పుట్టపర్తి అర్బన్ : నియోజకవర్గాల అభివృద్ధి సమీక్షా సమావేశాలను ఇటీవల జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గుమ్మనూరు జయరాం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పుట్టపర్తి కలెక్టరేట్లో పెనుకొండ నియోజకవర్గం అభివృద్ధిపై కలెక్టర్ అరుణ్‌బాబు ఆధ్వర్యంలో సమీక్ష సమావేశాన్ని శుక్రవారం ఉదయం నిర్వహించారు. ఈ సమావేశాన్ని గంటలోపు ముగించేశారు. సమస్యలపై కనీస ప్రస్తావన లేకుండా నామమాత్రంగా సమావేశాన్ని నిర్వహించి మమ అనిపించారు. 10 గంటలకు ప్రారంభం అవ్వాల్సిన సమావేశం మంత్రి జయరాం ఆలస్యంగా రావడంతో 12 గంటలకు మొదలైంది. అలా సమావేశాన్ని ప్రారంభించి గంట వ్యవధిలోనే సమావేశం ముగించుకుని మంత్రి వెళ్లిపోయారు. సమావేశంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, జెడ్పీ ఛైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, పెనుకొండ శాసనసభ్యులు శంకర్ నారాయణ, ఎమ్మెల్సీ మంగమ్మ, కలెక్టర్ అరుణ్ బాబు, జాయింట్ కలెక్టర్ టిఎస్.చేతన్, పెనుకొండ సబ్ కలెక్టర్ కార్తీక్, డిఆర్‌ఒ కొండయ్య సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించాలన్నారు. నియోజకవర్గంలో అభివద్ధి పనులను మరింత వేగంవంతం చేయాలని సూచించారు. నియోజకవర్గం అభివద్ధిలో భాగంగా మెడికల్ కళాశాల మంజూరు, నేషనల్ హైవే గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ ఇతర ప్రభుత్వ శాఖల ద్వారా అభివద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే శంకర నారాయణ నియోజకవర్గం అభివృద్ధిపై సంబంధిత అధికారులతో మాట్లాడారు. గహ నిర్మాణాలపై ఆ శాఖ పీడీ చంద్రమౌళి రెడ్డి వివరిస్తూ ఇప్పటివరకు వుడా, పిఎంఏవై అర్బన్ కింద 6741 ఇళ్లు మంజూరు అయ్యాయని, వివిధ దశలో ఆ పనులు జరుగుతున్నాయని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో 1380 ఇళ్లు మంజూరు అయ్యాయని తెలిపారు. కొత్తగా మరో 3599 ఇళ్లు కావాలని ప్రభుత్వానికి నివేదించామన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రొద్దం మండలంలోని కోగిర గ్రామానికి చెందిన రైతులు ఫారెస్ట్ భూముల్లో సాగు చేస్తున్నారని వాటికి భూహక్కు కల్పించాలని కలెక్టర్‌ను కోరారు. నియోజకవర్గంలో 4 సబ్‌స్టేషన్లు మంజూరు కోసం 13.45 కోట్లతో ప్రతిపాదించామన్నారు. ముదిగుబ్బ కోడూరు నాలుగు లైను నిర్మాణంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పెనుకొండపై ఇస్కాన్ టెంపుల్ నిర్మాణంలో భాగంగా విద్యుత్ సరఫరా తదితర మౌలిక సదుపాయాల కల్పనకు పర్యాటక అభివద్ధికి చర్యలు తీసుకోవాలని శంకర్ నారాయణ అధికారులను కోరారు. పెండింగ్‌లో ఉన్న రహదారుల పనులు పూర్తి చేయాలన్నారు. గుడిపల్లి రిజర్వాయర్ నిర్మాణంకు రూ.600 కోట్లు వ్యయంతో 2756 టీఎంసీల నీటి సామర్థ్యం కొరకు తీసుకున్న చర్యలు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో పిఆర్ ఎస్‌ఇ భూపాల్ రెడ్డి, డిఆర్‌డిఎ పీడీ నరసయ్య, డిఎంహెచ్‌ఒ డాక్టర్ కృష్ణారెడ్డి, పరిశ్రమల శాఖ అధికారి చాంద్ బాషా, వ్యవసాయ శాఖ అధికారి సుబ్బారావు, వార్డు గ్రామ సచివాలయాల నోడల్ అధికారి శివారెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.










