ప్రజాశక్తి-ఆదోనిరూరల్
మొక్కలు నాటి.. పర్యావరణాన్ని పరిరక్షించుకుందామని విరుపాపురం సర్పంచి ప్రహ్లాద యాదవ్ కోరారు. బుధవారం మండలంలోని విరుపాపురం గ్రామం ప్రధాన రోడ్డుకు ఇరువైపులా తంగరడోన ప్రధాన రోడ్డు నుంచి బినిగేరి మారెమ్మ దేవాలయం వరకు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాల మేరకు ఎన్‌ఆర్‌ఈజిఎస్ ఆధ్వర్యంలో రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటినట్లు తెలిపారు. మొక్కల పెంచితే పర్యావరణానికి మేలు చేసిన వారమవుతామని, మనిషికి గాలి లేకపోతే జీవించలేడని చెప్పారు. ఆక్సిజన్‌ను అందించేవి చెట్లే అని తెలిపారు. వర్షాకాలంలో వర్షాలు సమృద్ధిగా కురవాలంటే మొక్కల వల్లే సాధ్యమవుతుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఇలాంటి విషయాలను గుర్తించుకొని రోడ్లకు ఇరువైపులే కాకుండా, నివాసాల దగ్గర, పొలం గట్లపైనా మొక్కలు నాటి పరిరక్షించుకోవాలని కోరారు. విరుపాపురం ఫీల్డ్ అసిస్టెంట్ సంజీవయ్య, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.
మొక్కలు నాటుతున్న విరుపాపురం సర్పంచి ప్రహ్లాద యాదవ్










