
జిల్లా రెడ్ క్రాస్ ఛైర్మన్ రామబద్రిరాజు
ప్రజాశక్తి - భీమవరం రూరల్
వాతావరణ కాలుష్యంతో అంతుపట్టని వ్యాధులు ఎన్నో వస్తున్నాయని, పకృతి సిద్ధమైన గాలి లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, పర్యావరణ పరిరక్షణపై నిర్లక్ష్యమే ఇందుకు ముఖ్య కారణమని జిల్లా రెడ్ క్రాస్ ఛైర్మన్ డాక్టర్ రామబద్రిరాజు అన్నారు. శ్రీవిజ్ఞానవేదిక అధ్వర్యంలో గ్రీన్ డే పిలుపు మేరకు డిఎన్‌ఆర్ జూనియర్ కళాశాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ఉపాధ్యక్షులు గోకరాజు పాండు రంగరాజు మాట్లాడుతూ అకాల వర్షాలు, అకాల ఎండలు విపరీత ధోరణితో ఉన్నాయంటే వాతావరణ సమతుల్యం లేకపోవడమేనన్నారు. ప్రతి ఎన్‌సిసి, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు మొక్కలను నాటే కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ ప్రతిజ్ఞ నిర్వహించి మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. అనంతరం కళాశాలలో 26 మొక్కలను నాటారు. ప్రిన్సిపల్ శివాజీ రాజు, పాలకవర్గ సభ్యులు కొత్తపల్లి శివరామరాజు, వెంకన్నబాబు, డాక్టర్ శ్రీధర్, రెడ్‌క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు.