుగుతున్నాయన్నారు. జగనన్న కాలనీలకు 22 లేఅవుట్లలో బోర్లు మోటార్ల మంజూరు అయ్యాయని తెలియజేశారు. మండలంలో 51 చెరువుల ఉండగా 10 చెరువులను సోమశిల హై లెవెల్ కెనాల్ రిజర్వాయర్గా మార్చారన్నారు. ఈ సందర్భంగా ఏపిలిగుంట ఎంపిటిసి హజరత్ రెడ్డి మాట్లాడుతూ ఏపిలిగుంట పరిధిలో లైన్మెన్ లేక విద్యుత్ సమస్యతో పంచాయతీ ప్రజలు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అలాగే కొన్ని గ్రామాలలో విద్యుత్ స్తంభాలు కూలేందుకు సిద్ధంగా ఉన్నాయని వాటి స్థానంలో కొత్త స్థంభాలు ఏర్పాటు చేయాలని జరిగిన సమావేశాలలో తెలిపిన అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపిలిగుంట చెరువు పంట కాలువలు గడ్డి మట్టితో ఉన్నాయని పూడిక పనులు చేపట్టాలన్నారు. ఈ సమావేశానికి మూడు శాఖల అధికారులు, పలువురు సర్పంచులు గైర్హాజరు కాగా వారికి మెమోలు జారీ చేస్తామని ఇన్‌ఛార్జి ఎంపిడిఒ మస్తాన్‌ఖాన్ తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ సంజన సిన్హా, ఎంపిడిఒ మస్తాన్ ఖాన్, తహశీల్దారు ఆనందరావు, వైస్ ఎంపిపి రమణమ్మ, మండల సచివాలయాల కన్వీనర్ మోహన్ రెడ్డి, పలు శాఖల అధికారులు, ఎంపిటిసిలు, సర్పంచులు పాల్గొన్నారు.










