Jun 08,2023 00:02

పథకాలను వివరిస్తున్న ఎమ్మెల్యే బాబూరావు

ప్రజాశక్తి-కోటవురట్ల: మండలంలో స్థానిక ఎమ్మెల్యే గొల్ల బాబురావు నిర్వహిస్తున్న గడపగడపకు మన ప్రభుత్వం మొక్కుబడిగా సాగుతోంది. బుధవారం రామచంద్రపురం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమం వచ్చామా! వెళ్ళామా? అన్నట్లుగానే సాగింది. గ్రామంలోకి ప్రవేశించడం సంక్షేమ పథకాల కరదీపిక పట్టుకోవడం, ఫోటోలు దిగడం వెళ్ళిపోవడం ఇదే తంతుగా సాగుతోంది. గ్రామంలో పలువురు గ్రామస్తులు కాలనీ ఇల్లు మంజూరు కోసం మొరపెట్టుకున్నారు.రుద్రభూమి నిర్మాణానికి నిధులు కావాలని కోరారు. తాగునీరు, పారిశుధ్యం పట్ల చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ దత్తుడు రాజు పాల్గొన్నారు.
రామచంద్రపురం గ్రామంలో గడపగడపకు కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే శివారు గిరిజన గ్రామమైన అల్లుముయ్యపాలెం గ్రామాన్ని సందర్శించక పోవడం పట్ల పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో కొడవటిపూడి గ్రామ శివారు గిరిజన గ్రామం కోదండరాంపురం, గుట్టువాడ గ్రామ శివారు గిరిజన గ్రామం అణుకు గ్రామాలను సైతం గడపగడపకు మన ప్రభుత్వంలో సందర్శించక పోవడం పట్ల ఆ గ్రామాలకు చెందిన గిరిజనులు సహా మండలంలో పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.
కనిపించని జోష్‌
గతంలో ఎమ్మెల్యే మండలానికి పర్యటనకై వస్తే మండల స్థాయి నాయకులు నుండి గ్రామ స్థాయి నాయకుల వరకు ఎంతో ఉత్సాహంగా సందడిగా స్వాగతం పలికేవారు. అడుగడుగునా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి స్వాగతం తెలిపేవారు. వార్డు సభ్యులు, బూత్‌ కమిటీ కన్వీనర్లు ఎంతో ఉత్సాహంగా పాల్గొనేవారు. అటువంటిది ఇప్పుడు గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు పూర్తిస్థాయిలో హాజరు కాకపోవడం విశేషం.